Suryaa.co.in

Andhra Pradesh

బాబు బినామీ పోరాటానికి హరగోపాల్ మద్దతా..?

– అంబేడ్కర్ జిల్లాపై బాబు రాద్ధాంతాన్ని గమనించండి.
– మీరూ చంద్రబాబు ట్రాప్ లో పడ్డారా..!?
– భూస్వామ్య వర్గాలకు మద్దతు ఇవ్వడం కోసమే కోదండరామ్‌, హరగోపాల్‌ అమరావతి వచ్చారా..?
– భూములు కోసం రాజధానా? రాజధాని కోసం భూములా? అన్నది మీరూ పరిశీలించాలి
“ప్రపంచబ్యాంక్‌ జీతగాడు బాబు”అన్న మీరే బాబు విధానాలకు మద్దతా..?
– కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చెప్పని వారితో మీరు జత కడతారా!?
– -వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్
డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

దళిత రాజధాని అంటే ఎలా నమ్మేశారు..?
అమరావతి రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమానికి 900 రోజులు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరామ్‌, ప్రొఫెసర్ హరగోపాల్‌ లు సమాచారం సరిగా తీసుకోకుండా వచ్చి పొరపాటు చేశారని భావిస్తున్నాం. దళిత రాజధాని అంటే ఎలా నమ్మేశారని అడుగుతున్నాం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలన్న అన్ని పక్షాలు విజ్ఞప్తి మేరకు బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అని పేరు పెడితే పెద్ద విధ్వంసమే జరిగింది. ఆ ఘటనలో ఎస్సీ మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్ళను తగలబెట్టి, హింసాకాండకు దిగారు. దాన్ని ప్రశ్నించలేనివాళ్లు, దాన్ని ఎండార్స్‌ చేసినవాళ్లతో, ఆ ఘటనను ఖండించనివాళ్లతో మీరు కలిసి మాట్లాడటం, వాళ్లు దళిత రాజధాని అని చెబితే నమ్మడం ఎంతవరకూ ధర్మమో ఆ కార్యక్రమానికి వ్చచిన పెద్దలు ఆలోచించాలి.

ల్యాండ్ పూలింగ్ లో దళిత రైతులకు అన్యాయం చేసింది వాస్తవం కాదా..?
టీడీపీ హయాంలో.. భూ సమీకరణ జరిగేటప్పుడు దళిత రైతుల భూముల విషయంలో వాళ్లకు ప్యాకేజీ రాదని, ప్రభుత్వం ఉన్నపళంగా రైతుల భూములు లాగేసుకుంటుందని భయపెట్టారు, బెదిరించారు. రైతులను భయపెట్టి వాళ్ల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ అనుమాయులు కొనుక్కున్న తర్వాత ఆ భూములకు ప్యాకేజీ ఇచ్చి, దాన్ని చట్టబద్ధత చేశారు. దళితులను మోసం చేయడం ఎంత దారుణం. అలాంటిది దళిత రాజధాని అని ఎలా అంటారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాన్ని మీరు నమ్మేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో పొరపాటు జరిగిందేమో అని ఆలోచించుకోవాలని ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

రాజధాని రైతుల భూముల విషయంలో గతంలో హరగోపాల్‌, కోదండరామ్‌ లు చంద్రబాబు చెప్పిన సింగపూర్‌ విధానం ఏంటి? వాళ్లు రాజధానిని అభివృద్ధి చేయడం ఏంటి? పచ్చని పంట పొలాలను లాక్కుని, ల్యాండ్‌ పూలింగ్‌ ఏంటి అంటూ ప్రశ్నించారు. మరి ఆ పెద్దలే ఇప్పుడు దాన్ని ఎండార్స్‌ చేస్తున్నారా? సింగపూర్‌ సంస్థలకు ఇవ్వొచ్చు అని అంటున్నారా? భూములు లాక్కోవడం కరెక్ట్‌ అని అంటున్నారా? అనే విషయాలపై వాళ్లు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాను.

అసలు భూములు కోసం రాజధానా? రాజధాని కోసం భూములా? ఈ ఎపిసోడ్‌ ఏంటో కోదండరామ్‌, హరగోపాల్‌ లు పరిశీలన చేయాలని కోరుతున్నాను. వాళ్ల భూముల్లో రాజధాని నిర్మిస్తే వాటి ధరలు పెరుగుతాయనా? చంద్రబాబు నాయుడు బృందం చేసిన హల్‌చల్‌లో వీరు ఇరువురు పాల్గొనడం, దళితుల కోసం, దళితుల రాజధాని అమరావతి అని చంద్రబాబు చెబితే నమ్మేశారా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో కోదండరామ్‌, హరగోపాల్‌ పడ్డారా అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు గురించి మా కంటే మీకే బాగా తెలుసు.

కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చెప్పని వారితో జత కడతారా?
దళితుల గురించి మాట్లాడేవాళ్లు కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు ఉంచమంటున్నారా? లేదా? టీడీపీ మహానాడులో అంబేద్కర్‌ పేరు మీద జిల్లా ఉండాల్సిందే అని చంద్రబాబు నాయుడు తీర్మానం చేస్తూ ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్‌ చేయలేదు. ఆ హింసను, మంత్రి ఇంటిని తగులబెట్టిన సంఘటనను ఖండిస్తున్నామని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు చెప్పలేకపోయారు? అలాంటి పార్టీలతో మీరు జత కడతారా?

దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చోటు కల్పిస్తూ పెద్ద పీట వేశారు. 25మంది మంత్రుల్లో 17మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించడమే కాకుండా అనేకమందికి ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టి ప్రోత్సహిస్తున్నారు. రిప్రజెంటేటివ్‌ డెమోక్రసీ అంటే సమసమాజ స్థాపనకు ఒక అడుగు ముందుకు వేసినట్లే కదా? దాన్ని మీరు పాజిటివ్‌గా ఎందుకు ఎగ్జామిన్‌ చేయలేకపోయారు?

పేదవారికి, దళితులకు పదవులు ఇవ్వడాన్ని ప్రోత్సహించనివారిని, సమాజంలో వారికి గౌరవం దక్కడాన్ని, వారికి న్యాయం జరగడాన్ని వ్యతిరేకించేవారితో కలిసి మీరు వేదిక పంచుకోవడం బాధాకరం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని మీరు ఎందుకు సమర్థించడం లేదని వాళ్లని మీరు ఎందుకు ప్రశ్నించలేదు?

రాష్ట్రంలో బడుగులకు జరుగుతున్న మేలు ఆ మేధావులకు కనిపించలేదా..?
రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయి, ఇంగ్లీషు మీడియంతోపాటు, విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్న ప్రభుత్వం ఇదే. దాన్ని మీరు ఎందుకు ఎండార్స్‌ చేయలేదని ప్రశ్నిస్తున్నాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మెరుగుపడుతుంటే దాన్ని మీరెందుకు ప్రశంసించరు. మంచి పనులను మంచి అని చెప్పడానికి మీరెందుకు ముందుకు రాలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం 31లక్షల మంది పేదలకి ఇళ్లు ఇస్తున్న కార్యక్రమం బృహత్తరమైంది. ఇళ్లులేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తున్న కార్యక్రమాన్ని మీలాంటివాళ్లు మెచ్చుకుని ఉంటే ఎంత బాగుండేది. మీ గౌరవానికి ఎంత ఉన్నతంగా ఉండేది.

జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతిలో రైతులకు పలు ప్యాకేజీలు ప్రకటించారు. చంద్రబాబు కౌలు రూ. 2,500 ఇస్తామంటే జగన్‌గారు 5వేలు ఇస్తున్నారు. రైతులకు ప్యాకేజీలను కూడా పెంచడం జరిగింది. మెట్ట భూములకు, జరీబు భూములకు ఇచ్చే ప్లాట్లు విస్తీర్ణం కూడా పెంచాం. రైతులకు ఇలాంటి ప్రోత్సహకాలు ఇస్తుంటే కోదండరామ్‌, హరగోపాల్‌గారు వీటిని ఎలా విస్మరించారని అడుగుతున్నాం.

చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి, టీడీపీ విధానాల పట్ల గతంలో మీకు చాలా స్పష్టమైన వైఖరి ఉండేది. బాబు విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంక్‌ విధానాలను బాగా ఎక్స్‌పోజ్‌ చేసింది కూడా మీరే. చంద్రబాబుకు “ప్రపంచబ్యాంక్‌ జీతగాడు బాబు” అని పేరు పెట్టింది కూడా మీరే అనుకుంటా.

బాబు ట్రాప్ లో మీరూ పడ్డారా..?
స్వాతంత్ర్యం వచ్చి75 ఏళ్ల అయిన సందర్భంగా సామాజిక న్యాయం అంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అలాంటివేళ కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెడితే టీడీపీ మహానాడులో ఒక తీర్మానం లేదు, చంద్రబాబు నోటి నుంచి అవునో, కాదో అనేదానిపై ఒక మాట లేదు. కోనసీమలో జరిగిన హింసను ఖండిస్తూ పవన్‌ కల్యాణ్‌ మాట్లాడలేదు. అలాంటి వాళ్లు దళితులకు న్యాయం చేస్తారని మీరు నమ్మారంటే ఏదో ట్రాప్‌ జరిగింది. మీరు చంద్రబాబు ట్రాప్ లో పడ్డారు. అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్‌ వస్తుందన్న చంద్రబాబు అండ్ కో మాటలు మీరు కూడా నమ్మారా?

ముఖ్యమంత్రి చిన్న జిల్లాల ద్వారా ప్రజలకు పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకురావడం, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గడప గడపకు సత్వర సేవలను అందిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు వాళ్ల సమస్యలను వాళ్ల గ్రామాల్లోనే పరిష్కరించుకుంటున్నారు. ఆవిధానం దేశంలో ఎక్కడైనా ఉందా? పేద వర్గాల పక్షాన మాట్లాడే మీరు.. నూతన జిల్లాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ, లక్షా 40వేల కోట్ల రూపాయలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా డీబీటీ ద్వారా పేదలకు అందించడం.. వీటిని గమనించారా, ఇవి దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? అది జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పాలనలోనే సాధ్యమైంది. గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చి కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంది జగన్‌గారి ప్రభుత్వమే కదా? అమరావతి ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్న మీరు గతంలో జరిగిన లోపాలను ఎందుకు ప్రశ్నించలేదు.

కోదండరామ్‌, హరగోపాల్‌ లు అమరావతి వచ్చి భూస్వామ్య వర్గాలకు మద్దతు పలికారా..?
బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తన పరిపాలనలో పెద్దపీట వేశారు. అదే చంద్రబాబు తన పాలనలో ఈ వర్గాలకు ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. వన్‌ సైడే మీరు విని చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. దళితులకు సామాజిక న్యాయం, వారి మేలును వ్యతిరేకించే వర్గాలతో మీరు కలిసి కూర్చున్నారని మేం భావిస్తున్నాం. కోదండరామ్‌, హరగోపాల్‌ లు అమరావతి వచ్చింది భూస్వామ్య వర్గాలకు మద్దతు పలకడానికే. దళితుల అభివృద్ధి, సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించేవారి డిమాండ్లకు సానుకూలత ప్రకటించడం బాధాకరం.

అమరావతి రాజధానికి మద్దతుగా దేశ విదేశాల నుంచి మాట్లాడారని చెబుతున్నారే? అదే కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని ఎక్కడా ఉద్యమం చేయలేదే? అమరావతి రాజధాని కోసం చేస్తారు కానీ, కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెడితే అమెరికా, ఆస్ట్రేలియా, విదేశాల్లో దానికి మద్దతుగా ఎందుకు ప్లకార్డులు ప్రదర్శించలేకపోతున్నారు. దానినిబట్టి అర్థం కావడం లేదా, మీ ఉద్దేశాలు, ధ్యాస అంతా కేవలం భూమి మీదే ఉందికానీ, ఆ భూమి మీద వచ్చే పెట్టుబడి, లాభాలు, డబ్బుల కోసమే తప్ప, దళితుల కోసం కాదు.

కోనసీమ జిల్లాకు పేరు పెట్టడానికి అంబేడ్కర్ అర్హుడు కాదని మీరూ భావిస్తున్నారా..?
అమరావతి ఉద్యమానికి సంఘీభావం చెబుతారే కానీ, కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడానికి ఎందుకు సంఘీభావం తెలపరు? అంబేద్కర్‌ అందుకు అ‍ర్హుడు కాడా? అంబేద్కర్‌ పేరు పెట్టగానే మీ భావన, స్వభావం, మీ అసలు రంగులు బయటపడ్డాయి.

అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం అంతా ఒక పెద్ద ప్రహసనం. ఆ ప్రహసనాన్ని గొప్పగా చూపించుకోవడానికే అమరావతికి కొంతమంది పెద్దలను తీసుకువచ్చారు. సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులతో వారు కూర్చోవడం భావ‍్యం కాదు. అమరావతి రాజధానిపై హైకోర్టు జడ్జిమెంట్‌ను ఇంప్లిమెంట్‌ చేయడం, చదవడం సాధ్యం కాదు. ఆ విషయం రిటైర్డ్ జడ్జి గోపాల్‌ గౌడ్ కి తెలియదా?

ఉదాహరణకు, గతంలో 87వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేస్తామని, మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అందుకోసం అధికారంలోకి వచ్చాక, కోటయ్య కమిషన్‌ వేశారు. దాంట్లో కోతలు కోసి, చివరకు 25వేల కోట్లు అని తేల్చి, ఆఖరకు, ఆయన అధికారం నుంచి దిగిపోయేనాటికి, 15వేల కోట్ల రూపాయిలు ఇచ్చి, మిగతాది రైతులకు చెల్లించలేదు. చంద్రబాబు ఎగ్గొట్టిన రుణాలు ఇప్పుడు ప్రభుత్వం చెల్లించాలనా మీరు చెప్పేది? చంద్రబాబు ఆరోజు చెప్పాడు కాబట్టి ఇప్పుడు జగన్‌గారు కట్టాలా? అది భావ్యమా? అది జడ్జిమెంట్‌ అవుతుందా? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు న్యాయం చేస్తారు. వారి సంక్షేమాన్ని కోరుకునే ముఖ్యమంత్రి జగన్ గారు, వారికి ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తారు. రైతులకు నష్టం చేసిందేమైనా ఉంటే అది గత టీడీపీ ప్రభుత్వమే చేసింది.

LEAVE A RESPONSE