Suryaa.co.in

Editorial

తెలంగాణ టీడీపీకి బాలయ్యే దిక్కు!

– ఎన్నికల ప్రచారానికి బాలయ్య సై
– ‘ఎన్టీఆర్ యాదిలో’ పేరిట నాలుగు భారీ బహిరంగ సభలు
– హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండలో ఎన్నికల ప్రచారం
– పార్టీ ఆఫీసుకు రావడంతో పార్టీలో పెరుగుతున్న జోష్
– నేతలకు దిశానిర్దేశంతో క్యాడర్ లో ఉత్సాహం
– సీనియర్ల అనుభవాలు తెలుసుకుంటున్న బాలయ్య
– బాలయ్య రాకతో తెలంగాణ టీడీపీలో కదలిక
– బాలయ్య రాకతో పాతనేతల క్యూ
– కళకళలాడుతున్న టీడీపీ కార్యాలయం
– కాసాని మౌనంతో అయోమయంలో క్యాడర్
– పార్టీని నడిపించలేని వైఫల్యంలో కాసాని
– బాలకృష్ణ రాకతో కాసాని తెరమరుగు
– ఇకపై పార్టీకి తరచూ వస్తానన్న బాలయ్య
– 40 నియోజకవర్గాలపై టీడీపీ ఫోకస్
– కాసానితో సంబంధం లేకుండానే అభ్యర్ధుల ఎంపిక?
– కాసాని నిర్లిప్త వైఖరిపై నాయకత్వం అసంతృప్తి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎట్టకేలకు ఒక మొనగాడు దొరికాడు. కీలకమైన ఎన్నికల సమయంలో కాడి కిందపడేసిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు ప్రత్యామ్నాయంగా, ఒక జనాకర్షణ నేత వెలుగులోకి వచ్చారు. పార్టీని నడిపించేందుకు నడుంబిగించిన ఆ నేతకు అప్పుడే బ్రహ్మరథం పట్టడం మొదలైంది.

ఎక్కడైతే పార్టీ పుట్టిందో.. ఆ గడ్డమీదనే మళ్లీ పార్టీకి పునరజ్జీవం తెచ్చేందుకు ఆ నేత వేస్తున్న అడుగులకు, తెలంగాణ తమ్ముళ్లు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణలో స్వయంకృతాపరాధంతో చతికిలపడిన పార్టీని, మళ్లీ పరుగులుపెట్టించేందుకు దృష్టి సారించిన ఆ నేత రాక కోసం.. తెలంగాణ తెలుగుదేశం ఎదురుచూస్తోంది. ఆ నాయకుడే నందమూరి బాలకృష్ణ. సన్నాఫ్ ఎన్టీఆర్!

సన్నాఫ్ ఎన్టీఆర్.. ఇప్పుడు తెలంగాణ టీడీపీకి తురుపుముక్కగా మారారు. పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి నెలరోజులు దాటుతున్నా.. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క సీరియస్ కార్యక్రమం చేయని కాసాని నాయకత్వంపై, క్యాడర్ అసంతృప్తితో రగులుతోంది. మొక్కుబడి నిరసనలు, మీడియా కోసం ప్రదర్శనలే తప్ప.. హైదరాబాద్, తెలంగాణలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి..తాను ముందుండి పార్టీని నడిపించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న కాసానితో, ఇక తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదని స్పష్టమయింది.

ఆ నిస్సహాయ పరిస్థితిలో ఉన్న తెలంగాణ టీడీపీకి జవసత్వాలు ఇచ్చేందుకు నందుమూరి కెరటం బాలకృష్ణ హటాత్తుగా తెరపైకి రావడంతో, తెలుగు తమ్ముళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాలకృష్ణకు రాజకీయాలు పెద్దగా తెలియకపోయినా.. కుళ్లు-కుతంత్రాలు-వ్యూహాలు తెలియకపోయినా… కొండతో ఢీకొట్టే నైజమే, ఆయన వైపు లక్షలాదిమందిని కదిలించేలా చేస్తోంది.
బాలకృష్ణ ఇటీవలి కాలంలో, హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరచూ వస్తున్నారు. పార్టీ సమన్వయకమిటీతో భేటీలు వేస్తున్నారు.

సీనియర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణలో పార్టీ ఏవిధంగా ఉండేదని, సీనియర్ల వద్ద సమాచారం తెలుసుకుంటున్నారు. వారి అనుభవాలను ఆసక్తిగా వింటున్నారు. తన వద్దకు వచ్చిన నేతలతో ముచ్చటిస్తున్నారు. అయితే.. బాలకృష్ణ నిర్వహించిన ఏ ఒక్క సమావేశానికీ, పార్టీ అధ్యక్షుడు కాసాని హాజరుకాకపోవడం ప్రస్తావనార్హం.

ఇదిలాఉండగా.. ఇకపై తాను తెలంగాణ టీడీపీకి, ఎక్కువ సమయం కేటాయిస్తానని బాలయ్య నేతలకు హామీ ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేయాలన్నది, ఆయన యోచనగా కనిపిస్తోంది. ప్రధానంగా పార్టీ బలంగా ఉన్న హైదరాబాద్-రంగారెడ్డి-నిజామాబాద్- ఖమ్మం నియోజకవర్గాలతోపాటు, వరంగల్-నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో తిరిగి చైతన్యం తీసుకురావడమే బాలయ్య పర్యటన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎన్నికల ముందు.. ‘ఎన్టీఆర్ యాదిలో’ పేరిట, ఒక భారీ సభ నిర్వహించే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని నాలుగు ప్రాంతాల్లో నిర్వహించాలని యోచిస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ, దాదాపు 40 నియోజకవర్గాల్లో టీడీపీ విజయాన్ని నిర్దేశించే స్థాయిలో ఉంది. అయితే పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు.. రాజకీయ ఎత్తుగడ-వ్యూహాలు లేకపోవడంతో, పార్టీ చతికిలపడింది.

40 నియోజకవర్గాల్లో సజీవంగా ఉన్న పార్టీబలాన్ని, ఆయన సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఆయన ఆలోచనలు, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి స్థాయిలో లేవన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.

దీనిని గ్రహించిన బాలయ్య… పార్టీని తిరిగి పట్టాలకెక్కించేందుకు నడుంబిగించారు. ఇటీవల పార్టీ కార్యాలయానికి వచ్చిన బాలయ్య.. ఇకపై తాను పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని భరోసా ఇచ్చారు. దానికితోడు బాలయ్య పార్టీ ఆఫీసుకు వస్తున్నారని తెలియడంతో, స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలు కార్యాలయానికి క్యూలు కడుతుండటం విశేషం.

దీన్నిబట్టి.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు,హైదరాబాద్‌లో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయానికి రాకుండా ఎంత తప్పు చేశారన్నది స్పష్టమవుతుంది. చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీని మొత్తం కాసానికి రాసి ఇచ్చేశారని, ఒక మీడియా అధినేత-మరో జర్నలిస్టు ఇందుకు సహకరించారన్న చర్చ పార్టీలో బహిరంగంగానే జరుగుతోంది. ఈ కారణంతోనే స్తబ్దుగా ఉన్న పార్టీ నేతలెవరూ పార్టీ ఆఫీసుకు రావడం లేదని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ నిర్వహణ మొత్తం తానే భరిస్తానన్న హామీతోనే కాసాని అధ్యక్ష పదవి తీసుకున్నారని, అయితే అది కార్యాచరణలో చూపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఖమ్మం సభ సక్సెస్‌కు అక్కడి కమ్మ ప్రముఖులతోపాటు, అప్పటి ఖమ్మం జిల్లా బీసీ అధ్యక్షుడి కృషి ఉందని గుర్తు చేస్తున్నారు. నిధుల సమీకరణలో వారే కీలకపాత్ర పోషించారంటున్నారు.

ఖమ్మం సభ హిట్టయిన తర్వాత, ఆ జోష్‌ను కొనసాగించడంలో కాసాని విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నిస్తేజ పరిస్థితిలో.. జనంలో సినీ గ్లామర్ ఉన్న బాలయ్య తెరపైకి రావడం, పార్టీకి కొత్త జవసత్వాలు నింపడమేనన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

కీలకమైన టికెట్ల పంపిణీ భారాన్ని కాసాని ఒక్కరిపై మోపకుండా, స్టీరింగ్ కమిటీకి అప్పగించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. కాసానికి తెలంగాణ ముదిరాజ్ సమాజంలో ఇమేజ్ ఉన్నప్పటికీ..క్రియాశీల రాజకీయాల్లో అనుభవం తక్కువ కావడం.. టీడీపీ నాయకులపై పెద్దగా అవగాహన లేకపోవడంతో.. స్టీరింగ్ కమిటీ ద్వారానే అభ్యర్ధులను ఖరారు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.

LEAVE A RESPONSE