Suryaa.co.in

Telangana

మోదీ నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారు

రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ కి కుటుంబం లేదంటూ విమర్శలు చేస్తున్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ, వారసత్వ, అవినీతిని ఎండగడుతున్నందుకే మోదీ కి కుటుంబం లేదని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు కుటుంబమే ఫస్ట్ అని పనిచేస్తుంటే… మోదీ మాత్రం నేషన్ ఫస్ట్ నినాదంతో పని చేస్తున్నారన్నారు.

140కోట్ల దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులని మోదీజీ భావిస్తారని తెలిపారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా మోదీకి బ్రహ్మరథం పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. మేరా భారత్‌ – మేరా పరివార్‌ అనే భావనతోనే మోదీజీ జీవిస్తున్నారని,.. ప్రతిక్షణం ప్రజలకు సేవ చేసేందుకే ఆలోచిస్తూ ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకు శ్రమిస్తారని గుర్తుచేశారు. అందుకే, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో దేశ ప్రజలంతా ఏకమవుతున్నారని అన్నారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆరు గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి 90 రోజులు గడిచినా కూడా అమలు చేయలేకపోతున్నారని చురకలు అంటించారు. కేసీఆర్ అడుగుజాడల్లో, బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మజ్లిస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలో నిలిచేది, గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE