– ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు జరుపుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రంగుల కేళీ హోలీ ఉత్సవాలను నగర వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో ఉల్లాసంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబురాలు అంబరాన్నంటేలా వేడుకలు చేసుకున్నారు. ఆట పాటలతో కేరింతలు కొట్టారు. వన్ టౌన్ లోని మాడపాటి క్లబ్ నందు రాజపురోహిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఆప్యాయత, ప్రేమ, సంతోషాల హరివిల్లు హోలీ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తూ కొత్త ఆశల చిగురులు పూయించే హోళీ పండుగను ప్రతిఒక్కరూ ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని, అన్ని వర్గాల ప్రజలు పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని తెలిపారు.
ఈ రంగుల పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపాలని.. ప్రతి ఇంటా సంతోషాల సప్త వర్ణాలు వెల్లివిరియాలని నిండు మనసుతో కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.