– మోదీ స్పూర్తితోనే ఈ సైకిళ్ల పంపిణీ
– విద్యారంగానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్న మోదీ సర్కార్
– నేనూ మీలాగే పేదరికం నుండి వచ్చిన వాడినే…
– తిండికి ఎన్నో ఇబ్బందులు పడ్డా…
– మా అమ్మానాన్న ఎంతో కష్టపడి మమ్ముల్ని పెంచారు
– కష్టపడి ఈ స్థాయికి వచ్చిన…
– మీరు కూడా మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుచేసుకోండి
– తల దించుకుని చదవండి… తల ఎత్తుకునేలా ఉన్నత స్థానాల్లోకి వెళలారు
– నా గెలుపునకు ప్రధాన కారణం చిన్నారులే…
– 50 శాతం ఓట్లు వారి వల్లే వచ్చాయి
– పిల్లలపై నాపై చూపుతున్న అభిమానానికి ఏమిచ్చి రుణం తీర్చుకోను?
– నేను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ పిల్లలకు సైకిళ్లు అందిస్తా..
– సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు ప్రతీక సైకిల్ : కలెక్టర్ పమేలా సత్పతి
– కేంద్ర మంత్రిని సత్కరించిన ఎమ్మెల్సీ కొమరయ్య
– మూకుమ్మడిగా బండి సంజయ్ కు ముందస్తుగా ‘‘హ్యాపీ బర్త్ డే’’ శుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు
– కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా ‘సైకిళ్ల పంపిణీ’
– కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతులు మీదుగా సైకిళ్ల పంపిణీ ప్రారంభం
కరీంనగర్: స్థానిక అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 20 వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశల వారీగా పంపణీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. తొలుత టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో, డీఈవోతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే….
ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ సమాజానికి సేవ చేయాలనే మాలో ఎప్పటికప్పుడు స్ఫూర్తినింపిన నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ. వారి బాటలో నడుస్తూ మాకు చేతనైనంత సాయం చేస్తున్నాం. ఈ సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే కలెక్టర్. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ ప్రతిపాదించారు. ఆ ఆలోచనతోనే ఈరోజు టెన్త్ విద్యార్థినివిద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నం.
ఇవి ప్రభుత్వ నిధులు కావు. అట్లని నేను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదు. మా దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత సీఎస్సార్ ఫండ్ కింద ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి ఆ నిధులు అందిస్తే వాటితో సైకిళ్లను కొని మీకు పంపిణీ చేస్తున్నా.
నేను కూడా చిన్నప్పటి నుండి మీలాగే పేదరికంలో పెరిగిన. ఇక్కడే కాపువాడలో పుట్టి పెరిగిన. తినడానికి ఇబ్బంది పడ్డ. మా తల్లిదండ్రులు మమ్ముల్ని ఎంతో కష్టపడి చదివించారు. మీలాగే అనేక కష్టాలు పడ్డ. మీ అమ్మనాన్నల్లాగే మా అమ్మనాన్న కూడా వంట చేయడానికి, చదివించడానికి నానా కష్టాలు పడ్డవాళ్లే. కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. కష్టాలు తెలిసిన వ్యక్తిని కాబట్టే మీరు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని సైకిళ్లను పంపిణీ చేస్తున్నా. కలెక్టర్ ఈ విషయంలో రోల్ మోడల్.
ఒడిశా నుండి వచ్చి కష్టపడి పనిచేస్తూ మీ అందరికీ స్పూర్తిగా ఉన్నారు. పోలీస్ కమిషనర్ బీహార్ నుండి ఇక్కడికి వచ్చారు. ఆయన తండ్రి మిలటరీలో పనిచేశారు. క్రమశిక్షణతో ఎదిగి వచ్చారు. వీళ్లే కాదు… మహాత్మాగాంధీ, అంబేద్కర్, మోదీ కూడా పేదరికం నుండి ఎదిగిన వాళ్లే. ముఖ్యంగా అంబేద్కర్ ఎన్ని కష్టాలు అనుభవించారో, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారే మాటల్లో చెప్పలేం. ఇప్పుడు మీ కష్టాలను తీర్చడానికి మోదీ ఉన్నారు. మా హయాంలో ఆదుకునే వాళ్లే లేరు.
మోదీ ప్రభుత్వం విద్యా రంగానికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. యూపీఏ హయాంలో (2014 15 బడ్జెట్లో) విద్యా రంగానికి కేంద్రం 68 వేల 728 కోట్లు మాత్రమే కేటాయిస్తే… ఈ ఒక్క ఏడాదే(2025 26) 1 లక్షా 28 వేల 650 కోట్ల రూపాయలు కేటాయించింది. అంటే యూపీఏతో పోలిస్తే విద్యా రంగానికి నిధుల కేటాయింపు రెట్టింపు పెరిగింది. ఈ 11 సంవత్సరాల్లో ఒక్క విద్యా రంగానికే దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశామంటే విద్యా రంగంపై మోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు మీకందిస్తున్న సైకిళ్లు మోదీ గిఫ్ట్. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో ‘‘మోదీ కిట్స్’’ను అందజేయబోతున్నాం. ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్ష ల మంది ఉన్నా వాళ్లందరికీ మోదీ కిట్స్ ను అందిస్తా. మీ తల్లిదండ్రులు ఎంతో పేదరికంలో ఉంటూ మిమ్ముల్ని కష్టపడి చదివిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తలదించుకుని చదవాలి… బాగా చదివి తల ఎత్తుకు తిరిగేలా బతకాలి. నేను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లను అందజేస్తా. మోదీ కిట్స్ కూడా అందజేస్తా. ఇది నా హామీ. సైకిల్ తీసుకున్న వాళ్లంతా నెల రోజుల తరువాత ఆ సైకిల్ ను పూర్తిగా ఫిట్ చేయించుకోవాలి. మీ భవిష్యత్తుకు సైకిల్ ను వాడుకోండి. ఆయురోగ్యాలంతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ మిమ్ముల్ని కన్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా…
టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య…
బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మా అందరికీ ఆదర్శం. ఇతర ప్రజా ప్రతినిధులు కూడా స్పూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లను పంపీణీ చయాలనే ఆలోచనను తీసుకొచ్చారు. పేదరికం నుండి వచ్చిన మోదీ చాయ్ అమ్ముతూ ప్రధానిగా ఎదిగారు. బండి సంజయ్ కూడా సామాన్య కుంటుంబం నుండి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. నేను కూడా పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. మాతృభాషలో చదువుకున్నా ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. సిన్సియర్ గా చదువుకుంటే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి….
ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థినివిద్యార్థులందరికీ 20 వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదే. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్. నాకు కూడా చిన్నప్పుడు సైకిలే నా ఆస్తి. ఆటోలు, బైకులు, కార్లపై స్కూల్ కు వెళ్లి ట్రాఫిక్ కు కారణం కంటే సైకిల్ పై స్కూల్ వెళ్లడమే మంచిది. దీనివల్ల ఎవరిపై ఆధారపడకుండా సమయానికి స్కూల్ కు వెళ్లి వచ్చే అవకాశముంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ అలవాటు చేయాలి. తద్వారా ఫిజికల్ ఫిట్ నెస్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు ప్రతీక సైకిల్. మీ అంతా బాగా చదివి టెన్త్ క్లాస్ ఫలితాల్లో అగ్రగామిగా నిలవాలి. అట్లాగే భవిష్యత్తులో బాగా చదువుకుని గొప్ప వాళ్లు కావాలని, సమాజంలో మంచి వ్యక్తులుగా రాణించాలని కోరుతున్నా…
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం…
ఇది చాలా గ్రాండ్ ప్రోగ్రాం. భేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతిపాదన చేశారు. ఇంత తొందరగా కార్యరూపం దాల్చేలా చేయడం చాలా గొప్ప విషయం. మనస్పూర్తిగా కేంద్ర మంత్రికి అభినందనలు చెబుతున్నా. నాకు సైకిల్ చాలా ఇష్టం. నా ఇంటర్వ్యూలో కూడా ఈ అంశంపై మాట్లాడిన. సైకిల్ పై జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే ప్రమాదముంది.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్….
ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలనే ఆలోచనను కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత మాతో పంచుకున్నారు. ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. అది కేంద్ర మంత్రికే చెల్లింది. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులుంటాయనే ఉద్దేశంతో వారికి ఆర్ధిక భారం కాకుండా ఉండేలా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. ఇందులో భాగస్వాములం కావడం చాలా ఆనందంగా ఉంది.
అదనపు కలెక్టర్ అశ్వినీ…
సైకిళ్లను అందజేయడం వల్ల పిల్లలకు సమయం ఆదా అవుతుంది. తల్లిదండ్రులకు రవాణా ఖర్చుల భారం తగ్గుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పటికీ కేంద్ర మంత్రికి రుణపడి ఉంటారు.