Suryaa.co.in

Telangana

ఉస్మానియా ఖ్యాతికి మరింత సహకారం

– వీసీతో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు భేటీ

సికింద్రాబాద్, డిసెంబరు 10 : ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మంచి ఖ్యాతిని తెచ్చేందుకు తాము సహకరిస్తామని, స్థానిక ఉద్యోగులు, విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ కు సూచించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలనా యంత్రాంగం ద్వారా పరిష్కారానికి నోచుకోవాల్సిన వివిధ అంశాల పై ఉప సభాపతి పద్మారావు గౌడ్ శనివారం సీతాఫల్మండి లోని తన క్యాంపు కార్యాలయంలో ఓ సమావేశం నిర్వహించారు. ఉప కులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. సీతాఫలమండి ప్రభుత్వ స్కూల్, కాలేజి భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.29.75 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయించిన నేపధ్యంలో కొత్త భవనాలు నిర్మించేందుకు వీలుగా తాత్కాలికంగా ఆయా సంస్థలను మోడల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు సహకరించాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.

అదే విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పని చేసే ఉద్యోగులు, విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ, స్టూడెంట్స్ డిటెన్షన్ పద్దతి వల్ల విద్యార్ధుల ప్రయోజనాలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యాంపుల్లో నివాసుల విద్యుత్ కనెక్షన్ లు, మీటర్ల ఏర్పాటు అంశం తో పాటు చిరు వ్యాపారుల ఇబ్బందుల నివారణకు చర్యలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికీ గ్రౌండ్ లో సదుపాయాలు తదితర అంశాలను పద్మారావు గౌడ్ చర్చించారు. యూనివర్సిటీ లో కొత్త రోడ్డు అభివృద్ధి కి సహకరించాలని ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

క్రైస్తవులకు ప్రోత్సాహం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రైస్తవ మతస్తులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో క్రిస్మస్ వేడుకలకు నిర్వహణ, చర్చీలకు ప్రభుత్వ పరంగా కానుకల పంపిణీ ఏర్పాట్ల పై పద్మారావు గౌడ్ సీతాఫల్మండి లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో ఓ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో కనీసం 10 వేల మంది క్రైస్తవులకు ప్రభుత్వ కానుకలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా వీలైనంత మందికి క్రిస్మస్ కానుకలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వివిధ చర్చీల నిర్వాహకులు కుడా సహకరించి పేద క్రైస్తవులకు కానుకలు లభించేలా తమ వంతు సహకరించాలని పద్మారావు గౌడ్ కోరారు. డీ పీ ఓ శ్రీనాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE