అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య
ఈగ ఇల్లు అలుకుతూ తన పేరు తాను మర్చిపోయిన చందంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలులో పెట్టిన తర్వాత తాను ముఖ్యమంత్రిని అన్న సంగతి పూర్తిగా మర్చిపోయారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు.
ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేస్తూ, చంద్రబాబు అరెస్టు సంగతి తనకు తెలియదని, తాను అప్పుడు దేశంలోనే లేనని, లండన్ వెళ్లానని చెప్పటం అంటే రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రిని కాదని, ఇంకెవరైనా ఉండి ఉండవచ్చు అని పరోక్షంగా అంగీకరించినట్లే అన్నారు. డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి, సిఐడి సంజయ్ , అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంటి ముఖ్యులనైనా గుర్తిస్తారో, లేదో ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడిగి చూడాలని అన్నారు.
చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా ఒకటే అని చెప్పటంలోనే జైల్లో ఉన్న చంద్రబాబును చూసి ముఖ్యమంత్రి ఉత్తర కుమారుడిలా వణికి పోతున్నట్టు కనిపిస్తుందన్నారు. నాలుగున్నరేళ్ళలో అన్ని వ్యవస్థలను పాదక్రాంతం చేసుకొన్నా, రాష్ట్రంలో ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అమలు చేస్తున్నా, తనకు, తన కుటుంబానికి స్పెషల్ సెక్యూరిటీ పెట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి లో భయం తగ్గలే దన్నారు. టిడిపి, జనసేన పొత్తు ఖరారు ప్రకటన తర్వాత ఆయనలో భయం మరింతగా పెరిగి, భుజాలు తడుముకుంటున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులు, జైళ్ళను నమ్ముకున్న ఏ ప్రభుత్వమూ తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవన్నారు. అరాచక పాలనకు ప్రజలు మంగళ హారతులు ఇస్తారనుకోవటం వైసిపి అవివేకం అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, భయపడే ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్ళ లేకపోయారని, దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళి సత్తా చూపించుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వానికి సవాల్ విసిరారు.