Suryaa.co.in

Features

కనువిప్పు హర్షణీయం!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో ఏకీభవించే ఒక సందర్భం వస్తుందని నేను ఎన్నడూ ఊహించనిది . అందువల్లే నేడు అలాంటిది రాయవలసి రావడం ఒక విశేషంగా భావిస్తున్నాను.
కనీసం ప్రాథమిక విద్య దాకానైనా మాతృభాషలోనే బోధించమని వెంకయ్య నాయుడు గారు నేడు ప్రకటించడం హర్షించతగినది.
గడిచిన 40 ఏళ్లలో ఇంగ్లీషు మాధ్యమ బోధనా విధానాల వలన అటు ఇంగ్లీషు, ఇటు తెలుగు రాని తరాలను సృష్టించుకుని సృజనాత్మక శక్తులను ఘోరంగా ధ్వంసం చేసుకున్నాము. ఈ వాస్తవాన్ని అర్థం చేయించడానికి కొన్ని సంస్థలు వ్యక్తులూ కృషి సల్పుతున్నా , సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు లొంగిపోయిన పాలకులు, ఖడ్గమృగం మీద వాన చినుకుల వోలె పట్టించుకోకుండా వ్యవహరిస్తూ వస్తున్నారు. విద్యను ప్రైవేటీకరించడం, అనగా వ్యాపారికరించడంలో భాగంగా ఆంగ్ల మాధ్యమాన్ని తెలుగు పాలకులు పోషించుకుంటూ వస్తున్నారు.
దాని ఫలితంగా భావజాలపరంగా, మేధోపరంగా తెలుగుజాతి చాలా నష్టపోయింది. సాంస్కృతిక పతన విలువలకు పరోక్షంగా ఇంగ్లీషు మాధ్యమం చదువులు ఒక కారణంగా కూడా ఉన్నాయి. పాలకవర్గాలలో కూడా దీని పట్ల ఒక పునరాలోచన బయలుదేరడం ఆహ్వానించదగినది.
సంపన్నుల భాష – పేద వారి భాష, అగ్రకులాల భాష – దళిత కులాల భాష అనుకునేవి వేరు వేరుగా వుండవు. ఒకరి మాట , భావం మరొకరికి తెలియకుండా సమాజం నడవదు. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ లాంటి వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఎన్ని రకాల యాసలు మాండలిక భేదాలు , పద ప్రయోగ వైవిధ్యాలతో మాట్లాడుతున్నప్పటికీ , మౌలికమైన తెలుగు భాషా తత్వం ఒకటే !
భాషకున్న మరో గొప్ప లక్షణం ఏమిటంటే శత్రువులే అయినా పరస్పరం ఒకరినొకరు తెలుసుకోకుండా శత్రుత్వం ఏర్పడదు కదా! సంఘర్షించుకోవాలన్నా ఒకరి భావం, స్వభావం మరొకరికి అర్ధం అయి తీరాలి గదా! అందుకు సాధనం కూడా భాషే!! శత్రువులను కూడా అర్ధవంతమైన తన అక్షర పద సంపదతో కలుప గలిగిన సాధనం , మానవులు సాధించుకున్న గొప్ప జీవపరికరం … భాష!
ఈ సందర్భంగా ప్రముఖ కవి ఛాయ రాజును గుర్తుచేసుకుందాం.
నా ఆగ్రహం నా ఆవేశం శత్రువుకు అర్థం కావాలి!
నా ప్రేమ నా అభిమానం మిత్రులకు అర్థం కావాలి!
నా శ్రమ నా శక్తి నా భాషలోనే వ్యక్తం కావాలి!
పుట్టుక దగ్గర చావు దగ్గర పరభాషలో నవ్వలేను ఏడ్వలేను.
వెంకయ్య నాయుడు గారిలో కలిగిన ఈ కనువిప్పు చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు , వైయస్ జగన్మోహన్ రెడ్డిలలోనూ, సమస్త తెలుగు మీడియాలో కూడా రావాలని కోరుకుందాం…. దివికుమార్, జనసాహితి, 2-6-2019

దీనిపై ఇంగ్లీషు మాధ్యమ మద్దతుదారు ఒకరు చేసిన విమర్శ!
జనసాహితి దివికుమార్ గారికి వెంకయ్యనాయుడు గారి మాతృభాషాభిమానం భేషుగ్గా నచ్చేయడం తెగ ముచ్చట వేస్తున్నది.
కాషాయపు ఉన్మాదం మీద ఎత్తిన కత్తి దిశ మార్చుకోవడం మత తీర్థం కోసమో మరేదో మోక్షం కోసమో అర్ధం కావడం లేదు.

దీనిపై నా వివరణ!
వెంకయ్య నాయుడు గారి గురించి పై వ్యాఖ్య రాయడం వెనుక చిన్న కారణం ఉంది. ఆయన మాతృభాష అభిమానిగా ఎన్నో చోట్ల ప్రసంగిస్తూ ఉండటం మనందరికీ తెలుసు. కానీ అలాంటి భాషాభిమానం ప్రజలకు మాత్రమే ఉండాలన్నట్లు నీతి బోధలు చేస్తూ ఉండేవారు. విద్యను వ్యాపారంగా మార్చి ఇంగ్లీషు మాధ్యమo చదువులకు రహదారులు నిర్మిస్తున్న ప్రభుత్వాలపై నిర్ధిష్టంగా ఎప్పుడూ ఆయన విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆయన వ్యక్తం చేసిన స్పష్టమైన భావం —
ప్రాథమిక విద్య వరకు అయినా సరే తప్పనిసరిగా మాతృభాష మాత్రమే ఉండి తీరాలి అనేది!
ఇది విద్యా విధానంపట్ల పాలకులకు చేసిన నిర్దిష్ట సూచన . తమ దోపిడీ వ్యవస్థలను రక్షించుకోవాలన్నా పాలకులకు కూడా అంతో ఇంతో చదువరులైన కొత్త తరాలు కావాలి. 15 – 20 సంవత్సరాలు ఇంగ్లీషు మాధ్యమంలో చదివి, సొంతంగా ఒక ఉత్తరం కూడా రాయలేని తరాలతో వ్యవస్థలను నడుపుకోవడం వారికి కూడా సాధ్యం కాదు. అందుకే చేదు అనుభవం ఎదురైన తర్వాత అయినా ప్రాథమిక విద్య మాతృభాషా మాధ్యమంలోనే ఉండాలి అనే కనువిప్పు, ఏదో ఒక స్థాయిలో వారికి కలిగి ఉంటుంది.
మాతృభాషలను నిర్లక్ష్యం చేయటం వలన భావదారిద్ర్యం పెరిగి అంతిమంగా పాలక వర్గాలకు కూడా
సమస్యగా మారుతుంది. ఆలస్యంగానైనా, కొందరైనా దానిని గుర్తించడం హర్షణీయం అన్నదే నా అభిప్రాయం.
భాషకు వర్గాతీత స్వభావం ఉంటుందని తెలియని వారికి నేను చెప్పగలిగేది ఏమీ లేదు.

– దివికుమార్

 

LEAVE A RESPONSE