– 11న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఎట్టకేలకూ ఖరారు
– మోదీ పర్యటనపై తొలగిన సందిగ్థం
– సాయంత్రం రోడ్‌షో ఏర్పాట్లు
– మోదీ పర్యటనకు జనసమీకరణ బాధ్యత వైసీపీదే
– చివరి వరకూ బీజేపీకి సైతం తెలియని ప్రధాని టూర్ షెడ్యూల్
– బీజేపీ కోర్ కమిటీలోనూ దానిపై వాగ్వాదం
– బీజేపీకి తెలియకుండా వైసీపీకి ఎలా సమాచారం వస్తుందన్న కమలదళాలు
– కేంద్రమంత్రి మురళీధరన్‌కూ తెలియని మోదీ పర్యటన వివరాలు
– మరోవైపు ఏర్పాట్ల సమీక్షపై ఎంపీ విజయసాయిరెడ్డి బిజీ బిజీ
– చివరకు ప్రధాని పర్యటనపై బీజేపీ నేతలకు ఆదివారం సమాచారం
– జనసమీకరణలో అంతా తానై నడిపిస్తున్న వైసీపీ నేతలు
– వైసీపీ నేతలకు టార్గెట్లు పెట్టిన వైసీపీ ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి
– ప్రధాని టూర్లో బీజేపీ భాగస్వామ్యం బహు తక్కువే
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎట్టకేలకూ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారయింది. గత రెండురోజుల నుంచి ప్రధాని టూర్‌పై సందిగ్థత నెలకొన్న నేపథ్యంలో, ఆయన 11న విశాఖకు వస్తున్నట్లు అధికారిక సమాచారం వెలువడింది. అదే రోజు విశాఖలో రోడ్‌షో కూడా నిర్వహించనున్నారు. దానికి కేంద్రప్రభుత్వ లబ్ధిదారులను తీసుకురావాలన్నది బీజేపీ నాయకత్వం లక్ష్యం. అయితే, ప్రధాని సభకు జనసమీకరణ, స్వాగత ఏర్పాట్లన్నీ బీజేపీకి బదులు.. అధికార వైసీపీ నేతలే తమ భుజాలపై వేసుకోవడం విశేషం.
ఈనెల 11న ప్రధాని మోదీ విశాఖకు ఉంటుందా? రద్దవుతుందా? అన్న సందేహాలకు తెరపడింది. నిజానికి ఆయన పర్యటనపై, సొంత బీజేపీ నాయకత్వానికే శనివారం వరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రధాని టూర్ సమాచారం- ఏర్పాట్లపై బీజేపీ కోర్ కమిటీలో సైతం, రాష్ట్ర అధ్యక్షుడితో సీనియర్లు వాగ్వాదానికి దిగాల్సి వచ్చింది. సొంత పార్టీకి లేని సమాచారం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎలా తెలుస్తోందంటూ.. బీజేపీ సీనియర్లు నిలదీయడం, విజయసాయిరెడ్డిని ఏమీ అనవద్దని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాదించడంతో, కోర్ కమిటీలో గందరగోళం నెలకొంది.
చివరాఖరకు తాము బీజేపీ జాతీయ నేత శివప్రకాష్‌జీతో మాట్లాడి సమాచారం ఇస్తామని.. బీజేపీ రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్, కేంద్రమంత్రికి చెప్పాల్సివచ్చింది. అయితే.. ప్రధాని పర్యటన వివరాలు, చివరకు రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్న కేంద్రమంత్రి మురళీధరన్‌కూ తెలియకపోవడమే విచిత్రం.
చివరకు మోదీ 11న విశాఖకు వస్తున్నట్లు, బీజేపీ రాష్ట్ర నేతలకు ఆదివారం ఉదయం అధికారికంగా సమాచారం అందింది. ఆ ప్రకారంగా ప్రధానిని ఎయిర్‌పోర్టులో ఎవరెవరు స్వాగతించాలన్న జాబితాను కూడా ఖరారు చేశారు.
ప్రధాని పర్యటన ఖరారు కావడంతో.. ఇక ఆయనకు స్వాగత సన్నాహాలు, జనసమీకరణపై దృష్టి సారించాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర కమిటీ నేతలను కోరారు. అయితే.. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. కాబట్టి జనసమీకరణ అంశంలో బీజేపీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం తప్పింది.
అందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వారీగా జనసమీకరణకు నడుంబిగించారు. ప్రధానిని స్వాగతిస్తూ హోర్డింగులు, ఫ్లెక్సీల వంటి ప్రచారమంతా.. వైసీపీ నేతలే తమ భుజాలపై వేసుకున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ముందస్తు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో సభ విజయవంతం కోసం.. సీఎం సభ మాదిరిగానే, పీఎం సభకూ వైసీపీ నేతలు ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. వైసీపీ నేతల ఉత్సాహం చూస్తుంటే, సొంత పార్టీ కార్యక్రమం మాదిరిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇక జనసమీకరణ బాధ్యతను.. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా సమీక్షిస్తున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు, నగర కమిటీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏయు గ్రౌండ్స్‌లో జరిగే మోదీ సభకు , 3 లక్షల మందిని సమీకరించే బాధ్యత తీసుకోవాలని, సుబ్బారెడ్డి వైసీపీ నేతలను ఆదేశించారు. ఆయన ఆదేశంతో రంగంలోకి దిగిన వైసీపీ నేతలు, గ్రామాలు, వార్డులకు వెళ్లి జనాలను సమీకరించే పనిలో ఉన్నారు. దీనితో మోదీ పర్యటనలో జనసమీకరణకు సంబంధించి, బీజేపీ నేతల భాగస్వామ్యం పెద్దగా ఉండేలా కనిపించడం లేదు.
‘అసలు మాకు మోదీ వస్తున్న సమాచారమే నిన్నటివరకూ లేదు. మాకు తెలియకుండానే వైసీపీ వాళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మమ్మల్ని కూడా జనసమీకరణ బాధ్యత తీసుకోవాలని, మా అధ్యక్షుడు చెప్పారు. కానీ అవన్నీ వైసీపీ వాళ్లే చేస్తున్నందున, మా భాగస్వామ్యం పెద్దగా ఉండదు. మా పాత్ర కేవలం ఎయిర్‌పోర్టులో ప్రధానికి స్వాగతం, వీడ్కోలు పలికే వరకే పరిమితం కాబోతోంది’ అని ఓ రాష్ట్ర కమిటీ ప్రముఖుడు వ్యాఖ్యానించారు.