* ఏపీ హస్త కళాకారులకు 5 జాతీయ స్థాయి అవార్డుల రాకపై మంత్రి హర్షం
* కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అవార్డుల రాక
* 13న అవార్డు గ్రహీతలకు శ్రీకాళహస్తిలో సన్మానం
* 100 మంది హస్త కళాకారులకు టూల్ కిట్ల పంపిణీ
* ఒక్కో టూల్ కిట్ విలువ రూ.10 వేలు
– * రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రోత్సాహమందివ్వనున్నట్టు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాగంగా రెండ్రోజుల కిందట ఢిల్లీలో భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి చెందిన అయిదుగురు హస్త కళాకారులు అవార్డులు అందుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు.
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఈ అవార్డులు ఏపీకి వరించాయన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ హస్త కళల వారోత్సవాలు (డిసెంబర్ 8–14) సందర్భంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ 2023, 2024కు సంవత్సరాలకు సంబంధించి అవార్డులు ప్రకటించిందన్నారు. ఏపీకి 2023 సంవత్సరానికి రెండు అవార్డులు, 2024 సంవత్సరానికి ఒక అవార్డుతో పాటు రెండు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు లభించాయన్నారు.
2023కు సంబంధించి, మహిళల విభాగంలో శ్రీ కృష్ణ చరిత తోలు బొమ్మల తయారీలో డి.శివమ్మకు శిల్ప గురు అవార్డు లభించిందన్నారు. కలంకారి హ్యాండ్ పెయింటింగ్‌లో విజయలక్ష్మికి జాతీయ హస్తకళ అవార్డు వరించిందన్నారు. 2024కు సంబంధించి ఏటికొప్పాక బొమ్మల తయారీలో గోర్సా సంతోష్ కు జాతీయ అవార్డు, తోలు బొమ్మల తయారీలో కందాయ్ అంజన్నప్పకు, క్రాఫ్ట్ లో తోలుబొమ్మల తయారీ విభాగంలో ఖండే హరనాథ్ కు ప్రత్యేక ప్రస్తావన అవార్డులు వరించాయన్నారు. అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారన్నారు. రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే అవార్డులు వరించాయన్నారు.
కళాకారుల సంక్షేమంతో పాటు హస్తకళా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందన్నారు. హస్త కళాకారులకు ఆర్థిక భరోసాతో కూడిన గౌరవ ప్రదమైన జీవనం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హస్త కళల రంగానికి విశేష ప్రోత్సాహమందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. అవార్డులు అందుకున్న కళాకారులకు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. జాతీయ అవార్డులు అందిన స్ఫూర్తితో హస్త కళలకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు.
13న అవార్డు గ్రహీతలకు సన్మానం
అవార్డు గ్రహీతలకు ఈ నెల 13న శ్రీకాళహస్తిలో సన్మానించనున్నట్టు మంత్రి సవిత తెలిపారు. జాతీయ హస్త కళల వారోత్సవాల్లో భాగంగా ఈ సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇదే కార్యక్రమంలో వంద మంది హస్త కళాకారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేల విలువ చేసే టూల్ కిట్లు పంపిణీ చేయనున్నట్టు ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.