Suryaa.co.in

Andhra Pradesh

శాశ్వత … జీవితకాలం అధ్యక్షుడు అంటే చెల్లదు

-రాజకీయ పార్టీ నియమావళి ప్రకారం నిర్వహించాల్సిందే
-పీపుల్స్ రిప్రజెంటివ్ యాక్ట్ లో ఈ విషయం స్పష్టం
-ఐదేళ్లకొకసారి కచ్చితంగా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాల్సిందే
-మీ అబ్బాయి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
-సాక్షి దినపత్రిక కథనాలు నమ్మొద్దు…
-వీలైతే విజయమ్మను కలిసి వివరిస్తా… లేదంటే లేఖ రాస్తా
-ప్లీనరీ నిర్వహణ వల్ల తమ పార్టీకొచ్చిన ఖర్చేమీ లేదు లాభమే తప్పితే
-ఎమ్మెల్యేలకు ప్లీనరీ టాక్స్ వేశారట..!
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

” శాశ్వత అధ్యక్షుడు అనే విధానం భారత దేశంలో కుదరదు… ఇది ఆడి అబ్బా బాబు సొత్తేమి కాదు.. పార్టీ అంటే కార్యకర్తలది.. ఆడే మీ ఓనర్ కాదు… జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా ” అంటూ నరసాపురం ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తాను కూడా పార్టీలో సభ్యుడినని, ప్రతిదీ తనకు అడిగే హక్కు ఉందని చెప్పారు. పార్టీ నియమావళి, రాజ్యాంగం కాపీ తన వద్ద ఉందని, అధ్యక్ష పదవికి ఎన్నిక జరగ వల్సిందేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఐదేళ్లకు ఒక్కసారైనా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. ఎవరు అధ్యక్ష పదవికి పోటీ చేయకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకానీ శాశ్వత, జీవితకాలం అధ్యక్షుడు అంటే కుదరదని స్పష్టం చేశారు. ఈ విధానం మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో లేదని చెప్పారు. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ ప్రాథమిక విధానాలను తెలియజేసేందుకు తాను అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటనకు తనను హాజరు కానిస్తే, ప్లీనరీకి కూడా వచ్చి అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడనే ఉద్దేశ్యంతోనే, తనపై తప్పుడు కేసులు తోకడా కేసులు పెట్టారని విరుచుకోబడ్డారు.

శాశ్వత, జీవితకాల అధ్యక్ష ప్రతిపాదనను చూస్తే…
జగన్మోహన్ రెడ్డి తన పరిపాలన మాదిరిగానే , తన పార్టీ కూడా నియంతృత్వ పార్టీ అని చెప్పినట్లుగా ఉన్నదని విరుచుకుపడ్డారు. శాశ్వత అధ్యక్షుడు అనే తీర్మానం ఈరోజు చేసుకుంటారో, రేపు చేసుకుంటారో … పార్టీ నియమ నిబంధనావళిని సవరించుకొని, శాశ్వత అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించుకున్న కూడా చెల్లదని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వాహణ గురించి సభ్యులకు ముందే చెప్పాలన్నారు. రాజకీయ పార్టీ నియమావళి ప్రకారమే పార్టీని నడపాలని, ఈ విషయాన్ని రెప్రజెంటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 29 4 ఏ లో స్పష్టం చేయడం జరిగిందని వెల్లడించారు.

న్యాయం కోసం పోరాడుతా విజయం సాధిస్తాముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేయాలనుకున్న
ఒక అధికారితో కుమ్మక్కై తనపై నమోదు చేసిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటం చేస్తానని తేల్చి చెప్పిన రఘురామకృష్ణంరాజు, విజయం సాధిస్తానని భీమా కూడా వ్యక్తం చేశారు. తనపై నమోదు చేసిన తప్పుడు కేసులను న్యాయస్థానాల్లో సవాలు చేస్తానన్న ఆయన, హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టు కు వెళ్తానని చెప్పారు. పార్లమెంటులో కూడా చర్చిస్తానన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి, ప్లీనరీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు, ఆ దత్త పుత్రుడు… ఆ రామోజీరావు, ఆ రాధాకృష్ణ అంటూ ఏడిచే బదులు, మనం ఏమి చేశామని ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

ఫోను ద్వారా 40 మంది ఎంపీల మద్దతు
తాను గురువారం నాడు రాజ్యసభ, లోక్ సభ సభ్యులకు రాసిన లేఖకు 40 మంది ఎంపీలు స్పందించి, తనకు ఫోన్ చేసి, సోదరా… నీ వెంట మేమున్నామంటూ భరోసా నిచ్చారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అవసరమైతే తమ వంతుగా నిరసన కూడా తెలియజేస్తామని పేర్కొన్నారని చెప్పారు. తమ పార్టీ వాళ్లు ఫోన్లు చేసి రఘు… అన్ని అబద్ధాలే చెబుతున్నాడని, తామేమి ఆయనని కొట్టలేదని, ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపలేదని, ప్రధాని పర్యటన సందర్భంగా ఆహ్వానించామని, వెహికల్ పాస్ కూడా ఇచ్చామని… అయినా ఆయనే ప్రధాని సభకు హాజరు కాలేదని చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. తమ పార్టీ వాళ్లు కూడా ఫోన్లు చేసి చెప్పుకునే అవకాశాన్ని తానే కల్పిస్తున్నానని వివరించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడం చట్ట విరుద్ధమని చెప్పిన “తగ్గేదేలే” అన్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బెదిరిపోతున్నారని చెప్పారు. ఈ విషయమై తాను క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలు చెప్పింది చేయాలని, లేకపోతే తన ఫ్లెక్సీ కట్టిన వాడికి ఏ గతి పట్టిందో, అదే విధానాన్ని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పట్ల కూడా అమలు చేస్తున్నారని చెప్పారు. మాట వినని ఎస్పి, డిఎస్పీలను బెదిరిస్తూ రూల్ ఆఫ్ పులివెందులను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పట్ల కొనసాగుతున్న దాష్టికాన్ని వివరిస్తూ కేబినెట్ కార్యదర్శి లేఖ రాస్తానని వెల్లడించారు..

రివర్స్ టెండరింగ్ .. రివర్స్ పాలన మాదిరిగానే మా పార్టీ విధానం
రాష్ట్రంలో కొనసాగుతున్న రివర్స్ టెండర్ రింగ్, రివర్స్ పాలన మాదిరిగానే తమ పార్టీ విధానం కొనసాగుతుందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్లమెంటు ఉభయ సభలలో రాష్ట్రపతికి పెద్ద ఆసనం వేసి, ప్రధాని ఎంత గొప్పవాడైన అతని ఆసనం కంటే చిన్నది వేస్తారన్నారు. కానీ మా పార్టీలో గౌరవాధ్యక్షురాలుకి చిన్న కుర్చీ వేసి, అధ్యక్షుడికి మాత్రం పెద్ద కుర్చీ వేశారన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు, తన తల్లి విజయమ్మని పెద్ద కుర్చీలో కూర్చోబెడితే, జగన్మోహన్ రెడ్డి విలువే పెరిగి ఉండేది అన్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలిని గౌరవించే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. వైయస్ సతీమణిగా, పార్టీ గౌరవాధ్యక్షురాలుగా విజయమ్మంటే తమకు ఎంతో గౌరవం ఉన్నదన్నారు. వీడ్కోలు సభలోనైనా కని, పెంచిన కన్న తల్లి కాబట్టి… తన కష్టంతో, ఇంకా తన కుమార్తె కష్టంతో… జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు… నడిరోడ్డుపై నిలబడి దేహి అని తిరుగుతూ, సోనియా గాంధీ కాళ్ల, వేళ్ల పడి బెయిల్ ఇప్పించి, పార్టీని బతికించిన ఆమెకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు.. పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి రాజీనామా చేస్తూ మాట్లాడిన విజయమ్మ, తమ బాబు చెప్పినవన్నీ చేశాడని, అందరూ ఆయన్నీ చూసి కుళ్లుకుంటున్నారని … పచ్చ మీడియా అంటూ విమర్శలు గుప్పించడం పట్ల రఘురామ విస్మయం వ్యక్తం చేశారు.. విజయమ్మను వీలైతే స్వయంగా కలిసి, లేదంటే లేఖ రాసి సాక్షి దినపత్రిక కథనాలు నమ్మవద్దని, హైదరాబాదుకు వెళ్ళగానే సాక్షి దినపత్రికను చదవడం మానివేయాలని కోరుతానని చెప్పారు. మీ సన్నీ చెప్పినవి ఏమీ చేయలేదమ్మా… గతంలో లబ్ధిదారులకు వెళ్లే మొత్తాన్ని, ఇతర ప్రయోజనాల కోసమని నేరుగా ఖాతాలలో జమ చేస్తున్నారని చెప్పారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టినది ఒకే ఒక స్కీమ్ అని, దానిలోను ఎన్ని విధాలుగా కోతలు విధించాలో, అన్ని విధాలుగా కోతలను విధిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 30 లక్షల ఇల్లు అన్నారని, కనీసం మూడు ఇళ్ళను కూడా కట్టలేదని రఘురామ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన భవనాలకు వైఎస్ఆర్ పార్టీ రంగులను వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

లాభం తప్పితే నష్టం లేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీ వల్ల లాభమే తప్పితే నష్టం లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమ జిల్లాకు చెందిన వారితో బలవంతపు భోజనాలను ఏర్పాటు చేయించినట్లు తెలిసిందన్న ఆయన, ఎమ్మెల్యేలకు ప్లీనరీ ట్యాక్స్ కూడా విధించినట్లు తనకు సమాచారముందని చెప్పారు. ఇక 40 రకాల వంటకాలు అంటూ సాక్షి టీవీలో చూపిస్తూ, పార్టీలకతీతంగా వచ్చి భోజనాలు చేసి వెళ్ళాలన్నట్లు గా రెచ్చగొడుతున్నారన్నారు. రేపు మరో నలభై రకాల వంటకాలు చేసుకోండని ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE