-కాళ్లు కట్టేసి కొట్టి… ఊర్లోకి రానివ్వరా???
-నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న మాధవ్ కు 500 కార్లతో స్వాగతమా???
-అభినందనలు జగన్మోహన్ రెడ్డి.. ఇలాగే ప్రోత్సహించండి
-నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణంరాజు
రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనని దేశద్రోహిగా చిత్రీకరించి, కాళ్లు కట్టేసి కొట్టారని… ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్నారని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు తెలిపారు. కానీ నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను 500 కార్లతో భారీ ఊరేగింపుగా తమ పార్టీ నేతలు స్వాగతం పలికి, తీసుకు వెళ్లడం ఏమిటని? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అభినందనలు … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇలాగే ప్రోత్సహించండి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. దేశం అంతా తమవైపే చూస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ చెబుతుంటారని, ఈ రకంగా ప్రోత్సహించడం ద్వారా, అవును … దేశం అంతా ఇప్పుడు మీ వైపే చూస్తుందని అపహాస్యం చేశారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వివాదం పై, పంజాబ్ ఎంపీ జస్బి ర్ సింగ్ గిల్ , జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాయగా, మహిళా కమిషన్ వెంటనే స్పందించి ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ కు పంపించినట్లు తెలిసిందన్నారు. ఇప్పటికే జస్బీర్ సింగ్ గిల్ ఇదే అంశంపై ప్రధాని, స్పీకర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. గోరంట్ల మాధవ్ నగ్న వీడియో పై ప్రజల్లో నెలకొన్న సందేహాన్ని తీర్చేందుకు, ప్రతిష్టాత్మక ప్రైవేటు పరిశోధన కేంద్రానికి పంపి నివేదికను తెప్పించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రభుత్వ పరిశోధన కేంద్రం అంటే… తన కేసు విషయమై, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అందజేసిన నివేదిక లాగానే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడంతా ఈ నగరానికి ఏమైందన్నట్లుగా, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కు ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారని అపహాస్యం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రతి అంశాన్ని సుమోటోగా కేసులు నమోదు చేసే, సునీల్ కుమార్ ఎక్కడ అని ప్రజలు నిలదీస్తున్నారని తెలిపారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రంగనాయకమ్మను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించిన సునీల్ కుమార్, ఎందుకని నగ్న వీడియో కేసుపై స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. నగ్న వీడియో పై వీలైతే ప్రతిపక్షాలు, ప్రైవేటు పరిశోధన కేంద్రాన్ని ఆశ్రయించి నివేదిక తెప్పించాలని, లేదంటే తానే ఒక ప్రైవేటు పరిశోధన కేంద్రాన్ని ఆశ్రయించి నివేదికను తెప్పిస్తానని చెప్పారు. ఎందుకంటే… ఇంకా తాను ఈ పార్టీలో కొనసాగుతున్నానని, పార్టీ పరిస్థితి దరిద్రంగా దీనస్థితికి దిగజారడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే, ప్రైవేటు పరిశోధన కేంద్రాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. నగ్న వీడియో వివాదములో చిక్కుకున్న గోరంట్ల మాధవ్ ను ఇలాగే సన్మానిస్తే ప్రజలు భయాందోళనలు చెందే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ఇక ఇళ్ళ మీద పడిపోతారని ప్రజలు అనుకునే ప్రమాదం లేకపోలేదని అన్నారు. హాలీవుడ్లో సూపర్ మాన్ సీక్వెల్ సినిమాల తరహాలో, తెలుగులో న్యూడ్ మెన్ సినిమా వస్తుందని అందరూ అంటున్నారన్నారు. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న మాధవ్ నిర్దోషని తేలకపోతే, న్యూడ్ మాన్ సినిమా హీరో పాత్ర పేరు మాధవ్ అవుతుందన్నారు. తమ పార్టీ ప్రతిష్ట మాధవ్ ఊరేగింపు ర్యాలీతో పెరుగుతుందేమో చూడాలి అని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.
ఇంపాక్ట్ పన్నుతో ఉత్కో.. ఉతుకు
ఇప్పటికే రాష్ట్ర ప్రజలపై చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తి పన్ను పేరిట భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా ఇంపాక్ట్ పన్ను వేయనుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 60 అడుగుల రహదారి పక్కనే ఎవరైనా ఇంటి, వ్యాపార భవనాన్ని నిర్మిస్తే, వారిపై జగనన్న ఇంపాక్ట్ పన్ను దెబ్బ పడునుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో సిమెంటు, ఇసుక ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఇసుక ధరలు రాష్ట్రంలో కొనసాగుతుండగా, దేశంలో ఎక్కడా లేని విధంగా సిమెంట్ రేట్లు ఉన్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డికి చెందిన భారతి సిమెంట్ కంపెనీ బాక్సైట్ తవ్వకాలను చేపడుతున్నదని, ఇందులో ప్రతిరోజు 600 ట్రక్కుల బాక్సైట్ ఖనిజం లభిస్తుందని అంటున్నారని, ఈ విషయంపై కంపెనీ ప్రతినిధులు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. తవ్వకాల దగ్గరకు ఎవరిని ఎందుకని రానివ్వరంటూ నిలదీశారు.. ఇంపాక్ట్ పన్ను భారంతో, ముందస్తు ఎన్నికలకు వెళ్లిన, 2024 లో ఎన్నికలకు వెళ్లిన మనల్ని జనం ఉతికి ఆరేస్తారన్నారు. ఉచితాలు కరెక్ట్ కాదని, సంక్షేమం సరేనని, మన తెలివి తక్కువ తనం అజ్ఞానంతో సంక్షేమం కూడా శాశ్వతంగా సంక్షోభంలోకి నెట్టే విధంగా ఉండకూడదని రఘురామకృష్ణం రాజు అన్నారు. 40 పథకాలలో ఉన్న సంక్షేమాన్ని వదిలేసి, మనమిచ్చే మెతుకులపై ఆధారపడి విధంగా కాకుండా సంక్షేమ కార్యక్రమాల ప్రజలకు సహకారాన్ని అందించే విధంగా అమలు ఉండాలన్నారు. ఒక మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడేలా సహకారాన్ని, సంక్షేమం రూపంలో అందించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేయడం చేసి, ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం దురదృష్టకర మని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతికి.. రాష్ట్ర ఆర్థిక సంక్షేమంపై లేఖ రాశా
రాజ్యాంగంలో కల్పించిన హక్కు ప్రకారం ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మాతృభాషలో కొనసాగించే విధంగా విద్యార్థులకు ప్రొవిజన్ ఉండేలా చూడమని పార్లమెంటులో కోరినందుకు తనని డిస్ క్వాలిఫై చేయాలను చూశారని, వాళ్ల ఎత్తులు పారాక కేసులు పెట్టి, సూటు కేసులను మోశారని… అయినా పని జరగకపోవడంతో ఎత్తుకెళ్లి దేశద్రోహం కేసు పెట్టి, కాళ్లు కట్టేసి చితకొట్టారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కు రాసిన లేఖలో రఘురామకృష్ణంరాజు వివరించారు. రాజ్యాంగంలోని 293 అధికరణ ఉల్లంఘన, ఎస్బిఐ అప్పుల గోల, నిబంధనలకు భిన్నంగా అప్పులు చేయడాన్ని పార్లమెంటులో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తప్పు పట్టడం, బ్యాంకులకు ఆర్బిఐ రాసిన లేఖ, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్రపతికి రాసిన లేఖలో వివరించినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. రాష్ట్ర ప్రజలను రక్షించే విషయం లో, మానసికంగా, శారీరకంగా దెబ్బలు తిన్న ప్రజా జీవితంలో వెను తిరిగేది లేదని చెప్పారు. రాక్షసుల పైన పోరాటం కొనసాగుతుందన్న ఆయన, న్యాయం ఆలస్యమైన జరిగి తీరుతుందన్నారు. ఇక రాష్ట్రపతికి రాసిన లేఖలో నిత్యం గోల్ఫ్ ఆడే సునీల్ కుమార్, తన కాళ్ళపై గోల్ఫ్ ఆడిన ఫోటోలను చూపించగా రాష్ట్రపతి కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారని చెప్పారు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ గారిని కుటుంబంతో కలిసి మాట్లాడే అవకాశం లభించడం ఆనందంగా అన్నారు. ద్రౌపది ముర్మూ గారు అద్భుతమైన, ఉన్నతమైన, మంచి మనసున్న వ్యక్తి అని రఘురామకృష్ణంరాజు కొనియాడారు. తన కుటుంబ సభ్యులతో కలిసి 20 నిమిషాల పాటు మాట్లాడేందుకు సమయం ఇచ్చినందుకు రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఫ్లెక్సీలను తొలగించగలరు… కానీ ప్రజల గుండెల్లో చెరిపి వేయలేరు
పాలకొల్లులో తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రారంభించిన గృహాలను మళ్లీ ఇప్పుడు ప్రారంభించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రోటోకాల్ పాటించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ కార్యాలయంలో కింద కూర్చుని తన నిరసన వ్యక్తం చేశారన్నారు. ఇక గృహ సముదాయ ప్రారంభోత్సవం సందర్భంగా తన పోటో ఉన్న ఫ్లెక్సీని ప్రసాద్ రాజు అని ఎమ్మెల్యే తక్షణమే తొలగించాలని ఆదేశించినట్లు తెలిసిందన్నారు. తన ఫ్లెక్సీలను తొలగించగలరేమో కానీ, ప్రజల గుండెల్లోంచి తనని తొలగించలేరని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నా ఫ్లెక్సీలను తొలగించినంతమాత్రాన మా ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే, నా బొచ్చు కూడా ఊడేది లేదని అన్నారు.
మూడు వేల కోట్ల బాదుడు కు రెడీ
2000 కోట్ల రూపాయల ట్రూ అప్పు చార్జీలను ప్రజలపై మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇక ఆ క్వార్టర్ లో స్పెండ్ చేసింది 60 రోజుల్లోగా ఫైల్ చేయాలి, అలా ఫైట్ చేయనందుకు మరో 637 కోట్ల రూపాయలు.. మొత్తంగా మూడు వేల కోట్ల రూపాయలతో ప్రజలకు బ్యాండ్ బాజా భారాతే నని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెగ్యులేటర్ కమిటీ విద్యుత్ టారిఫ్ పెంచిందన్న ఆయన, అదనంగా ట్రూ అప్పు చార్జీల వడ్డన వల్ల సామాన్యులు హార్ట్ ఎటాక్ తో మరణించే ప్రమాదం లేకపోలేదు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణంగా విద్యుత్ ఛార్జ్ వసూలు చేయడం లేదని చెప్పారు. ఈ విద్యుత్ ఛార్జ్‌లను సామాన్యుడు భరించగలరా? అని ప్రశ్నించారు. జగనన్న విద్యా దీవెన పేరిట 1000 కాలేజీలకు ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును, 11 లక్షల మంది తల్లుల అకౌంట్లో కి మళ్లించి నంత మాత్రాన, విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచినా ఓట్లు పడిపోతాయని అనుకుంటున్నారా అంటూ నిలదీశారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వీడియోను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రదర్శించిన రఘురామకృష్ణం రాజు… ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటనీ విరుచుకుపడ్డారు.
విజయమ్మ కారు ప్రమాదం పై తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా స్పందించాలన్న రఘురామకృష్ణం రాజు, ఒకే సమయంలో రెండు టైర్లు బద్దలవ్వడం ఏమిటనీ, ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ నిపుణులతో తాను ఇదే విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు, రెండు టైర్లు ఒకేసారి బద్దలవ్వడం అన్నది అసంభవమని వారు తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ఇందులో ఏమైనా ఆ దుష్ట చతుష్టయం పాత్ర ఉన్నదా?, ఇంకెవరి పాత్ర అయినా ఉన్నదా?? అన్నది తేల్చాలని అపహాస్యం చేశారు. సాధారణంగా కారు టైర్ల జీవితకాలం 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందన్నారు. వేసవికాలంలో ఎండలో ఉన్న, రన్నింగ్ లో ఉన్న టైర్లు బద్దలయ్యే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు . కానీ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు కేవలం 3000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన టయోటా వెల్ఫేర్ వాహనమని పేర్కొన్నారు. అరగని ట్యూబ్ లెస్ టైర్లు బద్దలవటం ఏమిటో అంతుచిక్కడం లేదన్నారు.. ఈ విషయమై మ్యానుఫ్యాక్చర్లతో కూడా మాట్లాడాలని, అసలు ఇది ఎండాకాలం కూడా కాదని గుర్తు చేశారు. ఇలా జరగడం మ్యానుఫ్యాక్చర్ కు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందన్నారు.
ఈ ప్రమాదం వెనుక ఏదో కుట్ర ఉన్నదని, ఇప్పటికే చిన్నానను కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, తల్లి ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై సీరియస్ గా స్పందించాలని , అంత ఈజీగా ఈ ప్రమాద ఘటనను వదలకూడదని కోరారు. అయితే ప్రమాద ఘటన వార్త మిగతా దినపత్రికలలో ప్రస్ఫుటంగా కనిపించినప్పటికీ, సాక్షి దినపత్రికలో మాత్రం తనకు కనిపించలేదని అన్నారు.