క్యాబినెట్ మంత్రులు మామూలుగా రాష్ట్రాలలో అయితే ఓ సిటీ బస్సుడు మంది ఉంటుంటారు. అందరి పేర్లూ గుర్తుంచుకోవడం కష్టం. అదే కేంద్రం లో అయితే రెండు, మూడు సిటీ బస్సులకు సరిపడా మంత్రులు ఉంటారు. అక్కడా అంతే! ఓ నలుగురైదుగురి పేర్లు గుర్తుంటాయి.
కానీ, మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరి పేరు మాత్రం… బీజేపీ రాజకీయాలు గమనిస్తున్నవారికి చిర పరిచితం అని చెప్పవచ్చు. మహారాష్ట్ర లో అయితే, దాదాపుగా ఇంటింటికీ తెలిసిన పేరు. ఇప్పుడు దేశాన్ని పరోక్షంగా ఏలుతున్న ఆర్ ఎస్ ఎస్ కేంద్ర కార్యాలయం గల నాగపూర్ ఆయన కార్యక్షేత్రం. నాగపూర్ ఎం.పీ కూడా. 1990 నుంచి… అంటే 33 ఏళ్ళ నుంచీ మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో లెక్కకు మించి మంత్రిత్వ శాఖలకు చెందిన పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. తన రాజకీయ వ్యవహార శైలితో దేశం లోని బుద్ధి జీవుల, ప్రతిపక్ష రాజకీయ నేతల, ఆర్ ఎస్ ఎస్ పెద్దల అభిమానాన్ని విశేషంగా చూరగొన్న నాయకుడు మరొకరు బీజేపీ వర్తమాన చరిత్ర లో కనిపించరు. 2009 నుంచి రెండు దఫాలుగా ఆయన బీజేపీకి జాతీయ అధ్యక్షుడుగా పని చేశారు. ఆ సమయం లో – ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. హోమ్ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్ లోనే – మోడీ మంత్రి వర్గం లో ఉన్నారు.
ప్రస్తుతం కేంద్ర రోడ్ రవాణా శాఖ మంత్రిగా 2014 మే నుంచి కొనసాగుతున్న నితిన్ గడ్కరి….. ఆ శాఖకు సుదీర్ఘ కాలంగా సారధ్యం వహిస్తున్నారు. గతం లో 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయం లో మహారాష్ట్ర లోని దాదాపు 14 వేల గ్రామాలకు రోడ్లు, జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ లు మొదలైన సదుపాయాలను చేరువ చేశారు. ముంబై – పూణే ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ వే ని ఉనికి లోకి తీసుకు వచ్చింది కూడా గడ్కరి యే. దేశం లోనే ఇది తొలి ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ హై వే.
వాజపేయి హయాం లో రూపు దిద్దుకున్న -గ్రామీణ భారతానికి రోడ్ సదుపాయం కల్పించే- ‘ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన’ అనే భారీ పధకం నితిన్ గడ్కరి ఆలోచనల్లోంచి మొగ్గ తొడిగిందే. 2014 లో బీజేపీ కేంద్రం లో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ శాఖను గడ్కరి చేపట్టినప్పుడు ; ఆ శాఖ ఆధ్వర్యంలో లో దేశం మొత్తం మీద – రోజుకు రెండు కిలోమీటర్ల కొత్త రోడ్డు మాత్రమే వేసేవారు. ఆ శాఖ మంత్రి గా మొదటి టర్మ్ చివరి నాటికి – రోజుకు ముప్పై కిలోమీటర్లు కొత్త రోడ్ వేసే స్థాయికి ఆ శాఖ చేరుకున్నది. ఈ ఏడాది చివరికి, ఆ శాఖ – రోజుకు 68 కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులు వేసేవిధంగా సమాయత్తం చేస్తున్నారు.
ఇటు మంత్రిత్వ శాఖ పని, అటు పార్టీ కి తిరుగులేని విధేయత, మరోవైపు దేశం లోని అన్ని రాజకీయ పక్షాలను గౌరవించే సంస్కృతి, ఇంటా… బయటా ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వం తో ఓ విలక్షణమైన రాజకీయ వేత్త గా అమితమైన గుర్తింపు కలిగిన నితిన్ గడ్కరి….; భారత ప్రధాని పదవికి తగిన నేత అనే భావం బీజేపీ లోనూ, ఇతర పార్టీల లోను కూడా ఉంది.
ఆ స్థాయి కలిగిన ఆయనను కేంద్ర పార్లమెంటరీ బోర్డు నుంచి తొలగించారు. బీజేపీ కి సంబంధించినంత వరకు కేంద్ర పార్లమెంటరీ బోర్డు అత్యున్నత విధాన నిర్ణాయక బోర్డు. ముఖ్యమంత్రుల్ని నియమించడం, ఎం పీ టికెట్లు, ఎం ఎల్ ఏ టికెట్లు ఇవ్వడం మొదలైన నిర్ణాయక కార్యక్రమాలన్నీ ఈ బోర్డు పేరిటే జరుగుతాయి. మొన్న మొన్నటి దాకా, ఇందులో ఏడుగురే సభ్యులు ఉండేవారు. బీజేపీ పూర్వపు అధ్యక్షులు కూడా ఈ పార్లమెంటరీ బోర్డు లో సభ్యులుగా ఉండడం…, బీజేపీ లో ఓ ఆనవాయితీ గా వస్తోంది. ఆ విధంగా నితిన్ గడ్కరి ఈ బోర్డు లో ఉన్నారు. ఆయన తో పాటు, ఆయన కంటే ముందూ… వెనుకా కూడా బీజేపీ అధ్యక్షుడు గా పని చేసిన రాజ్ నాధ్ సింగ్ కూడా ఆ బోర్డు లో ఉన్నారు. ఇప్పుడు ఆయనను అలాగే ఉంచి, గడ్కరిని మాత్రం తొలగించారు.
ఈ తొలగింపు బీజేపీ కార్యకర్తలకు సైతం మనసు చివుక్కు మనేలా చేసింది. భవిష్యత్ లో తమకు అడ్డం రాకుండా, మోడీ – అమిత్ షా ద్వయం ‘తెగించి’ ఈ నిర్ణయం తీసుకున్నారా అనే వ్యాఖ్యానాలు మీడియా లో వచ్చాయి. ‘తెగింపు’ ఎందుకంటే – బీజేపీ కి మాతృక అయిన ఆర్ ఎస్ ఎస్ ఆశీస్సులు, సాన్నిహిత్యం పుష్కలంగా ఉన్న నేత – గడ్కరి. 30 ఏళ్లగా మహారాష్ట్ర లోనూ, కేంద్రం లోనూ లక్షల కోట్ల విలువయిన పనులు నిర్వహించే శాఖలకు మంత్రిగా పని చేస్తున్నా…. అవినీతి ఆరోపణలు లేని నేత – గడ్కరి. బీజేపీ కి జాతీయ అధ్యక్షుడుగా రెండు పర్యాయాలు పని చేసిన నేత -గడ్కరి. దేశం లోని ప్రతిపక్షాలు సైతం గౌరవించే బీజేపీ నేత – నితిన్ గడ్కరి. ఇన్ని ప్రత్యేకతలు, సీనియారిటీ, విస్తృతానుభవం, దేశ రాజకీయాల పై అవగాహన, సాదా -సీదా జీవన శైలి గలిగిన నేత మరొకరు వర్తమాన బీజేపీ లో కనిపించడం లేదు.
మనసులోని మాటను పైకి చెప్పడానికి కూడా ఆయనేమీ మొహమాట పడరు. ఈ మధ్య కాలం లో…. వేర్వేరు సందర్భాలలో అయినప్పటికీ…. ఆయన చేసిన మూడు నాలుగు వ్యాఖ్యలు – మోడీ కి ‘ఎక్కడో’ తగిలాయనే భావం పరిశీలకులకు కలిగింది.
నేటి రాజకీయాలు చూస్తుంటే… అధికారమే పరమావధిగా తయారైనట్టుగా కనబడుతున్నాయని, రాజకీయాలు వదిలేయాలి అనిపిస్తోందని గడ్కరి ఓ సందర్భం లో వ్యాఖ్యానించారు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను మోడీ – అమిత్ షా కూల్చి వేస్తున్న తీరు పట్ల నితిన్ గడ్కరి వ్యక్తం చేసిన నిరసన గానే ఈ వ్యాఖ్యను పరిశీలకులు చూశారు.
అలాగే, మరో సందర్భం లో – వాజాపేయీ, అద్వానీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ వంటి వారి కృషి ఫలితంగానే బీజేపీ ఇప్పుడున్న స్థాయిలో ఉన్నదని ఈ మరాఠా వీరుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య – నరేంద్ర మోడీ – అమిత్ షా ధ్వయాన్ని నేరుగా తాకింది. తామే బీజేపీ ని దేశం లో ఓ తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచామని వారు బలంగా నమ్ముతున్నారు. వారు నమ్మడమే గాక ; ఈ దిశగా బీజేపీ శ్రేణుల బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. ఈ రెండు పేర్లు గాకుండా, బీజేపీ శ్రేణులు మరో పేరు ఉచ్ఛరించడానికి కూడా వీలు లేని స్థితిని కల్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో…. నితిన్ గడ్కరి – వీరి పేర్లు చెప్పకుండా అద్వానీ, వాజపేయి పేర్లు చెప్పడం తో ; మోడీ – షా భజనలో మునిగి తెలుసు తున్నవారు షాక్ కు గురయ్యారు.
మరో సందర్భంలో నితిన్ గడ్కరి మరో ‘తొడపాశం’ కూడా పెట్టారు. మనకు వనరులు ఉన్నాయి… సాంకేతిక నైపుణ్యం ఉంది… సాంకేతిక నిపుణులు ఉన్నారు…. కానీ ప్రభుత్వాలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందువల్లే దేశం వెనకబడి ఉంటోంది అంటూ చేసిన వ్యాఖ్య కూడా మోడీ కి తగిలేదే. అభివృద్ధి లో దేశాన్ని 2014 నుంచి పరుగులు పెట్టిస్తున్నామని మోడీ పదే పదే చెబుతుంటారు గదా! అంత సీను లేదని నితిన్ గడ్కరి వ్యాఖ్యానించడం కూడా మోడీ బ్యాచ్ కి ఓ పట్టాన జీర్ణం కాదు. అందుకే, నితిన్ ను వదిలించుకునే పనిలో మోడీ – షా పడ్డారని అంటున్నారు.
పార్లమెంటరీ బోర్డు నుంచి ఇప్పుడు తొలగించిన వారు ; త్వరలో కేంద్ర మంత్రి వర్గం నుంచి కూడా నితిన్ ను తొలగిస్తారనే అంటున్నారు. అక్కడితో ఆగకుండా, 2024 లో ఎం. పీ గా పోటీ చేయడానికి బీజేపీ టికెట్ కూడా ఇవ్వక పోవచ్చునని కూడా నాగపూర్ లో ఆయన సన్నిహితులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ ‘పోకడ’లను ఆర్ ఎస్ ఎస్ అనుమతిస్తుందా? ఆర్ ఎస్ ఎస్ ను సైతం మోడీ – షా ధిక్కరిస్తారా? నితిన్ గడ్కరిని సాగనంపితే; మోడీ – షా కాంబినేషన్ పట్ల ప్రజలలో సద్భావన ఉంటుందా? ప్రతిపక్షాలు దీనిని ఓ రాజకీయ అస్త్రం గా వాడుకోవా? అప్పుడు బీజేపీ కి కేంద్రం లో ఇతర పక్షాల మద్ధతు అవసరమైతే, మోడీ ని బలపర్చుతారా? ఆర్ ఎస్ ఎస్ ఎలా స్పందిస్తుంది? ఇవన్నీ ముందే అంచనా వేశాకే ; పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరి ని మోడీ – షా తప్పించారా? 2024 అనంతర రాజకీయాలకు ఈ ఇరువురూ సిద్ధమయ్యే… నితిన్ గడ్కరీ ని వదిలించుకోవాలని నిర్ణయించారా?
అయితే అద్వానీ ని వదిలించుకున్నంత సులువు కాదు, నితిన్ గడ్కరి ని వదిలించుకోవడం. అద్వానీ పాకిస్తాన్ వెళ్లి, జిన్నా సమాధి ని దర్శించి, జిన్నా ను దేశభక్తుడు అని అభివర్ణించిన తరువాత ; ఆయన గ్రాఫ్ ఆర్ ఎస్ ఎస్ లో అమాంతం పడి పోయింది. ఆ సమయం లో నాగపూర్ లో ఆర్ ఎస్ ఎస్ అధికార ప్రతినిధి గా ఉన్న రామ్ మాధవ్ కూడా అద్వానీ చేసిన పనిని నిసితంగా విమర్శించారు. ఆ షాక్ నుంచి మోడీ ఇప్పటికీ కోలుకోలేదు. ఆయన రాజకీయ జీవితానికి ‘శుభం’ కార్డు పడింది. 2014 లో ప్రధాన పదవికి అద్వానీ పేరు ను ఆర్ ఎస్ ఎస్ పరిశీలించక పోవడానికి ఇది కూడా ప్రధాన కారణం అయింది.
గడ్కరి అలా కాదు. ఆర్ ఎస్ ఎస్ కు అత్యంత ఇష్టుడు. నాగపూర్ నియోజకవర్గం నుంచి ఎం పీగా పోటీ చేసిన రెండుసార్లు కూడా రెండు లక్షల యనభై వేల మెజారిటీ తో గెలిచారు. ఆయనకు నాగపూర్ నుంచి బీజేపీ టికెట్ కేటాయించకుండా ….; మోడీ ఒకటి తలిస్తే…., దైవం ఒకటి తలవొచ్చు. ఢిల్లీ సమీపంలో లోని నోయిడా లో మొన్న కూల్చేసిన 100 మీటర్ల ఎత్తయిన జంట టవర్ల కధే ఇందుకు ఓ ఉదాహరణ.
ఎంత ఎత్తుగా కట్టినా… ఎంత బలంగా కట్టినా… అధికారులు ఎంత బాసటగా నిలిచినా… చేసిన తప్పులను సమర్ధించుకోడానికి ఆ బిల్డర్లు ఎంతగా ప్రయత్నించినా…. అవి కూలిపోయే టైమ్ వచ్చినప్పుడు… తొమ్మిది సెకండ్ల లో కూలిపోయాయి.. దేనికైనా…. టైమ్ వచ్చే వరకే మన తెలివి తేటలు. టైమ్ వస్తే…. ఏదీ ఆగదు. మన ఛాతి ఎన్ని అంగుళాలున్నా సుఖం ఉండదు.