Suryaa.co.in

Editorial

ఇక కలసి కార్యాచరణ!

– క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీపై బాబు-పవన్ చర్చ
– నేతలు మానసికంగా కలిసే కార్యాచరణకు రూపకల్పన
– ఇప్పటి సఖ్యత సరిపోదన్న భావన
– గుంటూరు-కృష్ణా జిల్లాలపై ప్రత్యేక దృష్టి
– కాపు-కమ్మ నేతలతో సమన్వయ సమావేశాల యోచన?
– ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలో సమన్వయంపై సంతృప్తి
– అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులపై ప్రైవేటు కేసులపై చర్చ
– వారిని క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు కార్యాచరణ
– దానికంటే ముందు లీగల్‌సెల్ నేతలతో భేటీ
– త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు
– టీడీపీ-జనసేన జమిలి ప్రెస్‌మీట్లపై దృష్టి?
– నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడి ప్రెస్‌మీట్లకు యోచన?
– వైసీపీ నేతల విమర్శలపై ఉమ్మడిగా ఎదురుదాడికి నిర్ణయం
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీ సర్కారును గద్దె దించే లక్ష్యంతో ఏకమైన టీడీపీ-జనసేన పార్టీలు ఆమేరకు క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన పవన్ కల్యాణ్ తర్వాత.. ఇరు పార్టీ నేతల సమన్వయంపై చర్చించినట్లు సమాచారం.ఆ మేరకు చంద్రబాబు కూడా పవన్ ఆలోచనను స్వాగతించారు.

పార్టీ వర్గాల సమాచారం.. ఏపీలో టీడీపీ-జనసేన కార్యకర్తలు, నేతలపై పోలీసు కేసులు ఎదుర్కొనే వ్యూహంపై బాబు-పవన్ చర్చించారు. అరెస్టుల ముసుగులో వైసీపీ నేతలు టీడీపీ-జనసేన కార్యకర్తల ఓట్లు తొలగించే వ్యూహం రచించారని, దానిని గుర్తించి ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు చేస్తున్న ఫిర్యాదులపై ఇరువురూ చర్చించారు. దీనికి సంబంధించి లీగల్ సెల్‌తో సమావేశం నిర్వహించాలన్న చర్చ వచ్చింది.

అందులో భాగంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులలో.. ఎస్‌ఐ నుంచి డీఐజీల పేర్లు గుర్తించి, వారిపై ప్రైవేటు కేసులు వేయాలన్న దానిపై లీగల్ సెల్‌తో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవాలన్న చర్చ జరిగింది. లేకపోతే క్యాడర్‌లో మనోస్థైర్యం నింపలేమన్నారు. ఆ మేరకు పోలీసుల పేర్లు గుర్తించే ప్రక్రియను లీగల్ సెల్ నేతలతో చర్చించిన తర్వాత ఖరారు చేద్దామన్నారు.

ఇక జనసేన-టీడీపీ శ్రేణుల సమన్వయం ప్రస్తుతం బాగున్నప్పటికీ, అది సరిపోదని గుర్తించారు. ఉభయగోదావరి-ఉత్తరాంధ్రలో ఇరు పార్టీల సమన్వయం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో ఇరుపార్టీలూ కలసి పనిచేస్తున్నాయని, చంద్రబాబు జైలు నుంచి విడుదలయిన తర్వాత, ఆయనకు స్వాగతం పలికిన వారిలో జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చార న్న చర్చ జరిగింది.

అయితే గుంటూరు-కృష్ణా జిల్లాల్లోనే సమన్వయం ఆశించినంత లేదని గుర్తించారు. అందుకోసం కమ్మ-కాపు నేతల ఉమ్మడి సమావేశాలు, నియోజకవర్గాల వారీగా నిర్వహించాలన్న అంశంపై చర్చించారు. దానిపై కార్యాచరణను ఖరారు చేయాలని నిర్ణయించారు.

ఇక ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు.. ఇరు పార్టీ నేతలు కలసి ప్రెస్‌మీట్లు నిర్వహించాలన్న అంశంపై చర్చ జరిగింది. అవి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే అద్భుత ఫలితాలు, ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని చర్చించారు. వైసీపీ నేతలు చంద్రబాబు-పవన్‌లో ఎవరిని విమర్శించినా, ఇరు పార్టీలు కలసి దానిపై ఎదురుదాడి చేయాలన్న దానిపై చర్చ జరిగింది.

LEAVE A RESPONSE