పంచాయతీరాజ్ నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి

– కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ

విషయం: తెలంగాణ ప్రభుత్వంచే పంచాయితీ రాజ్ నిధుల దుర్వినియోగం – దర్యాప్తుకై, తదనంతర చర్యలకై వినతి. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి 15వ ఆర్థిక సంఘం తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలను నిధులు విడుదల చేసింది. పంచాయితీరాజ్ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయితీలోని సంక్షేమ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచులకు మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పేరుపై బ్యాంకు ఖాతా తెరిచింది. గ్రామ పంచాయితీ కమిటీ తీర్మానం ఆధారంగా వీరికి ఆ డబ్బు డ్రా చేసే అధికారం ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు నేరుగా నిధులు కేటాయిస్తూ, విడుదల చేస్తున్నది. ఇందులో 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలిన 50 శాతం నిధులు సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలి. కేంద్ర ప్రభుత్వం తాజా విడత నిధులను తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీలకు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆయా గ్రామ సర్పంచులకు తెలియచేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సర్పంచులు, ఉప సర్పంచులకు తెలియకుండా, వారి బ్యాంకు ఖాతాల డిజిటల్ కీ ఆధారంగా ఈ నిధులను విత్ డ్రా చేసి కరెంటు బిల్లుల బకాయిలు, ఇతర బిల్లులకు అడ్వాన్సులు చెల్లించారు. పైపెచ్చు నిబంధనలకు విరుద్ధమైన పాత బకాయిలు చెల్లించేందుకు ఈ నిధులు వినియోగించినట్టు తెలుస్తున్నది.

తెలంగాణలో అన్ని ప్రాంతాలకు చెందిన సర్పంచులు నన్ను కలిసి, ఈ నిధులు తిరిగి తమ ఖాతాలో జమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయితీలకు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను దారి మళ్లించడం తెలంగాణ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

ఇటీవలె MGNREGA నిధులు కూడా దారి మళ్లించి, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వినియోగించినట్టు నా దృష్టికి వచ్చింది.
పై విషయాలను గమనంలోకి తీసుకొని, భారత రాజ్యాంగంలోని 73, 74 సవరణల ప్రకారం స్థానిక సంస్థల హక్కులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.
ధన్యవాదాలు.

Leave a Reply