ఖతార్ దేశంలో 8 మంది భారతీయులకి గూఢచర్యం ఆరోపణపై మరణ శిక్ష వేశారు. సౌదీ , ఈజిప్టు ఇంకా అనేక దేశాలు తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా ఉంటే, ఈ ఖతార్ దేశం మాత్రం కొన్ని వాటికి అనుకూలంగా ఉందని అక్కడ వార్తలు వస్తున్నాయి. మన ఇండియా ప్రభుత్వం తక్షణం ఈ విషయంలో కల్పించుకుని భారతీయుల ప్రాణాలు కాపాడాలి.
ఇక రెండో విషయం మాల్దీవులకు కొత్తగా ఎన్నికైన మహమ్మద్ ముజ్జు అక్కడ ఉన్న భారత దేశ సైన్యాన్ని వెళ్ళిపొమ్మని చెప్పి కోరారు. అలా అయితేనే ఆ దేశం నిజమైన స్వతంత్ర దేశంగా ఉంటుందని ఉవాచ పలికారు. ఈ సదరు వ్యక్తి చైనాకి బాగా అనుకూలుడు అని పేరు. వీళ్ళ మామగారు శ్రీలంకలో ఉన్న కొన్ని కిరాయి హంతుకుల గ్రూపులకు ధనమిచ్చి మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆక్రమిద్దామని చూస్తే , అప్పటి అధ్యక్షుడు అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వ సైనికులు ఆ దేశానికి వెళ్లి దాన్ని కాపాడుతున్నారు.
దాదాపు 1400 సంవత్సరాలు బుద్ధిజం ప్రభావం లో ఉన్న మాల్దీవులు, తర్వాత ఇస్లాంకి మారింది. 99.99% ముస్లింలే. ఇంతకీ అక్కడ ఉంది కేవలం 70 మంది ఇండియన్ ఆర్మీ మాత్రమే. కొంతమంది సైనికులు ఉంటేనే ఆ దేశం స్వతంత్ర కోల్పోతే , అమెరికా ఆర్మీ సౌదీ అరేబియా తో సహా అనేక దేశాల్లో ఉంది. అప్పుడు ఆ దేశములు స్వతంత్రం కోల్పోయినవా?
మాల్దీవుల భూవిస్తీర్ణం కేవలం 298 చదర కిలోమీటర్లు. జనాభా 5,21,000… అదే కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దాదాపు 90000 చదరపు కిలోమీటర్లు సముద్ర /భూభాగం వాళ్లది ఉంటుంది. మన భారతదేశానికి అత్యంత దగ్గరలో ఈ ద్వీప సమూహాలు ఉన్నాయి.
వచ్చే వంద సంవత్సరాల్లో ఈ దేశ మునిగిపోతుంది అనే భావనున్నా సరే, ఆ ప్రాంతం మాత్రం ఇండిపెండెంట్ గా మనగలుగుతుంది. ముష్కర పాక్/ చైనా కబ్జాలోకి అది వెళితే మన దేశానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశంకు నరకయాతనే. ఈ రెండు సమస్యలు పరిష్కరించాల్సిన దేశ ప్రధానమంత్రి.. నిన్న మహారాష్ట్రలో శరద్ పవార్ గారిని, మొన్న ఇంకొకరిని ఈ తిట్టే కార్యక్రమంలో తీవ్రంగా నిమగ్నమై ఉన్నారు అని వార్తలు వచ్చాయి.
సరే అవి రాజకీయాలు. ఇక శ్రీలంకలో కూడా చైనా వాళ్లు పాగా వేశారు అదేవిధంగా మన పక్కన ఉన్న నేపాల్, బర్మా దేశాల మీద కూడా చైనా పట్టు బిగించింది. ఆఫ్ఘనిస్తాన్ దేశం మన పట్టు నుండి జారిపోయింది. ఇక ఎలాగో దిక్కుమాలిన పాకిస్తాన్ ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లేదు. అమెరికాలో ట్రంప్ గారికి ఎన్నికల ప్రచారం చేసిన గొప్పలు గౌ.. మోదీజీ పక్కనపెట్టి, మన దేశ సార్వభౌమత్తాన్ని కాపాడుకుంటూ విదేశీ వ్యవహారాలని బాగా పెట్టుకోవాల్సిన అవసరం మన దేశ ప్రభుత్వానికి ఉంది.
– చలసాని