”ఏవండీ నానిగాడికి 12 వేల రూపాయలు కావాలంట’! భోజనం వడ్డిస్తూ అన్నది లక్ష్మి.
ఆనందంగా భోజనం చేస్తున్న ప్రకాష్‌కి పొలమారింది. నీళ్ల కోసం సైగ చేశాడు. భార్య అందించిన నీళ్లు తాగి కొంచెంసేపు స్థిమిత పడ్డాడు!
”పన్నెండు వేలు కావాలని భోజనం టైములో చెబుతావా ఆ..రు!” అని కసురుకోబోయాడు ప్రకాష్, కానీ మళ్లీ పొలమారింది. ఈ సారి మోతాదు ఎక్కువైంది. భర్త అడగ కుండానే నీళ్లు తాపి, గుండెల మీద చేత్తో రాసింది. అప్పుడు కుదుటపడ్డాడు.
”మీ కొడుకు ఏదైనా కావాలంటే, భోజనం టైములోనే చెప్పమన్నారు కదా’! అన్నది లక్ష్మి చిరుకోపంతో.
”చాల్చాల్లే! ఏడోతరగతి చదువుతున్న బుడ్డ వెధవకి పన్నెండు వేలు ఎందుకు? ఆ ఫీజు, ఈ ఫీజులంటూ ఇప్పటికీ ఆ ప్రయివేటు స్కూలుకి మూడు లక్షల రూపాయలు నా రెక్కల కష్టం ధారబోశాను కదే! ఇంకా ఎక్కడి నుండి తెచ్చేది? అయినా అంత డబ్బు ఎందుకు? ఎక్స్‌కర్షన్‌కు ఏమైనా పోతున్నారా? నీవు కూడా దాచిపెట్టిన డబ్బులు దోచిపెట్టకు”! అన్నాడు ప్రకాష్ కరాఖండిగా!
”అబ్బా! అసలు మీ సుపుత్రుడు పన్నెండు వేలు ఎందుకడిగాడో తెలుసా?” అన్నది లక్ష్మి.
”నీవు చెప్పందే నాకెలా తెలుస్తుంది?” అంటూ లేచాడు ప్రకాష్.
”మార్కులు ఎక్కువగా రావాలని…” నసిగిందామె.
”ఆ… మార్కులు ఎక్కువగా రావాలని…” అంటూ రెట్టించాడు.
”క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి ఎవడికో లంచం ఇస్తాడంట”! అన్నది లక్ష్మి.
ఈసారి కళ్లు తిరిగి కింద పడబోయి భార్య ఆసరాతో నిలదొక్కుకున్నాడు.
”ఏం మాట్లాడుతున్నావే?” అన్నాడు ప్రకాష్ అయోమయంగా.
”లంచం ఇవ్వటానికి పన్నెండు వేల రూపాయలు అడిగాడు. మీ నాన్న దగ్గర అన్ని డబ్బులు లేవు! అన్నాను. అప్పు తెచ్చి ఇవ్వమన్నాడు.” అన్నది లక్ష్మి.
”అంత మాటన్నాడా. ఎక్కడ వాడు?” అన్నాడు ప్రకాష్ కోపంగా.
ఇంతలో నానిగాడు వచ్చాడు.
కొడుకును చూడగానే ప్రకాష్‌కి కోపం కట్టలు తెంచుకున్నది. ఒక్క ఉదుటన వెళ్లి కొడుకు చొక్కా కాలర్ పట్టుకున్నాడు.
”చంపేస్తాను వెధవా? క్వశ్చన్ పేపర్ కోసం లంచం ఇస్తావా?” అంటూ కొట్టబోయాడు, లక్ష్మి వెళ్లి కొడుకును విడిపించింది!
”చదువుకుని మార్కులు సంపాదించుకోవాలి గాని లంచమిచ్చి క్వశ్చన్ పేపర్ లీక్ చేయించుకోవటం ఏమిట్రా? అసలు ఇదెక్కడి ఆలోచన? ఎవరిని చూసి నేర్చుకున్నావురా?” అన్నాడు ఆగ్రహంతో ప్రకాష్.
”అదానీని చూసి నేర్చుకున్నాను!” అన్నాడు నానిగాడు కాలర్ సరిచేసుకుంటూ.
భార్యాభర్తలు ఇద్దరూ షాక్ తిన్నారు!
”ఏం మాట్లాడుతున్నావ్‌రా? నరాలు కట్ అయిపోయినయి!” అన్నాడు ప్రకాష్, అదేదో సినిమాలో హాస్య నటుడిలా.
”అవును! కరెంటు అమ్మటానికి రెండు వేల కోట్ల రూపాయలు ఆఫీసర్లకి అదానీ లంచం ఇచ్చాడని, టీవీల్లో, పేపర్లలో, మా స్కూలు వాట్సప్ గ్రూపులో కూడా వచ్చింది! నాకు మార్కులు తక్కువ వస్తున్నాయని ఎప్పుడూ నువ్ తిడుతుంటావు కదా డాడీ!” అన్నాడు నానిగాడు.
”ఏంట్రా నీవు మాట్లాడేది! నీకు, అదానీకి సంబంధం ఏమిటీ?” అన్నది లక్ష్మి కోపంగా.
”మమ్మీ…అదానీలు, అంబానీలు ఎంతో గొప్పవారనీ, వారిని చూసి నేర్చుకోవాలనీ డాడీ ఎప్పుడూ చెబుతుండేవాడు నీకు గుర్తుందా?” అడిగాడు నానిగాడు.
”వేలెడంత లేవు! వెధవా! అదానీ, అంబానీలు ఎక్కడా? నీవెక్కడా? నీకూ వాళ్లకూ ఏమైనా సంబంధం ఉందా?” అంటూ మళ్లీ నానిగాడిని కొట్టబోయాడు.
”డాడీ…నీవు చెప్పిందే ఫాలో అవుతున్నాను! నా మీద చేయి వేస్తే బాగుండదు!” అన్నాడు నానిగాడు తల్లి వెనక దాక్కుని.
”అంతా నీ వల్లే!” లక్ష్మి మీద గరుమన్నాడు ప్రకాష్.
”డాడీ! ఇందాకే చెప్పాను కదా! నీవు చెప్పిందే ఫాలో అవుతున్నానని, అయినా మమ్మీని ఎందుకు తిడతావు? నాకు భగత్ సింగ్, నేతాజీ, రంతిదేవుడు, సత్యహరిశ్చంద్రుడు లాంటి వాళ్ల కథలను మమ్మీ చెబుతుంటే, అలాంటి పాత చింతకాయ కథలు ఎందుకు చెబుతున్నావని తిట్టావు గుర్తుందా?” అడిగాడు నానిగాడు.
”అయితే ఏంటి?” అన్నాడు ప్రకాష్.
”భగత్‌సింగ్ లాంటి వాళ్ల కథలు వినటం మానేసి, నీవు చేప్పే ధీరూబారు అంబానీ, ముఖేష్ అంబానీ, గౌతం అదానీ లాంటి వాళ్లవి విన్నాను. నాలాంటి వాళ్లు అంబానీ, అదానీలను చూసి నేర్చుకోవాలని, వాళ్ల లాగా తయారు కావాలని నీవు చెప్పావు. అంతే కాదు, మోడీ తాత, అంబానీ, అదానీలతో ఉన్న ఫొటోలు కూడా చూపించావు! వారు ఈ దేశ ప్రజల కోసం ఎంతో సంపద సృష్టిస్తున్నారని మోడీ తాత కూడా అన్నారు. అందుకే నేను కూడా సంపద సృష్టించాలని, అందుకోసం ముందుగా ఎక్కువ మార్కులు సంపాదించాలని అనుకున్నాను. అందుకే అదానీ ఇచ్చినట్లే నేను కూడా లంచం ఇవ్వటానికి పన్నెండు వేల రూపాయలే అడిగాను. డబ్బులు ఇవ్వు డాడీ!” అన్నాడు నానిగాడు.
ఆ మాటలకు కళ్లు తిరిగి పడిపోయాడు ప్రకాష్!
”వాళ్లు…సంపద సృష్టికర్తలు కాదురా నానిగా…దేశ సంపదను బొక్కేవాళ్లు. ఆ అవినీతి తిమింగలాల గురించి తర్వాత చెప్తాగానీ…ముందు మీ నాన్న సంగతి చూద్దాం రా…” అంది కంగారుగా.
– ఫేస్‌బుక్ నుంచి సేకరణ