Home » కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది

కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది

-కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది
-కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరిపించాలి
-టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందనీ, అయన ఓ ఆర్థిక ఉగ్రవాది అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిజైన్ అనుకున్నది ఒకటైతే.. నిర్మించింది మరొకటైందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టిందన్నారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్ని తానే అని రక్తం ధారపోసి కట్టానని కేసీఆర్ చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

“మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్ చేయలేదు, డిజైన్ ప్రకారం నిర్మాణం లేదు, నిర్మాణం ప్రకారం నిర్వహణ లేదు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. మేడిగడ్డ కుంగింది… కేసీఆర్ పాపం పండింది. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్… ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టింది” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

2014 నుంచి 2018 వరకు హారీష్ రావు దగ్గర నీటిపారుదల శాఖ ఉంది. 2019 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ దగ్గరే .. సాగు నీటి శాఖ ఉందన్నారు. కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు ? అని ప్రశ్నించారు. భాద్యులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నాడు? అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఒప్పందంలో ఒక రేటు తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్ పేరిట అంచనాలను పెంచుకుంటూ కమీషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో నిర్మాణ వ్యయం రూ. 270 కోట్లుగా కాగా తర్వాత దాన్ని రివైజ్డ్ కింద రూ. 500 కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను కేసీఆర్ బంధువుకు చెందిన ప్రతిమ సంస్థకు ఇచ్చారన్నారు. అగ్రిమెంట్ సమయంలో తక్కువ ధరకు ఇచ్చి.. రేవైజ్ లో ధర పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కాళేశ్వరంలో కూడా రూ. 80 వేల కోట్లు అగ్రిమెంట్ లో పెట్టి రూ. లక్ష 50 వేల కోట్లకు అంచనాలను పెంచారని తెలిపారు. ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అంటూ నిప్పులు చెరిగారు. ఈ టెర్రరిస్టులను కేంద్రం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాళేశ్వరంలో ఇంత ఉపద్రవం జరిగినా కేసీఆర్ మాట్లాడడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. డిజైన్ల లోపాలు, నాసిరకం పనులు జరిగాయని ప్రభుత్వానికి తెలుసని ఆరోపించారు. కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాళేశ్వరంలో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. నిర్మాణాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోయింది.. బాద్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు.

కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగిందని.. కేసీఆర్ పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన ఆలోచనలు మారి.. ఆశలు పెరిగాయన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ అనే పదం కనిపెట్టారని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్ సమాచారం ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణకు చెందని అధికారులతో ఓ కమిటీని వేసి.. ఆ కమిటీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్నీ పరిశీలించి నివేదిక ఇవ్వాలనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే… 2014-2023 వరకూ కాళేశ్వరం వెనక మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్‌ ఉన్నారన్న ఆయన.. వారిద్దర్నీ వెంటనే పదవుల నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

“బండి సంజయ్ ని పదవి నుండి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే.. తప్పు జరిగింది అని చెప్పిందన్నారు. అవినీతిని వదలను అని చెప్పే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? నివేదిక మీద చర్యలు తీసుకో అంటే.. రాష్ట్రంలో అధికారం లోకి వస్తే చర్యలు తీసుకుంటా అని చెప్పడం ఏంటి? అంటే బీజేపీ అధికారంలోకి రాదు.. విచారణ జరపం అని చెప్పదలుచుకున్నదా బీజేపీ” అని ప్రశ్నించారు. తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్ గాందీని నన్ను తిడుతున్నారని కేటీఆర్ పై మండిపడ్డారు.

రిటైర్ అయిన అధికారి మురళీధర్ రావు కు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఎన్నికల పర్యటనకు వస్తున్నారు కానీ.. కూలిన ప్రాజెక్టు చూడడానికి ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. మోడీ పరిశీలించి.. చర్యలకు అదేశించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల పర్యటన కాదు.. మేడిగడ్డ పర్యటన చేసి అప్పుడే ఓట్లు అడగండి అని తెలిపారు. కోదండరాం కూడా తెలంగాణ వ్యతిరేకేనా? ఆయన్ని తెలంగాణ వ్యతిరేకి అంటే జనం చెప్పుతో కొడతారని కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట టీడీపీ సంక నాకింది బీఆర్ఎస్ అని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు బీఆర్ఎస్ లో చేరాడన్నారు. టీడీపీ మీద దాడి చేసినప్పుడు ఒకలా.. తర్వాత ఇంకోలా మాట్లాడుతోంది బీఆర్ఎస్ అన్నారు.

కే.ఏ.పాల్ కూడా పోటీ చేయడం లేదు.. పాల్ బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్టా? అని ప్రశ్నించారు. మాట్లాడటానికి బుద్ది ఉండాలి అంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9 తర్వాత కాళేశ్వరం బాధ్యుల తాటా తిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు.. ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Leave a Reply