- ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిసుందాం రా అనుకుంటున్నారు… మధ్యలో మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి?
- మనతో ఏ పార్టీ వారైనా కలుస్తారా?
- నాలుగు గోడల మధ్యలో ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్దాం
- నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
” ఔను … వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, కలిసుందాం రా అని అనుకుంటున్నారు… మధ్యలో మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి” అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఐదు నిమిషాలు బేటి కావడం పట్ల రాద్దాంతం చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో ముఖ్యమంత్రిగా పని చేశారని, ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు కీలక నేతగా వ్యవహరించారని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారని, దాన్ని కూడా తప్పు పట్టడం ఏమిటి అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ప్రధానితో ఐదు నిమిషాలు బేటి అయితే, తమ ముఖ్యమంత్రి గంట సేపు పాటు కలిసి డిన్నర్ చేశారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ప్రధాని, ఇతరులతో కలిసి డిన్నరే చేయలేదని గుర్తు చేశారు. ఓ ఐదారు మంది ముఖ్యమంత్రి చేశారన్నారు. అయినా ప్రధాని గంటసేపు మధ్యాహ్న భోజనం చేయరని, తనకున్న పని ఒత్తిడిలో భాగంగా, కేవలం పది పదిహేను నిమిషాల వ్యవధిలో ముగిస్తారని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిసి ఉన్నప్పటికీ, దూరంగా కూర్చున్నారని, దానికి గంటసేపు ప్రధానితో జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసిన, తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అసలు మనతో ఎవరైనా కలుస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇలాగే నాలుగు గోడల మధ్య చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఎద్దేవా చేశారు.
బిజెపి, జనసేన ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్నాయని, వారితో టీడీపీ జత కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. తాను ఎప్పటినుంచో ఈ విషయాన్ని చెబుతున్నానని గుర్తు చేశారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు, వాళ్లు కలిస్తే 175కు 174 స్థానాలు అవుతాయా? అంటూ ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే, తమ పార్టీ 30 నుంచి 35 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు లేవని చెప్పారు.
తెలంగాణలో గెలుపు కోసమే …
తెలంగాణలో గెలుపు కోసమే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దీటుగా పోరాటం చేస్తున్న టిడిపితో బిజెపి జతకట్టే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసరాలలోని 20 నుంచి 25 నియోజకవర్గాలను దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం ప్రజలే గెలుపోటములు శాసిస్తున్నారని తెలిపారు. ఏపీలో తమ ప్రభుత్వం పాలన లో , తమ స్నేహితులు, బంధువులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెలుసుకున్న తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడే వారికి మద్దతునివ్వాలని భావిస్తున్నారన్నారు. రాజధాని అమరావతికి, ఏపీలోని ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతునిస్తుండగా, తమ పార్టీ మాత్రం మూడు రాజధానులను, విశాఖలో భవనాలు కట్టుకొని వెళ్ళిపోతామని పేర్కొనడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు.
డి ఓ పి టి కి లేఖ రాశా…
సీనియర్ ఐఏఎస్ అధికారులను కాదని, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ డివోపిటి కార్యదర్శి రాధికా చౌహాన్ కు లేఖ రాశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. త్వరలోనే వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను ఆ కమిటీలో సభ్యుడిని కూడా అని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు సమావేశమై, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్లు తనకు తెలిసిందని చెప్పారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన పోస్ట్ గురించి తప్ప, తమ గురించి పట్టించుకోవడం లేదన్న ఆవేదనలో ఐఏఎస్ అధికారులు ఉన్నట్లుగా తనకు సమాచారం ఉందని వివరించారు.. ఇండియన్ రైల్వే ఆడిట్ సర్వీస్ నుంచి వచ్చిన సత్యనారాయణ ను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించడం ఏమిటని, గత అస్మదీయులైన ఇతర శాఖలకు చెందిన అధికారులు విజయ్ కుమార్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలకు కీలక శాఖల బాధ్యతలను అప్పగించారన్నారు. మూడు నెలల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులకు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని చెప్పారు. 11 మంది ఉన్నతాధికారులను కాదని తన జిల్లాకు చెందిన అధికారికి పూర్తిస్థాయి ఇంచార్జ్ డిజిపి బాధ్యతలను అప్పగించారని రఘురామకృష్ణం రాజు ఆక్షేపించారు. సీనియర్ల ను కాదని, నేరుగా డిజిపి పోస్టు ఇవ్వడానికి వీలు లేకపోవడంతో, పూర్తిస్థాయి ఇన్చార్జ్ డిజిపిగా నియమించారన్నారు. తాను ఇదే విషయమే రెండుసార్లు యూపీఎస్సీ లో రిమైండర్ ఇచ్చానని, వారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెండుసార్లు రిమైండర్ ఇచ్చారని తెలిపారు. అయినా రూల్స్ లేవు… తొక్క లేదు అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని విమర్శించారు.
ఇప్పటికైనా ఐఏఎస్ అధికారులు తమని తామ కాపాడుకుంటూ, వ్యవస్థలను కాపాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, తాను ఐదేళ్లపాటు ఉంటామని, ఐఏఎస్ అధికారులు శాశ్వతం అని గుర్తు చేశారు. ఇక అందర్నీ శాసిస్తున్న సకల శాఖ మంత్రి కనీసం ప్రజా ప్రతినిధి కూడా కాదని గుర్తు చేశారు. ప్రజలందరి చేత గౌరవించబడి ఐఏఎస్ అధికారులు, తమకు ఎదురవుతున్న కష్టాన్ని కళ్ళు తెరిచి ఫిర్యాదు చేయాలని సూచించారు..
60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు
9వ తేదీ వచ్చినప్పటికీ 60 శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. ట్రెజరీకి వచ్చిన ఆదాయాన్ని తొలుత ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు వెచ్చించాలన్న ఆయన, ఆ సొమ్మును సంక్షేమ కార్యక్రమాల అమలుకు మళ్లించడం సరికాదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం అన్నది ప్రభుత్వ ప్రథమకర్తవ్యమని, ఆ తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి పెట్టుకున్న అధికారులకు, కీలక బాధ్యతలను అప్పగించి, నిధులను దారి మళ్ళిస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రైతులకు 100% మద్దతు ధర చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లుగా సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించిందని, అంటే… ఇన్నాళ్లు రైతులకు మద్దతు ధర ఇవ్వలేదని దాని అర్థం కాదా అంటూ పెద్దవా చేశారు.. రాష్ట్రంలో విప్పి చూపెడితే తప్పు లేదు కానీ, తప్పును ప్రశ్నిస్తే మాత్రం చితకబాదుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో మాధవ రెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో ఎక్కువసేపు నిలబడలేక అసహనంతో నిరసన వ్యక్తం చేయగా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనిని గొడ్డును బాదినట్టు బాదిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. మాధవ రెడ్డిని చితకబాదినది గోరంట్ల మాధవ్ కాగా, ఆయన పై అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేయగా అతన్ని వీఆర్ లో ఉంచారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి, గొడ్డును బాదినట్లు, బాదినందుకు మాధవ్ కు ప్రమోషన్ ఇచ్చారన్నారు. ఒక పోలీస్ అధికారిగా ఒక వ్యక్తిని గొ డ్డును బాదినట్లు బాదినందుకు ఎంపీగా ప్రమోషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు విప్పి చూపించినందుకు కూడా ప్రమోషన్ ఇస్తారేమోనని అపహాస్యం చేశారు.
మార్ఫింగ్ చేశారనేది ఎలా తెలుస్తుంది
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో మార్ఫింగ్ చేశారనే విషయం ఎలా తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.. కేసు నమోదు చేసి విచారణ చేపడితేనే కదా వీడియో మార్ఫింగ్ చేశారా?, లేదా?? అన్న విషయం తెలిసేదని నిలదీశారు.. నగ్న వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారని తన మిత్రుడు, సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తుంటే, సకల శాఖామంత్రి అది మాధవ్ వీడియోని నిర్ధారించారన్నారు. సకల శాఖామంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ, నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.. , నాలుగు గోడలో లోపల జరిగిన వ్యవహారం, ఇద్దరి మధ్యలోనే ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండి ఉండేది కాదన్నారు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు చూసి, 8 కోట్ల కళ్ళు గాయపడిన తర్వాత, నాలుగు గోడల మధ్యలో జరిగిన వ్యవహారం అంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంకా తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ, ఈ వీడియో వ్యవహారంలో వ్యవహరించిన తీరు ద్వారా మహిళా పక్షవాత ప్రభుత్వంగా మార్చారన్నారు. నగ్న వీడియో వ్యవహారంలో కేసు ఎందుకు నమోదు చేయలేదంటే, ఫిర్యాదుదారు లేరని అంటారని… అటువంటప్పుడు ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు. అంతేకానీ ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని కంటి తుడుపు మాటలు ఎందుకని ప్రశ్నించారు. మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకురాగా, స్పీకర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారేమోనని అన్నారు. అయినా టిడిపి ఎంపీలు, మాధవ్ నగ్న వీడియో పై స్పీకర్ కు ఫిర్యాదు చేయడం బాధగా ఉందన్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమేనని పరగురామకృష్ణంరాజు అపహాస్యం చేశారు.
మహేష్ కు జన్మదిన శుభాకాంక్షలు
సినీ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. సహజంగా ఆడవారిని వయసు అడగకూడదని, కానీ మహేష్ బాబు వయసు ఎంతో ఎవరికీ తెలియదని, ఆయన రోజుకింత చలాకీగా కనిపిస్తున్నారని, అదే ఉత్సాహంతో అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు..
పీవీ సింధుకు అభినందనలు
కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పసిడి పతకాన్ని అందించిన స్టార్ షట్లర్ పీవీ సింధు రఘురామకృష్ణంరాజు అభినందించారు. భవిష్యత్తులో ఇలాగే విజయాలను సొంతం చేసుకుంటూ, ఎన్నో పతకాలను సాధించాలని ఆకాంక్షించారు.