Suryaa.co.in

Devotional

కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల!

ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం – ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు.

“చదువు లేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. నేను నీవాడిని, నీవు నావాడివి” అని దేవుడికి చెప్పుకొనే వాడు. అందరూ అతని మాటలకు నవ్వుకొనేవారు. అతను పట్టించుకొనేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా ‘నాకేమి తెలుసు, అంతా గోపాలుడికే తెలుసు’అనేవాడు.

కూతురికి పెళ్ళి చేయడానికి డబ్బు అవసరం అయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని, పెళ్ళి చేసి, రెండు సంవత్సరాలు కష్టపడి, డబ్బు కూడబెట్టి, అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడు అని తెలిసిన వ్యాపారి, అప్పు తీరిపోయింది అని చూపే పత్రం తన దగ్గరే పెట్టుకొని, ఇంకా ఇన్ని రూపాయల అప్పు వుంది అని చెప్పే ఒక నకిలీ పత్రాన్ని తయారుచేసి దాన్ని ఇతనికి ఇచ్చిపంపాడు. నెల రోజుల తరువాత అప్పు తీర్చడం లేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేసాడు వ్యాపారి. ఇతను కోర్టు బోనులో నిలుచున్నాడు.

”అప్పు తీర్చలేదా?” లాయరు ప్రశ్న.
”తేర్చేసాను.”
”అందుకు సాక్ష్యంగా కాగితాలు వున్నాయా?”
”ఇదిగో”
”ఇందులో నీవు అప్పు వున్నావని వ్రాయబడింది.”

”ఏమో నాకేం తెలుసు? అంతా గోపాలుడికే తెలుసు.”
”నీవు అప్పు తీరుస్తున్నప్పుడు ఎవరైనా దగ్గరున్నారా?”
”అంతా గోపాలుడికే తెలుసు.”
కోర్టు హాల్లో నవ్వులు.

జడ్జి మనసులో అనుమానాలు. ఆయనకు అనిపించింది.
‘ఈ వ్యక్తి అమాయకుడు. అతను అబద్ధం చెప్పడంలేదు. కచ్చితంగా ఏదో జరిగింది.”
అపుడు ఆయన ”ఈవ్యక్తి అప్పు తీర్చిన సమయంలో ‘గోపాల్’ వున్నాడని, అతనికి అంతా తెలుసు అంటున్నాడు కదా! అతని పేరుతోనే సమన్లు పంపండి” అని చెప్పాడు.

అలానే చేసారు కోర్టువాళ్ళు. సమన్లు తీసుకొని ”ఇక్కడ గోపాల్ ఎవరు?” అని గ్రామానికివెళ్లిన కోర్టు వ్యక్తికి గోపాల్ పేరుతో ఎవరూ లేరని తెలుస్తుంది.

అపుడు ఎవరో ‘ఇక్కడ గోపాల్ జీ మందిరం ఒకటుంది. అక్కడ పూజారిని అడగండి’ అని చెప్పారు.
వాళ్ళు వెళ్ళి ఆ సమన్లను ఆ పూజారికిచ్చి వెళ్ళిపోయారు.

పూజారి దాన్ని చదివి ఏరోజు ‘గోపాల్’ అనే వ్యక్తిని సాక్షిగా కోర్టుకు రమ్మని వుందో, ఆరోజు గుడిలోని గోపాలకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి, ఆ సమన్లను ఆయన పాదాలవద్ద పెట్టి, ‘ప్రభూ, ఈ అమాయక భక్తుడిని నీవే కాపాడాలి’ అని ప్రార్థిస్తాడు.

కోర్టు హాల్లో విచారణ మొదలైనప్పుడు ” గోపాల్” అనే వ్యక్తి వచ్చి వుంటే ఆయన్ని సాక్షిగా ప్రవేశపెట్టండి అని జడ్జి చెప్పారు.

అపుడు ఒక ముసలాయన వచ్చి బోనులో నిలుచొన్నాడు.

”ఈ వ్యక్తి, ఆ వ్యాపారికి డబ్బు ఇస్తున్నప్పుడు నీవు చూసావా?”
”అవును, చూసాను.”

”మరి ఈపత్రంలో అప్పు తీర్చాలి అని వుంది?”

”అది అసలు పత్రం కాదు. నకిలీది. అసలు పత్రం వేరే చోట వుంది.”

”ఎక్కడుంది?”

”వ్యాపారి ఇంట్లో, ఫలానా గదిలో, ఫలానా బీరువాలో, ఫలాన సంచిలో.”

వ్యాపారిని అక్కడే వుండమని , ఆ గ్రామానికెళ్ళి వ్యాపారి ఇంట్లోని పత్రం తీసుకురమ్మని మనుషుల్ని పంపాడు ఆ జడ్జి.

వాళ్లు వెళ్ళి పత్రం తెచ్చారు. అందులో అప్పు తీర్చేసినట్టు వ్రాయబడివుంది. అమాయకుడిని మోసగించినందుకు వ్యాపారికి జరిమానా విధించారు.

సాక్ష్యం చెప్పిన ముసలాయన కోర్టు బయటికివెళ్ళి, మళ్ళీ కనిపించలేదు. జడ్జి గబ గబా వెళ్ళి ఆ అమాయకుడిని ఆపి ‘ఎవరు ఆ ముసలాయన?’ అని అడిగితే మళ్ళీ అదే సమాధానం “నాకేమి తెలుసు? అంతా గోపాలుడికే తెలుసు.”

జడ్జి తన గదిలోకెళ్లి ఏడుస్తున్నాడు. గమనించిన లాయర్లు, ఇతరులు పరుగెత్తికెళ్లి ఆయన్ని ‘సర్, మీరెందుకు ఇలా దు:ఖిస్తున్నారు?’ అని అడిగితే ఆయన అన్నారట.

”నేను జడ్జిగా దర్జాగా కుర్చీలో కూర్చొని, జగదీశ్వరుడిని బోనులో నిలబెట్టి ప్రశ్నించానే? ఈ ఘోర పాపానికి ప్రాయశ్ఛిత్తం వుంటుందా?”
ఆ తరువాత ఆ జడ్జిగారు ఏమి చేసారో తెలిస్తే మనం ఆశ్ఛర్యపోతాం.

ఆయన తన కుటుంబపోషణను తన పెద్ద కొడుక్కి అప్పగించి, తన పదవికి రాజీనామా చేసి, బృందావనం వెళ్ళి, అక్కడ ఒక సన్యాసి లాగా భిక్షాటన చేస్తూ, బృందావనపు మట్టిని కళ్ళకద్దుకొంటూ, రాధా కృష్ణ మందిరం [బాంకే బిహారీ ప్రేం మందిర్] వచ్చే భక్తులు ప్రదక్షిణం చేసే దారిని రోజూ శుభ్రం చేస్తూ, బృందావనం లోనే వుండిపోయాడు. అందరూ ఆయన్ని ‘జడ్జి స్వామీ’ అనేవారట.

డిజిటల్ యుగంలో ఈ మాయలు, చమత్కారాలు ఏమిటి? అని ప్రశ్నించే వారితో వాదించను.
నమ్మని వారికి గుడిలో వున్నాడు.
నమ్మిన వారికి గుండెలో వున్నాడు.
మొత్తానికి ‘వున్నాడు.’

– సేకరణ

LEAVE A RESPONSE