- పార్టీ విధానం ప్రకారం అతనికి ప్రమోషన్ లభించవచ్చు
- మాధవ్ వీడియోపై మా ఎంపీలు నాతో మాట్లాడారు
- సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు ఆవేశం ఎక్కువ
- జివిడి కృష్ణమోహన్ రాసిచ్చిన స్క్రిప్టును మీడియా ముందుకు వచ్చి చదవాలి
- గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ నివేదిక కోరాలి
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఒక ఎంపీ గుడ్డలిప్పి చూపించిన వీడియో బయటికి రావడం పై విచారణ జరిపించాలని, ఒకవేళ ఆ వీడియోని నిజమైతే పార్లమెంట్ సిగ్గుతో తలదించుకోవల్సిన పరిణామమని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తన సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ నిర్దోషిగా బయటికి రావాలని, ఒకవేళ దోషి అని తేలితే పార్లమెంటుకు ఎలా రాగలరో చూడాలని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిందని, లోక్ సభ సభ్యులకు గ్రూప్ లోనూ చక్కెర్ల ను కొడుతుందని చెప్పారు. లోక్ సభ కారిడార్ లో ఎక్కడ చూసినా సభ్యులు ఇదే వీడియో గురించి చర్చించుకుంటున్నారని తెలిపారు.
రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వీడియోలో ఉన్నది మాధవ్ గానే కనిపిస్తున్నదని కానీ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో, మార్ఫింగ్ చేసే అవకాశాలు లేకపోలేదని అపహాస్యం చేశారు. వీడియోలో ఉన్నది…నేను చూసిన మాధవ్, నన్ను చంపుతానన్న మాధవ్ లాగే ఉన్నారని, కానీ అతను కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు.
జిమ్ లో ఉండగా ఎవరో అతని శారీరక దారుఢ్యాన్ని చూసి, ముగ్ధుడై తీసిన వీడియోను మార్ఫింగ్ చేసినట్లుగా చెబుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది మాధవ్ అయితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… ఆ వీడియోలో ఉన్నది మాధవ్ అయితే ప్రస్తుత తమ పార్టీ విధానం ప్రకారం అతనికి ప్రమోషన్ లభించవచ్చునని వ్యాఖ్యానించారు. ఒకవేళ పార్టీ నుండి సస్పెండ్ చేస్తే మహిళలు మా పార్టీ వైపు తిరిగి చూసే అవకాశం ఉన్నదని చెప్పారు. మా జగనన్న, మరి చిన్నపిల్లలైతే మా జగన్ మామయ్య మంచి నిర్ణయం తీసుకున్నారని ఆనందపడతారని తెలిపారు. తనకైతే అనుమానంగా ఉన్నదని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు వేచి చూద్దామని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు ఎవరైనా ఈ వీడియో గురించి మీతో మాట్లాడారా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఈ సంఘటనలో మాధవ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారో.. లేదో తెలియదు కానీ తనతో ఎవరైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడారంటే వారిని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తనతో మాట్లాడిన వారి పేర్లు చెప్పనని, తనతో ఈ వీడియో గురించి తమ పార్టీ సహచర ఎంపీలు చర్చించారని తెలిపారు.
ఇదే అంశంపై మాధవ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖంలో తప్పు చేసిన భావన కనిపించిందని మీడియా ప్రతినిధులు రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా, తాను చూడలేదని, కానీ అంత పెద్ద నింద పడినప్పుడు షాక్ కు గురికావడం సహజమేనని… ముఖము చూసి మాధవ్ దోషి అనడం కరెక్టు కాదని, అయినా మనిషి అబద్ధం చెప్పిన కళ్ళు మాత్రం అబద్ధం చెప్పవని, ఆయన ముఖ హావభావాలు, చెప్పకనే ఆయనను దోషి అని పరోక్షంగా చెబుతున్నాయని వ్యాఖ్యానించారు.
సునీల్ కుమార్ కు ఆవేశం ఎక్కువ…
సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు ఆవేశం ఎక్కువ అని, ఈ వీడియో చూసిన వారిని, షేర్ చేసిన వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలంటే, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలలో, నాలుగు కోట్ల మందిని అరెస్టు చేయవలసి వస్తుందని, వారిని పెట్టడానికి జైలు సరిపోవని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన వారిలో అందులో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా ఉండి ఉంటారని అన్నారు. తమ పార్టీ ఎంపీలు ఇప్పటికీ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టకుండా, ఫోరెన్సిక్ నివేదిక చేతికి వచ్చిన తర్వాత పెడితే బాగుంటుందని సూచించారు.
తన సహచర ఎంపీ అయినా గోరంట్ల మాధవ్ తాను చూపించిన బ్యాక్, మీడియాలో వచ్చిన ఫ్రంట్ ఒకటి కాదని నిర్ధారణై, త్వరగా నివేదిక అందాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరు స్పందించలేదన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రఘురామ స్పందిస్తూ… తమ పార్టీలో ఎవరైనా స్పందించాలంటే జివిడి కృష్ణమోహన్ రాసిచ్చిన స్క్రిప్టును మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చాకే, మీడియా ముందుకు వచ్చి చదువాల్సి ఉంటుందని చెప్పారు. సహచర ఎంపీలకు భోజనాలు పెట్టాలన్న, తాడేపల్లి ప్యాలెస్ అనుమతి తీసుకోవాల్సిందేనని, అలా తీసుకోక పోవడం వల్లే, తనపై అనర్హత అన్నారని, మరి భోజనాలు పెట్టినందుకే అనర్హత అంటే బాగుండదని, స్టుపిడ్, సిల్లీ కారణాలను సాకుగా చూపెట్టి అనర్హత అంటూ ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈ వ్యవహారంపై మా ముఖ్యమంత్రి ఫోరెన్సిక్ నివేదిక అవసరం లేదనుకుంటే,సునీల్ కుమార్ కు చెప్పి టిడిపి నేతలు అందరిపై కేసులను పెట్టించే అవకాశం ఉన్నదని, అలా కాదనుకుంటే మాధవలు సస్పెండ్ చేయవచ్చునని అన్నారు. వైయస్ వివేక హత్య కేసులో నిందితునిగా ఉన్న శంకర్ రెడ్డి ని పార్టీలోనే కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేశారు. మాధవ్ కు దూకుడు స్వభావం ఎక్కువ అని, పార్లమెంటు వేదికగా నన్నే చంపేస్తానని బూతులు తిట్టారని, అయితే ఆ సమయంలో తాను కాసింత తీవ్రంగా ప్రతిఘటిస్తే, అతన్ని ఖర్చు కింద రాసి నా అకౌంట్ లో వేయాలని చూశారని గతంలోనే మీడియాకు చెప్పానని పేర్కొన్నారు. తాను సమయమనం పాటించడం వల్ల, మాధవ్ బతికి బట్ట కట్టగలిగారని తెలిపారు.
లోక్ సభ లో చోటు చేసుకున్న ఆ సంఘటనపై తాను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయగా, తనని కనీసం సంప్రదించలేదని తెలిపారు. పార్లమెంటులో జరిగిన ఘటనను మేనేజ్ చేయడం వల్ల ఎలాగైతే సమసి పోయిందో, ఈ వీడియో వ్యవహారం కూడా అలాగే సమసిపోయి మళ్లీ మాధవ్ కు ఎంపీ టికెట్ లభించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని, కేంద్ర క్యాబినెట్ లోకి వెళితే అటువంటి పదవిని అలంకరించాలని కోరుకుంటున్నానని రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ ఈ వీడియో నిజమైనదే అయిన మాధవ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని తాను అనుకోవడం లేదని, ఇప్పటివరకూ ఎవరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, రాజ్యాంగం ప్రకారం నడుచుకుందాం, రాజ్యాంగ అతిక్రమణ సరికాదని చెప్పిన తనపైనే చర్యలకు ఉపక్రమించారని గుర్తు చేశారు.
విలువల గురించి మాట్లాడే వారిపై తప్ప, వలవలు విప్పే వారిపై తమ పార్టీ విధానం ప్రకారం చర్యలు ఉండవని స్పష్టం చేశారు. అవినీతి కేసుల్లో, ఇతర కేసుల్లో ఉన్నవారికి మంత్రి పదవులు వస్తాయని ముందే సోషల్ మీడియాలో చెప్పినట్లుగానే కొంతమందికి మంత్రి పదవులు దక్కాయని గుర్తు చేశారు. మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వాయిస్ ఆడియోలతో పాటు, ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను ఫోరెన్సిక్ నివేదిక కోరాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
ఫోరెన్సిక్ నివేదికలో మాధవ్ నిర్దోషిగా బయటపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టులో మాధవ్ పిల్ వేస్తానని అనడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని, ఎందుకంటే పిల్ అనేది ప్రజా ప్రయోజన వ్యాజ్యమని… ఈ వ్యవహారంలో వ్యక్తిగతమే తప్పితే, ప్రజా ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ఒకవేళ కావాలనుకుంటే విలేజ్ మోషన్ ను మూవ్ చేసుకోవచ్చని చెప్పారు. మాధవ్ పై ఎవరైనా పార్లమెంట్ కు ఫిర్యాదు చేయవచ్చునా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆ వీడియో పూర్తిగా చూసిన మహిళలు ఎవరైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని చమత్కరించారు.