Suryaa.co.in

Telangana

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్ సభ ఎంపీలు అర్వింద్ ధర్మపురి , బాలశౌరి వల్లభనేని లు ఎన్నికైనట్లు పార్లమెంట్ బులిటెన్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని, దాని ద్వారా బోర్డు 30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి ఆమోదించిందని, 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తెచ్చుకున్నామని, అందులో నుండి ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని పేర్కొన్నారు.

బోర్డు సభ్యునిగా ఎన్నికవ్వడం పట్ల ఎంపీ స్పందిస్తూ , దీని వలన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పసుపు మరియు మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మరింతగా కృషి చేస్తానని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. బోర్డు సభ్యునిగా తన ఎన్నికకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A RESPONSE