• బుధవారం తన నేతృత్వంలో సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ పర్యటన
• రెవెన్యూ లోటు కింద రాష్ట్రానికి ఇప్పటి వరకూ 4వేల కోట్ల రూ.లు వచ్చాయి
• తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బకాయిలు రాబట్టేందుకు కృషి
• వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి ఫ్యాకేజి కింద నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
• పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి
రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు ప్రధాన అంశాల్లో చాలా వరకూ తుది దశ పరిష్కార స్థాయికి వచ్చాయని వాటిని కేంద్ర ప్రభుత్వం ద్వారా పరిష్కరింప చేసే లక్ష్యంతో బుధవారం తన నేతృత్వంలో సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ వెళ్ళనుందని, ముఖ్యమంత్రి వర్యులను కూడా ఢిల్లీ రావాలని కోరామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు.
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశాల పరిష్కారానికి సంబంధించి గత రెండేళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పలు దపాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి వర్యులకు వినతిపత్రాలు అందించి వాటి పరిష్కారానికి విజ్ణప్తి చేయడం జరిగిందని తెలిపారు.2022 జనవరి 24న సియం పోలవరం,రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు,తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బాకాయిలు,ఓవర్ బారోఇంగ్స్ వంటి 10 ప్రధాన అంశాలు పరిష్కారంపై ప్రధానమంత్రి వర్యులకు లేఖ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
వాటి పరిష్కారంపై కేంద్రం స్థాయిలో ఆర్ధికశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కార్యదర్శులతో ఒక కమిటీని కూడా వేశారని ఆకమిటీకి ఈఅంశాలను రిఫర్ చేయడం జరిగిందని తెలిపారు. వాటిలో కొన్ని అంశాలపై కొన్ని ఆర్డర్సు కూడా ఇచ్చారని ముఖ్యంగా తెలంగాణా నుండి ఎపి జెన్కోకు రావాల్సిన బకాయిలపై కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందన్నారు.
అయితే ఈ బకాయిల విషయంలో తెలంగాణా ప్రభుత్వం కోర్టు నుండి స్టే తేగా ప్రస్తుతం కోర్టు స్టే కూడా తొలగి పోయినందున ఆనిధులు రాబట్టేలా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.రాష్ట్ర విభజనకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై ఈఏడాది మార్చి నెలాఖరుకు కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆశించామని కాని కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవి అపరిష్కృతంగా ఉండిపోయాయన్నారు.రాష్ట్ర విభజన అంశాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు పరిష్కార దశకు చేరిన నేపధ్యంలో తన నేతృత్వంలో సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ వెళ్ళి కేంద్ర కార్యదర్శులతో సమావేశం కానున్నామని చెప్పారు.
అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ రావాలని విజ్ణప్తి చేయగా కొన్ని పరిపాలనా పరిమైన,ఇతర కారణాలు దృష్ట్యా ముఖ్యమంత్రి వర్యులు వారి వ్యక్తిగత విదేశీ పర్యటను,సోమవారం జరగాల్సిన వసతి దీవెన కార్యక్రమాన్నికూడా రద్దు చేసుకున్నారని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చి 17వ తేదీన సియం ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధాన మంత్రివర్యులను కలిసి ముఖ్యమైన విభజన అంశాలపై మరొకసారి విజ్ణప్తి చేశారన్నారు.ఆతదుపరి తనతోపాటు ఆర్ధిక తదితర శాఖల సీనియర్ అధికారులం నాలుగైదు రోజులు ఢిల్లీలోనే ఉండి కేంద్ర మంత్రులు, కార్యదర్శులతో సమావేశం అయిన నేపధ్యంలో వాటిలో నాలుగైదు ప్రధాన అంశాలు పరిష్కార దశకు చేరుకున్న నేపధ్యంలో బుధవారం మరలా సీనియర్ అధికారుల బృందం ఢిల్లీ వెళుతోందని సిఎస్.జవహర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ 4వేల కోట్ల రూ.లు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(CAG)నిర్ధారించిన మేరకైనా రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్ మనకు పూర్తి స్థాయిలో అందక పోవడమే గాక 2014-15,2016-17ల్లో అది ముగింపు అంశంగా కేంద్రం చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి వర్యుల ప్రత్యేక చొరవతో ఆ అంశాన్ని తిరిగి ఓపెన్ చేయడమే గాక కార్యదర్శుల కమిటీకి రిఫర్ చేస్తున్న నేపధ్యంలో ఉన్నత స్థాయిలో దానిని పరిష్కారం చేయాల్సి ఉన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వర్యులను కూడా ఢిల్లీ రావాల్సిందిగా కోరడం జరిగిందని సిఎస్ పునరుద్ఘాటించారు.
అదే విధంగా ఉత్తరాంధ్ర,రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులను అభివృద్ధి ఫ్యాకేజి కింద ఇవ్వాలని నీతిఆయోగ్ ను కోరామని అన్నారు.ఈఅంశంపైన మరియు పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు ఇతర ముఖ్యమైన అంశాలపైన మే 5న జరగనున్న దక్షిణ మండల జోనల్ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రస్తావించనున్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుండి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం,స్థానిక సంస్థలకు రావాల్సిన పెండింగ్ నిధులు వస్తాయని ఆశిస్తున్నామని సిఎస్ పేర్కొన్నారు.అదే విధంగా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు కూడా తగిన నిధులు వస్తాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్నివిధాలా కట్టుబడి ఉంది
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇప్పటికే జిపిఎఫ్,ఎపిజిఎల్ఐ తదితర పెండింగ్ బిల్లులకు సంబంధించి సుమారు 5వేల కోట్ల రూ.లు వరకూ చెల్లించినట్టు తెలిపారు.పిఆర్శీ డిఏ బకాయిలు,లీవ్ ఎన్క్యేష్మెంట్,కరువు భత్యం మంజూరుకు సంబంధించి ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశమై చర్చించడం జరిగిందని అన్నారు. ఎంప్లాయిస్ ఆరోగ్య పధకం అమలుకు సంబంధించి కొన్ని మార్పులు,చేర్పులు అడిగారని వాటికి అంగీకరించడం జరిగిందని త్వరలో పరిష్కరిస్తామని సిఎస్ స్పష్టం చేశారు.ఉద్యోగుల జీతాలను సకాలంలో చెల్లించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.ఈసమావేశంలో పాల్గొన్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ మార్చినెల జీతాలను సకాలంలో చెల్లించామని రానున్న మాసాల్లో కూడా ఆవిధంగా చెల్లించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.