– ఈడీ తనను ప్రశ్నించే సమయంలో మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు
– కాంగ్రెస్ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్ గాంధీ
– హాజరైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్
న్యూ ఢిల్లీ : భారత్పైకి చైనా విరుచుకుపడడానికి చూస్తున్న సమయంలో సైన్యాన్ని కేంద్రం మరింత బలపరచాల్సింది పోయి బలహీనపరుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల్లాగే ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. దేశాన్ని ముగ్గురు బడా పారిశ్రామిక వేత్తలకు మోదీ అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ సత్యగ్రహ్ కార్యక్రమంలో యువనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
‘అగ్నిపథ్’ పథకం ద్వారా కేంద్రం సైన్యాన్ని బలహీనపరుస్తుందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లే ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో భాగంగా ఈడీ తనను ప్రశ్నించే సమయంలో మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు రాహుల్ విచారణ సమయంలో తాను ఒంటరిగా లేనని, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న వారందరూ తనతో ఉన్నారని అన్నారు.
“దేశానికి వెన్నుముకగా ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారాలను మోడీ ప్రభుత్వం దెబ్బతీసింది. పదే పదే ఉద్యోగాలపై తప్పుడు ఆశలు కల్పించి.. దేశంలోని యువతను నిరుద్యోగం అనే అగ్నిబాటలో నడిచేలా మోదీ ఒత్తిడి తెచ్చారు. దేశాన్ని ముగ్గురు పారిశ్రామికవేత్తలకు అప్పగించిన ప్రధాని ఈ ‘అగ్నిపథ్’ పథకంతో ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగావకాశాలు లేకుండా చేయాలని చూస్తున్నారని, రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటారని తాను అప్పుడే చెప్పానని, ఇప్పుడు ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకుంటారని రాహుల్ గాంధీ అన్నారు.