రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్
రాష్ట్ర విభజన విభజన చట్టం 13వ షెడ్యూల్, సెక్షన్ 93 లో పార్లమెంటు నిండు సభలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జులై 8న తెలంగాణ రాష్ట్రానికి రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి వరంగల్ జిల్లా సహా రాష్ట్ర ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేస్తూ ఎదురు చూస్తున్నారని అన్నారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాకుండా కేవలం వ్యాగన్ల మరమ్మతులు చేసే సెంటర్ ను మాత్రమే ప్రారంభించేందుకు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ కాజీపేటకు వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాత్రమే ఏర్పాటు చేయాలని, ఇది రాష్ట్ర ప్రజల హక్కు అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రాకముందే న్యూఢిల్లీ కేంద్రంగా విస్పష్టమైన ప్రకటన చేయాలని, ఆ తర్వాతే రాష్ట్ర పర్యటనకు రావాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంలోని కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో దాగుడు మూతలు ఆడుతున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు.
కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నా వారు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను వారి వారి రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని, ఇదేనా..? జాతీయ సమైక్యతా స్ఫూర్తి అని వినోద్ కుమార్ ప్రశ్నించారు.
రైల్వే శాఖ మంత్రిగా ఉన్న జాఫర్ షరీఫ్ బెంగళూరుకు, మమత బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ రైల్వే మంత్రిగా ఉండగా బీహార్ కు, యు పీ ఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఉండగా రాయ్ బరేలికి, పీయూష్ గోయల్ రైల్వే మంత్రిగా ఉండగా మహారాష్ట్ర లాతూర్ కు, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ లోని దాహోల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసుకున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
2014 లో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక దేశంలో కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇవ్వబోమని ప్రకటించిందని, కానీ ఏప్రిల్ 2018 సంవత్సరంలో లాతుర్ లో, ఏప్రిల్ 2022 సంవత్సరంలో దాహాల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చారని , ఇదెక్కడి న్యాయం అని వినోద్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ ని ప్రశ్నించారు.