– రేవంత్ సర్కారుతో అగ్రహీరోల యుద్ధం వెనుక ఉన్న శక్తులెవరు?
– నాగ్ వెనక జగన్, కేటీఆర్ ఉన్నారంటూ కాంగ్రెస్ నేతల అనుమానాలు
– ఇప్పటిదాకా సర్కారుతో సయోధ్యకే ‘సినిమా’ పరిమితం
– కొత్త సినిమాల రేట్లు, షోల పెంపు కోసం పైరవీలు
– స్టుడియో లీజులు, మినహాయింపుల కోసం లాబీ
– పాలకుల చుట్టూ పెద్ద హీరోలు, నిర్మాతల ప్రదక్షణలు
– ప్రభుత్వంపై తొలిసారి తలపడుతున్న టాలీవుడ్
– నేరుగా మంత్రి సురేఖ పైనే నాగార్జున పరువునష్టం దావా
– రేవంత్ సర్కారుపై యుద్ధం చేస్తున్న నాగార్జున వెనుక ఉన్నదెవరు?
– సర్కారుతో యుద్ధానికి సినిమావాళ్ల ధైర్యమేమిటి?
– ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న బడా స్టార్లు
– సురేఖ సారీ చెప్పినా పట్టువీడని వైనం వెనుక ఉందెవరు?
– అంతిమంగా చెరువుకబ్జా కేసులో నాగ్ అరెస్టు తప్పదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
సహజంగా సినిమా వాళ్లు పాలకులు ఎవరున్నా వారితో సఖ్యతగానే ఉంటారు. సర్కారుతోగానీ, అధికారంలో ఉన్న పార్టీ నేతలతోగానీ అసలు కొట్లాటలు పెట్టుకోరు. పైగా పాలకులను ప్రసన్నం చేసుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే సినిమా వాళ్లకు పాలకులతో బోలెడు పనులుంటాయి కాబట్టి. ఇంకా సూటిగా చెప్పాలంటే.. భారీ బడ్జెట్‌తో తీసే సినిమాలకు ఎక్స్‌ట్రా టికెట్ రేట్లు-ఎక్స్‌ట్రా షోలకు అనుమతి ఇవ్వాల్సింది సర్కారే కాబట్టి. ఆ వారంరోజుల్లోనే నిర్మాతల డబ్బు చాలావరకూ రికవరీ అవుతుంది.
ఇంకా.. స్టుడియోలకు స్థలాల కేటాయింపు, ఇతర రాయితీల కోసం సినీ పరిశ్రమ సర్కారుపై ఆధారపడాల్సిందే. అందుకే సినిమా సర్కారు పట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తుంటుంది. ఇవికాక బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో సినీ పెద్దల అరాచకాలు తరచూ పోలీసుస్టేషన్‌కు చేరుతుంటాయి. అక్కడ రక్షణ కవచం కూడా అధికారపార్టీ వారివ్వాల్సిందే. మరి ఇన్ని రకాలుగా సర్కారుపై ఆధారపడుతున్న ‘సినిమా’.. హటాత్తుగా అదే సర్కారుపై ఎందుకు తిరుగుబాటు చేసింది? అక్కినేని నాగార్జునపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నప్పటికీ.. ఆ వివాదం కొనసాగించడంలో మతలబేంటి? సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బడాస్టార్లు ఏకమయ్యేంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ప్రతిదానికీ సర్కారుపై ఆధారపడే సినిమా వాళ్లకు, పాలకులపై యుద్ధం చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎందుకొచ్చింది? అసలు దాని వెనుక ఉన్న శక్తులెవరు? ఈ వ్యవహారంలో హీరో నాగార్జున వెనుక కేటీఆర్, జగన్ ఏమైనా ఉన్నారా? ఇదీ.. ఇప్పుడు టాలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై.. హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేయడం, సినీ-రాజకీయ వ ర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇది కొద్దిరోజుల నుంచి అన్ని వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. రొటీన్‌కు భిన్నంగా జరుగుతున్న ఈ పరిణామాలపై, సినీ-రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
సహజంగా సినీ పరిశ్రమ వ్యక్తులెవరూ ప్రభుత్వాలతో కొట్లాటలు పెట్టుకోరు. సయోధ్యకే ప్రయత్నిస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్, రాంచరణ్ వంటి పెద్దహీరోల సినిమాలకు.. అదనపు షోలు, అదనపు టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే, ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఏపీలో గత జగన్ సర్కారు పవన్ సినిమాలకు తప్ప, మిగిలిన హీరోల సినిమాలకు ఈ ‘అదనపు’ వెసులుబాటు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో సినిమావాళ్లకు వెసులుబాటు కల్పిస్తూనే ఉంది.
ఇది కాకుండా సినిమా స్టుడియోలకు ప్రభుత్వమే, భూమిని లీజు పద్ధతిలో కేటాయిస్తుంటుంది. మరెన్నో మినహాయింపులు, రాయితీల సౌకర్యం కూడా సినిమా పరిశ్రమ పొందుతోంది. అందుకే బడా స్టార్లు, బడా నిర్మాతలు ప్రభుత్వంలో ఉన్నవారితో సఖ్యతగా ఉంటారు. వరదల సమయంలో పోటీపడి విరాళాలివ్వడం ద్వారా, పాలకులకు దగ్గరవాలని ప్రయత్నిస్తుంటారన్నది బహిరంగ రహస్యం.
ఇక హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, మియాపూర్, గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసించే బడా స్టార్లు, బడా నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖుల కుటుంబ కొట్లాలు.. తరచూ ఆయా పరిథిలోని పోలీసుస్టేషన్లకు చేరుతుంటాయి.
సినీ పెద్దల పుత్రరత్నాలు, పుత్రికారత్నాలు చేసే యాగీ, దాడులు-దౌర్జన్యాలు చివరకు పోలీసుస్టేషన్లకు చేరుతుంటాయి. అవి చివరాఖరకు సెటిల్‌మెంట్ రూపంలో ముగియడానికి కారణం కూడా, ప్రభుత్వ పెద్దల జోక్యమే కారణమన్నది మనం మనుషులం అన్నంత నిజం. మరి ప్రభుత్వంలో ఉన్నవారితో ఇన్ని రకాల లాభాలు పొందుతున్న సినిమావాళ్లు.. అదే ప్రభుత్వంపై తిరుగుబాటుబావుటా ఎగరవేయడమే అన్ని వర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానితో.. అంత ధైర్యం వారికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారన్న ప్రశ్న సహజంగానే తెరపైకి వస్తోంది.
సమంత విడాకులకు సంబంధించి నాగార్జున-నాగచైతన్యపై, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య పెనుదుమారం సృష్టించింది. ఆమె వ్యాఖ్యలను ఖండించిన ఎన్టీఆర్, ప్రకాష్‌రాజ్, పోసానిమురళీకృష్ణ, రోజా వంటి నటులు నాగార్జునకు మద్దతుగా నిలిచారు. ఆ మేరకు మంత్రికి వ్యతిరేకంగా, నాగ్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో, మంత్రి సురేఖ దిద్దుబాటకు దిగారు. తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె ప్రకటించారు. కానీ కేటీఆర్‌పై తన యుద్ధం ఆగబోదని స్పష్టం చేశారు.
అక్కడితో ఈ యుద్ధం ఆగిపోతుందని భావించారు. కానీ నాగార్జున మంత్రి వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేశారు. అది మంగళవారం నాంపల్లి కోర్టుకు రానుంది. అక్కడ నాగ్‌తోపాటు, సాక్షుల వాంగ్మూలం నమోదు చేయనున్నారు. అంటే ఈ అంశంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకే నాగార్జున సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే అంతకుముందు.. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసిన నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అక్రమంగా నిర్మించారంటూ, జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిని లీగల్ ఒపీనియన్‌కు పంపిన పోలీసులు, నాగార్జునపై కేసు నమోదు చేశారు.
ఒకవేళ కోర్టు చర్యలు బట్టి, ప్రభుత్వ ప్రతిచర్య ఉండటం ఖాయంగా కనిపిస్తో ంది. అంటే ఒకవేళ సురేఖకు వ్యతిరేకంగా చర్యలుండే పక్షంలో, ప్రభుత్వం కూడా అందుకు ప్రతిచర్యగా.. కసిరెడ్డి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగార్జునను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు.
సహజంగా ఇంతపెద్ద సమస్య ఉత్పన్నమైనప్పుడు, అటు ప్రభుత్వం-ఇటు సినిమా పెద్దల మధ్య రాజీ చర్చలు జరుగుతుంటాయి. గతంలో ఆంధ్రభూమి ఫొటోగ్రాఫర్-సినిమా జర్నలిస్టుపై చిరంజీవి కుటుంబసభ్యులు దాడి చేసిన సందర్భంలోనూ అదే జరిగింది. చిరంజీవి కుటుంబంలో జరిగిన ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి వెళ్లిన జర్నలిస్టులపై, ఆయన బౌన్సర్లు దాడి చేశారు. దానితో జర్నలిస్టులు జూబ్లిహిల్స్ పోలీసుస్టేషన్‌లో అర్ధరాత్రి ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, ఆ తర్వాత అల్లు అరవింద్ పోలీసుస్టేషన్‌కు వచ్చి, జర్నలిస్టులు-పోలీసులతో చర్చలు జరిపారు.
ఆ తర్వాత కూడా శివాజీ వంటి నటులు, ఆంధ్రభూమి ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డి, నాటి సీఎం చంద్రబాబునాయుడు సాయం కోరారు. అప్పుడు సీఎం చంద్రబాబు ఆంధ్రభూమి అధినేత వెంకట్రామిరెడ్డితోను, నాటి సమాచారశాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆంధ్రభూమి ఎడిటర్ ఎంవిఆర్‌శాస్త్రితోనూ రాయబారం నడిపి, ఆ సమస్యకు రాజీమార్గం ద్వారా తెరదించారు. ఆ ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద అర్ధరాత్రి ధర్నా చేసి, శ్యాంప్రసాద్‌రెడ్డి-అల్లు అరవింద్‌తో వాగ్వాదానికి దిగిన జర్నలిస్టులలో నేనూ ఉన్నాను. అందుకే ఇంత వివరణ.
కానీ ఇప్పుడు అలాంటి రాజీలేవీ జరిగినట్లు కనిపించడకపోవడమే ఆశ్చర్యం. అటు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా, మంత్రి కొండా సురేఖకు పరువునష్టం నోటీసులు పంపారు. బీఆర్‌ఎస్ నేతలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాజకీయంగా వారిద్దరూ ప్రత్యర్ధులు కాబట్టి, అందులో పెద్ద విశేషమేమీ లేదు.
ఇక్కడ ఇంకో అంశంపైనా సినీ-రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నాగార్జున-కేటీఆర్; నాగార్జున-జగన్; కేటీఆర్-జగన్ మిత్రులు. కాబట్టి ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా లేకపోలేదన్నది ఆ చర్చల సారాంశం. ఆ రకంగా రేవంత్‌రెడ్డి సర్కారుపై యుద్ధానికి అటు కేటీఆర్, ఇటు జగన్ కూడా నాగార్జున వెనుక దన్నుగా నిలిచినా ఆశ్చర్యపడనవసరం లేదన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న మరో చర్చ.
ఏదేమైనా సీఎం రేవంత్‌రెడ్డి సర్కారుపై సమరానికి సై అంటున్న నాగార్జున యుద్ధం, చివరకు ఏ మలుపు తీసుకుంటుంది? ఈ వ్యవహారంలో ఇంకెన్ని శక్తులు ప్రత్యక్షంగా-పరోక్షంగా తెరపైకొస్తాయి? నాగార్జున భూకబ్జాపై కసిరెడ్డి పెట్టిన కేసు, ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.