Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి దళితుల హక్కుల్ని,డబ్బుల్ని లాక్కుని దగా చేశారు

– జగన్ రెడ్డి….గురుకులాలకు బాలయోగి పేరు మార్చినట్టు.. కడప జిల్లాకున్న మీ తండ్రి పేరు మార్చగలరా?
– దళిత ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దళితులపై దాడులు సిగ్గుచేటు
– మోకా ఆనందసాగర్

దళిత ద్రోహి జగన్ అని దళితులను వంచించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు దళితులకు అనేక హామిలిచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకపోగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా కనీసం స్పందించపోవటం సిగ్గుచేటు.

ఎన్నికలకు ముందు దళితుల్ని క్లాస్ – 1 కాంట్రాక్టర్లను చేస్తామన్నారు. ఈ 3 ఏళ్లలో ఎంతమంది దళితుల్ని కాంట్రాక్టర్లను ‎చేశారో చెప్పాలి? కాంట్రాక్టులను జగన్ తన సొంత సామాజికవర్గం వారికి దోచిపెడుతూ..మరో వైపు దళితుల నిధుల్ని లాక్కుంటున్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని లాక్కుని దళితులకు అన్యాయం చేశారు. గురుకు‎ల పాఠశాలలకు మాజీ లోక్ సభ స్పీకర్ దళిత నాయకుడు బాలయోగి పేరును టీడీపీ ప్రభుత్వం పెడితే.. జగన్ రెడ్డి ఆ పేరును తొలగించి ‎ అంబేద్కర్ పేరు పెట్టారు.

అంబేద్కర్ తయారు చేసిన నాయకుడు బాలయోగి… వాజ్ పేయ్ ప్రభుత్వం ఒక్క ఓటుతో కూలిపోతుందని తెలిసి కూడా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన దళిత నాయకుడు బాలయోగి. ఆయన పేరు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తొలగించలేదు. కానీ జగన్ రెడ్డి ఎందుకు తొలగించారు.? ‎ గచ్చిబౌలి స్టేడియానికి బాలయోగి పేరు ఉంటే కేసీఆర్ దాన్ని కొనసాగిస్తున్నారు, కానీ గురుకులాలకు పేరు ఎందుకు మార్చారు? 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినందుకు వైయస్ పేరు ను కడప జిల్లాకు పెట్టారు.

కానీ సామాన్య దళిత కుటుంబంలో పుట్టి రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా చేసిన బాలయోగి పేరు తొలగించి దళితుల్ని అవమానిస్తారా? జగన్ రెడ్డి కడప జిల్లాకు వైయస్ పేరు మార్చి వేరే‎ పేరు పెట్టగలరా? గురుకులాలకు మళ్లీ బాలయోగి పేరు పెట్టాలి, లేదంటే అమలాపురంలో 4 లక్షలమంది దళితులంతా నిరాహార దీక్ష చేస్తాం. మరో వైపు కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళితులంతా డిమాండ్ చేస్తుంటే జగన్ రెడ్డి కనీసం పట్టించుకోవటం లేదు. ‎

వైసీపీ పాలనలో ఓవైపు దళితులపై దాడులు, దౌర్జన్యాలు మరో వైపు దళితులపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా ముఖ్యమంత్రి కనీసం స్పందించటం లేదు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సొంత నియోజకవర్గంలో రూ. 10 వేలు బాకీ చెల్లించలేదన్న కారణంతో ఈశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త చంద్రన్ అనే దళితుడిని‎ కులం పేరుతో దూషిస్తూ, విచక్షణ రహితంగా కొట్టి అతని కాలు, చేయి విరిచారు. దీనిపై ఇంతవరకు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

డిప్యూటి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దళితులపై బహిరంగంగా దాడులు జరుగుతుంటే ఆయన ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు? చంద్రన్ పై దాడి చేసిన ఈశ్వర్ రెడ్డి తో పాటు ఈశ్వర్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కూడా కేసు నమోదు చేయాలి. ‎ వైసీపీ పాలనలో సుమారు 1000 మందికిపైగా దళిత మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి. కానీ నిందితులకు శిక్షలు లేవు. దిశ చట్టాన్ని నీరు గార్చారు.

దళితులపై సీఎంకి చిత్తశుద్ది ఉంటే దళితుల మాన, ప్రాణాలు కాపాడుకునేందుకు లైసైన్స్ తుపాకి ఇవ్వాలి. జగన్ రెడ్డి ఆ పని చేయగలరా? పట్టా భూముల పేరుతో దళిత భూముల్ని లాక్కుని, మరో వైపు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన సబ్ ప్లాన్ నిధులు దోచేసి అమ్మఒడి అంటూ ఎంగిలి మెతుకులు వేస్తారా? దళితుల‎ నిధుల్ని దోచుకుంటూ దళితుల్ని దగా చేస్తున్నారు. జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన దళితులే జగన్ రెడ్డి పతనం కోసం చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా జగన్ రెడ్డికి బుద్ది చెప్పేందుకు దళితులంతా సిద్దంగా ఉన్నారని మోకా ఆనంద సాగర్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE