-ఒక్క కడుపుకు అన్నం తినడానికి ఎంత డబ్బులు కావాలి
-పది ప్యాలెస్ ఉన్నాయి
-శరీరంలోని ప్రతి భాగాన్ని ఒక్కొక్క ప్యాలెస్ లో పెట్టి పడుకో లేవు కదా?
-జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డ్రగ్స్ దొరకని గ్రామం లేదు
బ్రెజిల్ తో ఉన్న సంబంధం ఏమిటి?
-పల్లెటూర్లలోనూ విచ్చలవిడిగా అందుబాటులో మాదకద్రవ్యాలు
-ప్రభుత్వ ప్రమేయం లేకుండా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దిగుమతి అసాధ్యం
-ప్రభుత్వ పెద్దల ప్రమేయం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో మాదకద్రవ్యాలు దొరకని గ్రామం లేదని, పల్లెటూర్లలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా లభిస్తున్నాయని నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. పల్లెటూర్లలో కూడా మాదక ద్రవ్యాలు లభించడం ఎలా సాధ్యమని ఆలోచిస్తే విజ్ఞులైన ప్రజలకు అర్థమవుతుందని చెప్పారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గతంలో టాల్కం పౌడర్ పేరిట కాకినాడకు చెందిన కొద్ది మంది నాయకులు మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్నారు. వాటి విలువ 21 వేల కోట్ల రూపాయలను తేల్చారు. తర్వాత ఆ విషయాన్ని మీడియాతో పాటు ప్రజలు మర్చిపోయారు.
విశాఖపట్నంలో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకుంటూ దొరికిపోవడంతో, ఇప్పుడు మళ్లీ ఆ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మాదకద్రవ్యాల దిగుమతి వ్యవహారంతో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రమేయం ఉన్నదని సాక్షి దినపత్రికలో రాయడం పరిశీలిస్తే .. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.
గత ఎన్నికలకు ముందు కోడి కత్తితో పొడిపించుకుని, కోడి కత్తితో పొడిచారని డ్రామాలు ఆడినట్లుగా, బాబాయిని హత్య చేసి నారా వారి రక్త చరిత్ర అని రాసినట్లుగానే… ఇప్పుడు కూడా అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇతరులపై నిందలు వేయాలని చూడడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఏ కంపెనీ పేరిట విశాఖపట్నం పోర్ట్ కు మాదకద్రవ్యాలు దిగుమతి అయ్యాయో, ఆ కంపెనీ ప్రమోటర్లు ఎవరో వివరించాల్సిన బాధ్యత నాపై ఉన్నదన్నారు. బాధ్యత నిర్వాహణలో భాగంగా స్పష్టంగా వివరిస్తానని… ఒకవేళ నేను చెప్పింది తప్పయితే దేనికైనా సిద్ధమేనని రఘురామకృష్ణం రాజు సవాల్ చేశారు.
డాక్టర్ కె వి ప్రసాద్, కూనం వీరభద్రరావు కంపెనీ స్థాపించిన మాట నిజమే
డాక్టర్ కె వి ప్రసాద్, కూనం వీరభద్రరావు లు మంచి స్నేహితులని, వీరిద్దరూ కలిసి తొలుత కంపెనీని స్థాపించిన మాట నిజమేనని రఘురామకృష్ణం రాజు తెలిపారు. సంధ్యా మెరైన్ , సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్, సంధ్య ఆక్వా టెక్ అనేవి మూడు వేరువేరు కంపెనీలని పేర్కొన్నారు. మిత్రులిద్దరూ వ్యాపారంలో సక్సెస్ అయిన తర్వాత ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్నారు. పాలకొల్లు, ప్రకాశం జిల్లాలో వారికి ఉన్న రెండు యూనిట్లను చెరొక యూనిట్ గా పంచుకొని ఎవరి వ్యాపారాన్ని వారు ప్రారంభించారు. కూనం వీరభద్రరావు కుమారుడు కోటయ్య అమెరికాలో స్థిరపడ్డారు. సీఈఓ గా ఆయన పర్యవేక్షణలో అనుకున్న దానికంటే కంపెనీ రెండింతలు సక్సెస్ అయ్యింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది.
కూనం వీరభద్రారావు ను ప్రకాశం జిల్లాకు చెందిన వైకాపా నేతలు బాగా అభిమానిస్తారు. వైకాపాను ఆయన అభిమానిస్తారా?, లేదా అన్నది పక్కన పెడితే… రాష్ట్రంలో పరిశ్రమలు ఉన్నవారు ఎవరైనా వైకాపా నేతలను ఇష్టపడి తీరాల్సిందే. ప్రకాశం జిల్లాలోని కూనం వీరభద్రరావు కంపెనీకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని వైకాపా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. ఎన్విరాన్మెంట్ నిబంధనలను పాటించడం లేదని సాక్షి దినపత్రిక లోను రాశారు. ఎందుకంటే, పరిశ్రమల యజమానుల వద్ద ఎక్స్టార్షన్ కోసం ప్రభుత్వ పెద్దలు ఇదే విధానాన్ని అమలు చేస్తారు .
ప్రభుత్వ మద్దతు అవసరం కావడంతో, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు లొంగిపోతారు. ప్రతి ఒక్కరూ రఘురామ కృష్ణంరాజు లెక్కన తిరగబడి పోరాటం చేయలేరు. అక్కడే ఇంపోర్ట్ కోసం డీల్ కుదిరినట్లు తెలుస్తోందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ఈ డీల్ లో జగన్మోహన్ రెడ్డి నియమించిన వెంకట్ రెడ్డి అనే అధికారి పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ ఏడాది జనవరిలో కూనం వీరభద్రారావు, కృష్ణకుమారి దంపతుల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి ఫోటోలతో పాటు బాపట్ల ఎంపీ, ఇతర వైకాపా నాయకుల ఫోటోలను ముద్రించినట్లు స్పష్టమవుతోందని, ఫ్లెక్సీ ని మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.
సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీతో కె.వి.ప్రసాద్ కు సంబంధం లేదు
సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీతో డాక్టర్ కె వి ప్రసాద్, ఆయన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. డాక్టర్ కె.వి.ప్రసాద్ గారి అబ్బాయికి, డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి దంపతుల కుమార్తెకు 12 నుంచి 14 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది. మాదకద్రవ్యాలు దిగుమతి అయిన కంపెనీ, దగ్గుబాటి పురందరేశ్వరి బంధువుల కంపెనీ అని సాక్షి దినపత్రికలో రాయడం హేయం. భార్యాభర్తలు కలిసి లేపేసిన తర్వాత.. నారాసుర రక్త చరిత్ర అని రాసినట్టుగానే, ఇప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర చేస్తున్నారని రఘు రామ కృష్ణంరాజు మండిపడ్డారు.
దగ్గుబాటి పురందేశ్వరి పేరు రాస్తే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని ఉద్దేశంతో, ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి పేరును పత్రిక కథనాలను ప్రస్తావించడం సిగ్గుచేటు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలో దగ్గుబాటి పురందరేశ్వరి అల్లుడికి రూపాయి విలువ చేసే షేర్ కూడా లేదు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ వేరు సంధ్య ఆక్వా టెక్ కంపెనీ వేరు. సంధ్య ఆక్వా టెక్ మీడియం లెవెల్ కంపెనీ. అదే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ పెద్ద కంపెనీ. ఎంతో విజయవంతమైన కంపెనీ అని రఘు రామ కృష్ణంరాజు వివరించారు.
బ్రెజిల్ తో ఉన్న సంబంధం ఏమిటి?
బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తికి వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ, ట్విట్ చేయడం వెనుకనున్న ఆంతర్యం ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో రాజకీయ నాయకులలో ఒక్క పర్సెంట్ వ్యక్తులు చెప్పినా నా వేలు నరుక్కుంటానని ఆయన సవాల్ చేశారు. అటువంటి బ్రెజిల్ కు అధ్యక్షుడు ఎవరో ఒకరు ఎన్నికైతే, వారిని అభినందిస్తూ 2022 అక్టోబర్ 31వ తేదీన విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు . అమెరికా అధ్యక్షుడు ఎవరంటే అందరూ చెప్పగలరు, ఎందుకంటే, అమెరికాలో మన బంధువులు ఉంటారు కాబట్టి… బ్రెజిల్ లో ఎటువంటి యవ్వారాలు నడపకపోతే అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి , విజయ సాయి రెడ్డి కి ఎలా తెలుస్తారంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లకు బ్రెజిల్ దేశంతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు లేకపోతే, ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ఎందుకు శుభాకాంక్షలను చెబుతారని నిలదీశారు. భవిష్యత్తులో కంటైనర్ దొరికిపోతుందని బహుశా అంచనా వేసి ఉండరని అందుకే దూలతో ట్విట్ చేసి తప్పులో కాలు వేశారన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేవలం సాధారణ వ్యక్తులతో సాధ్యం కాదని, ఇది కేవలం ప్రభుత్వ పెద్దలతోనే సాధ్యమవుతుందన్నారు. నైజీరియన్లు చిన్న మొత్తంలో డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తే వారిని అదుపులోకి తీసుకుంటారన్నారు.
చిన్న మొత్తంలో డ్రగ్స్ విక్రయించడం కూడా నేరమేనన్న ఆయన , మలేషియా, సింగపూర్ దేశాలలో ఒక్క గ్రాము మాదకద్రవ్యం లభించిన ఉరిశిక్ష విధిస్తారన్నారు. నైజీరియన్ల వద్ద గ్రాముల్లో దొరికితేనే కఠినమైన శిక్షలు విధించినప్పుడు, టన్నుల్లో మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకున్న వారికి ఏ శిక్ష విధించాలన్నారు. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్ట్ నుంచి 20 పాలెట్ల కంటైనర్ అంటే 25 టన్నుల ఎండబెట్టిన డ్రైడ్ ఈస్ట్ పేరిట మాదకద్రవ్యాలను విశాఖపట్నం పోర్ట్ లో దిగుమతి చేసుకునే ప్రయత్నం చేశారు .
సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ఇటీవల కొత్తగా ఫీడ్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ఉంది. సంధ్యా మెరైన్ వారికి మొదటినుంచి ఫీడ్ ప్లాంట్ ఉంది. ఫీడ్ ప్లాంట్ లోకి డ్రైడ్ ఈస్ట్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, డ్రైడ్ ఈస్ట్ పేరిట దిగుమతి చేసుకున్నప్పటికీ, వారు తీసుకువచ్చింది మాత్రం డ్రైడ్ ఈస్ట్ కాదు. గతంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని వీళ్ళను బెదిరించిన వైకాపా నాయకులే, డ్రైడ్ ఈస్ట్ పేరిట మాదకద్రవ్యాలను దిగుమతి చేసుకొని ఉంటారన్నారు. ఒక్క కేజీ మాదకద్రవ్యాన్ని హ్యాండిల్ చేయడమే సాధారణ వ్యక్తులకు సాధ్యం కానప్పుడు, 25 వేల కేజీల మాదకద్రవ్యాలను హ్యాండిల్ చేయడం ఎలా సాధ్యమవుతుందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
మాదకద్రవ్యాలతో జీవితాలు సర్వనాశనం
ఒక టన్ను మాదకద్రవ్యాలు అంటేనే వేల కోట్ల రూపాయలని, అటువంటి మాదకద్రవ్యాలతో ప్రజల జీవితాలు సర్వనాశనం అవుతాయని రఘురామ కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సొంత మధ్య బ్రాండ్ల ద్వారా మహిళలు మాంగల్యానికి దూరమవుతున్నారని, మద్యపాన ప్రియుల ఆరోగ్యాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలలో నగదు లావాదేవీలే తప్ప, ఆన్లైన్ పేమెంట్స్ ని అంగీకరించరు.
నాలాంటివారు పోరాడగా, కేవలం ఐదు శాతం మద్యం దుకాణాలలో ఆన్లైన్ చెల్లింపులను అంగీకరించినప్పటికీ, అందులోను 95 శాతం షాపులలో ఆన్లైన్ చెల్లింపులను అంగీకరించకుండా, యంత్రాలు పనిచేయడం లేదని కుంటి సాకులు చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యాన్ని విక్రయిస్తోంది. ఆరు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యాన్ని తాగితే ఎవరికైనా కిడ్నీలు, లివర్, ఇతర అంతర్భాగాలు అవుట్ అందులో నో డౌట్ అని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
నేను చెప్పిందే అక్షరాల నిజమయింది
తాడేపల్లిగూడెంలో ఇటీవల జరిగిన కూటమి బహిరంగ సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. మూడు రాజధానులని అన్నారని, కానీ రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని , దేశానికి రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రాజధానిగా మార్చారని నేను చెప్పిన మాటలు… విశాఖ పోర్టులో దొరికిన మాదకద్రవ్యాల ద్వారా అక్షర సత్యాలని తేలిపోయిందన్నారు.
విశాఖపట్నం పోర్టు లో దొరికిన మాదకద్రవ్యాల గురించి ఎఫ్ఐఆర్ రాసింది డీఎస్పీ స్థాయి అధికారి ఉమేష్ శర్మ అని, ఆయనతో పాటు మరో నలుగురు అధికారులు కలిసి బెంగళూరు చేరుకొని అక్కడనుండి ఎయిర్ ఇండియా విమానం ద్వారా విశాఖకు చేరుకున్నారన్నారు. 18వ తేదీన కంటైనర్ లోని ప్రతి బస్తా నుంచి శాంపిల్స్ సేకరించారన్నారు. అక్కడికి కూనం హరికృష్ణ ను పిలిపించుకొని ఆయన సమక్షంలోని అధికారులు శాంపిల్స్ సేకరించారన్నారు . శాంపిల్స్ ను రాపిడ్ టెస్టు చేయగా, ఓపియం, హెరాయిన్, కోకేన్, కోడిన్ వంటి మాదకద్రవ్యాలుగా గుర్తించారు.
ప్రతి 25 కేజీల బ్యాగులో ఎంత మోతాదులో మాదకద్రవ్యాలు ఉన్నాయన్నది తెలియదు. 25 కేజీల బ్యాగులో ఎంత మోతాదులో డ్రైడ్ ఈస్ట్ ఉన్నది … ఎంత మొత్తం మోతాదులో మాదకద్రవ్యాలు ఉన్నవి అన్నది పరీక్షల్లో తేలనుంది. అయితే అవి కచ్చితంగా మాదకద్రవ్యాలే అన్నది మాత్రం నిర్ధారణ అయిందన్నారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి వెళ్ళవలసిన అవసరం లేదు. అది ఆయన పరిధిలోకి రాదు. అయినా పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు వచ్చి తమను ఇబ్బందులకు గురి చేశారని సిబిఐ అధికారులు వెల్లడించారు.
అక్కడి నుంచి వారిని వెళ్ళిపోవాలని ఆదేశించినట్లుగా చెప్పామని పేర్కొన్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . విశాఖపట్నం పోలీస్ కమిషనర్ తక్షణమే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏమి జరుగుతుందో చూడడానికి వెళ్లినట్లుగా తెలిపారన్నారు. మాదకద్రవ్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొనడం పరిశీలిస్తే, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉంది
మాదకద్రవ్యాల దిగుమతిలో కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు . ప్రజలకు మేలు చేస్తానని రాజకీయాలలోకి వచ్చి ఆటలు ఆడించిన … బ్రెజిలియన్ డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్ను లాగా డబ్బుల కోసం ఇంత నీఛానికి ఒడిగడతారా? అని ప్రశ్నించారు. ఒక్క కడుపుకు అన్నం తినడానికి ఎంత డబ్బులు కావాలని నిలదీశారు. పది ప్యాలెస్ లో ఉన్నాయి. శరీరంలోని ప్రతి భాగాన్ని ఒక్కొక్క ప్యాలెస్ లో పెట్టి పడుకో లేవు కదా?
ఒక్క ప్యాలెస్ లోనే పడుకోవాలి కదా అంటూ రఘురామ కృష్ణంరాజు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పిల్ల సజ్జల నిర్వహించే ఓ పత్రికలో మాదకద్రవ్యాల దిగుమతి కేసులో ఏ 2 నారా చంద్రబాబు నాయుడు అని, ఏ 9 నారా లోకేష్ అని తప్పుడు ప్రచారాన్ని అప్పుడే మొదలుపెట్టారు. గతంలో బాబాయిని లేపేసినప్పుడు ఎలాగైతే దారుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టారో, ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు.
మాదకద్రవ్యాల దిగుమతి వ్యవహారం ఆ కంపెనీకి తెలిసి ఉండకపోవచ్చు
మాదకద్రవ్యాల దిగుమతి వ్యవహారం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యానికి తెలిసి ఉండకపోవచ్చునని రఘురామ కృష్ణంరాజు అన్నారు. బ్రెజిల్ దేశంతో సంబంధాలు ఉండి, ఇంత సరుకు దొరికిన తరువాత కూడా ఇతరులపై అడ్డంగా నిందలు వేయగలిగిన సామర్థ్యం కలిగిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్నారు. మాదకద్రవ్యాల దిగుమతి వ్యవహారం చివరకు ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియదన్న ఆయన, పాతిక కోట్ల రూపాయలను తీసుకున్నందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు.
బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న మాదకద్రవ్యాల విలువ కనీసం 50 వేల కోట్ల రూపాయలు ఉంటుందని, అక్కడ నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించి సరుకు కొనుగోలు చేసి ఉండాలన్నారు. అంత సొమ్ము వెచ్చించే శక్తి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీకి లేదని, అన్ని వేల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం రాష్ట్రంలో ఎవరికి ఉందో ప్రజలందరికీ తెలుసునన్నారు. అయినా సరైన వ్యాపారాలు చేసే వారెవరు ఇటువంటి దరిద్రపు పనులు చేయరని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.
రక్తపు కూడు అవసరమా?
యువతను నిర్వీర్యం చేస్తూ, వారి భవిష్యత్తును సర్వనాశనం చేసి రక్తపు కూడు తినడం అవసరమా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఇంకా ఎన్ని ఏళ్లు బ్రతుకుతారు 20 నుంచి మహా అయితే 40 ఏళ్ల పాటు మాత్రమే బ్రతుకుతారని, దానికోసం కోట్లాదిమంది జీవితాలు నాశనం చేసి సాధించేది ఏమిటని మండిపడ్డారు . ఇటువంటి వారిని ఎన్నికల్లో కులం చూసో మతం చూసో గెలిపిస్తే, వారు మళ్లీ ఇటువంటి వ్యాపారాలను చేయడానికి అవకాశాన్ని కల్పించిన వారు ప్రజలే అవుతారన్నారు.
అధికార నేతల బూట్లు, చంకలు ఇంకా నాకుతున్న కొంతమంది పోలీసు అధికారులు
కొంతమంది పోలీసు అధికారులు ఇంకా అధికార పార్టీ నాయకుల బూట్లు నాకుతున్నారని రఘు రామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. పోలీసులతోపాటు వాలంటీర్లు కూడా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లను విధుల్లో నుంచి తప్పించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయినా వాలంటీర్లు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. వాలంటీర్లను అధికార పార్టీ నేతలు బరితెగించి తిప్పుతున్నారు. మరో 50 రోజులపాటు వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా పనిచేయకుండా చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఏప్రిల్ 1వ తేదీన వాలంటీర్ల ప్రమేయం లేకుండా వృద్ధాప్య పింఛన్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున పోటీ
తెలుగుదేశం, జనసేన పార్టీ లకు కేటాయించిన పార్లమెంటు స్థానాల జాబితాలో నరసాపురం స్థానం లేదని, ఆస్థానాన్ని బిజెపికి కేటాయించినట్లుగా స్పష్టమయ్యిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బిజెపి అభ్యర్థిగా 24 నుంచి 48 గంటల వ్యవధిలో ఎవరెన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించిన కూటమి తరపున పోటీ చేస్తాను. గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన, నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి కనుసన్న లో పనిచేసే నాయకులు ప్రయత్నిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతను నువ్వెంత అని ప్రశ్నించిన నన్ను, చంపే ప్రయత్నాన్ని చేసిన ప్రతిఘటించిన నన్ను బిజెపి నాయకత్వం కాదని అంటుందని అనుకోవడం లేదన్నారు. బిజెపి అభ్యర్థిగా, జగన్మోహన్ రెడ్డిని సమూలంగా రాజకీయంగా కోలుకోలేని దెబ్బతీసే విధంగా కూటమిని గెలిపించుకుందామని రఘురామ కృష్ణంరాజు అన్నారు .
రాజకీయాల్లోకి వచ్చిన డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్న్
నాలుగు లక్షల కోట్ల అధిపతి అయిన పాబ్లో ఎస్కోబార్న్ లాభం లేదనుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. కొంతమందికి గృహాలను నిర్మించి ఇచ్చారని, కొలంబియాలో ఫుట్బాల్ కు క్రేజ్ అధికమని,రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర టైపులో అక్కడ వందలాది మైదానాలను అభివృద్ధి చేసి ఫుట్బాల్ ఆడించారని తెలిపారు. పాబ్లో ఎస్కోబార్న్జై ల్లో ఐదేళ్లపాటు ఉన్నారని, చివరకు జైల్లో ఉండలేక తానే పెద్ద భవంతిని నిర్మించుకుని అదే జైలుగా భావించాలని కోరారని తెలిపారు. అందులోనే సర్వ సౌకర్యాలను కల్పించుకొని చరిత్రలో ఎవరు అనుభవించని విధంగా పాబ్లో సుఖాలను అనుభవించారన్నారు. చివరకు పోలీసుల కాల్పుల్లో పాబ్లో ఎస్కోబార్న్ చని పోయినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.