Suryaa.co.in

Telangana

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు:కేసీఆర్ ఫైర్

పెట్రోల్, డీజిల్ సహా అన్నింటి ధరలను మోదీ విపరీతంగా పెంచేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని.. పోరాట సమయంలో కొందరు రైతులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగందని చెప్పారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు అందించామని తెలిపారు. బీజేపీ పాలనలో రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ బాధపడుతున్నారని చెప్పారు. శాశ్వతంగా ప్రధాని పదవిలో ఉంటానని మోదీ అనుకుంటున్నారని.. పదవులు ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పు కచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా జలవిహార్ లో కేసీఆర్ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మీ పాలనలో దేశానికి ఒనగూరింది ఏముందని మోదీని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు దేశంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టారని మండిపడ్డారు. మోదీ కారణంగా శ్రీలంక ప్రజలు రోడ్డెక్కారని అన్నారు. మీ వల్ల ప్రతి విషయంలో దేశం గౌరవాన్ని కోల్పోతోందని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ ను మోదీ సమర్థించారని.. ట్రంప్ ను సమర్థించి దేశ ప్రయోజనాలను దెబ్బతీశారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని… మహారాష్ట్రలో చేసినట్టు తెలంగాణలో చేయడం అసాధ్యమని చెప్పారు. పెరుగుతున్న మీ భజన దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు.

LEAVE A RESPONSE