– రెడ్ల పాలన చేయడం తప్పనడం లేదు
– కాకపోతే… ప్రజలకు నిజాలు చెప్పాలి
– వెంకటేశ్వరరావు కి పోస్టింగ్ ఇవ్వాలి
– ప్రజలందరి మనోభావాలను ఆవిష్కరించిన వెంకాయమ్మ
– దళిత ఒంటరి మహిళ పై దాడా?
– తప్పులను సరిచేసుకుంటే మనకే మంచిది…
– నిన్నటి విలన్ ను నేడు తప్పనిసరి హీరో అని చెప్పాల్సిన పరిస్థితి వారిది
– హైడ్రో టర్బైన్ విద్యుత్ ఉత్పత్తి కొత్తేమి కాదు…
– సచివాలయ ఉద్యోగాల్లో ను వందిమాగదులు నింపే ప్రమాదం
– ఉద్యోగులు మేల్కొని ఇప్పటికైనా ప్రశ్నించాలి
– జనం లేక సీఎం సభలు వెల.. వెలా
– ప్రతిపక్ష నేత బాబుకు బ్రహ్మరథం
– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
రాష్ట్రంలో మాట్లాడలేని ప్రజలందరి మనోభావాలను పెద్దగా చదువుకోక పోయిన దళిత, ఒంటరి మహిలైన వెంకాయమ్మ చక్కగా ఆవిష్కరించినదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల వెంకాయమ్మ అభిప్రాయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఏకీభవిస్తారన్నారు.. ప్రజాభిప్రాయాన్ని గమనించి, తమ తప్పులను సరిచేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పటికీ , అలా కాదని ప్రశ్నించిన మహిళపై దాడికి దిగడం హేయమైన చర్య అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై ఇలాగే దాడులు చేసుకుంటూ పోతే … వందలు, వేలు… లక్షలు దాటి వారి సంఖ్య కోట్లకు చేరుకుంటుందన్నారు.
బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… దళిత ఒంటరి మహిళ వెంకాయమ్మ ఇంటి పైకి వెళ్లి నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కలిసి సామూహికంగా చేసిన దాడిని, రాజకీయాలకతీతంగా మహిళా సమాజమంతా ఖండించాలని కోరారు. . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు కూడా ఈ దాడిని ఖండించాలని … లేకపోతే ఈరోజు వెంకాయమ్మ రేపు మీరు అవుతారన్నారు. వెంకాయమ్మ టీడీపీ కార్యకర్త అంటూ సాక్షి దినపత్రిక ప్యాక్ట్ ఫైండింగ్స్ పేరిట కథనం ప్రచురించిందని, అయితే మన పార్టీలో మాదిరిగా కాకుండా, టీడీపీలోని సాధారణ కార్యకర్తగా కూడా ఐడి కార్డు ఉంటుందని అన్నారు. ఐడి కార్డు ఉన్న తప్పులేదని, తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందక పోక, డయాలసిస్ వ్యాధిగ్రస్తురాలైన వెంకాయమ్మ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినట్లుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందడం లేదన్నారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు… రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్నులపై వెంకాయమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని, ప్రజలు చెప్పు తీసుకుని కొడతారని విరుచుకుపడడం హాట్ టాపిక్ గా మారింది.. తన భూ సమస్యలు పరిష్కరించాలని వారం, వారం ప్రభుత్వ అధికారులు నిర్వహించే స్పందన కార్యక్రమం లో ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా ప్రతి స్పందన లేకపోవడం వల్లే వెంకాయమ్మ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తన అసహనాన్ని వెళ్ళగక్కారని రఘురామ కృష్ణంరాజు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కులో భాగంగా, వెంకాయమ్మ చక్కటి భాషలోనే తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే, ఆక్రోశం పట్టకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమెపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు
మల్లమ్మ ఉసురు తగిలి రాజ్యం కూలిపోయిందని, వెంకాయమ్మ ఉసురు మనకు వద్దని జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు హితవు పలికారు.
వెంకటేశ్వరరావు కి పోస్టింగ్ ఇవ్వాలి
హైకోర్టు తీర్పు దిక్కరణ నేరం కింద సీనియర్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు మరోసారి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించక ముందే ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణంరాజు పలికారు. న్యాయస్థానాలు అంటే కొత్తగా వచ్చిన భయం, బుద్ధి వచ్చిన స్ఫూర్తితో గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.. కొత్త ఏడాది ఇదే రోజు తనకు మిలిటరీ ఆసుపత్రిలో పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక అందజేసి సంవత్సరం కావస్తున్నదని, నివేదిక పక్కాగా ఉన్నప్పటికీ, ఈ కేసులో ముందుకు వెళ్లలేక పోవడం పట్ల రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అకారణంగా భౌతిక దాడి చేసిన శిశుపాలులను,. వారి బాస్… సూపర్ బాసును విడిచిపెట్టేది లేదని మరోమారు శపథం చేశారు.. అయితే తాను చట్టం న్యాయం ప్రకారమే ముందుకు వెళ్తానని చెప్పారు. న్యాయం కాసింత ఆలస్యమైనా భగవంతుడు దోషులను శిక్షిస్తాడని రఘు రామ అన్నారు.
గతంలో కంపు …ఇప్పుడు ఎలా ఇంపు అయింది?
గతంలో గ్రీన్ కో కంపెనీ చేపట్టిన హైడ్రో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని, ఈ కంపెనీనే సాకు గా చూపెట్టి, పీపీఏల ను రద్దు చేశారన్నారు.. అయితే గతంలో కంపు గా కనిపించిన ప్రాజెక్ట్, ఇప్పుడు ఇంపుగా ఎలా మారిందో వివరించాలన్నారు.. హైడ్రో రివర్స్ టర్బైన్ విద్యుత్ ఉత్పత్తి విధానం దేశానికి దిక్సూచని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విధానం చాలా పురాతనమైనదేనని చెప్పుకొచ్చారు
ఇద్దరు తెలంగాణవారికి రాజ్యసభనా?
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ కు నామినేట్ చేయాలని నిర్ణయించడం పట్ల రఘు రామ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఎన్నో వివాదాలు ఉన్నాయని… రేపు రాజ్యసభలో వీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి గళమెత్తగలరా? అని ప్రశ్నించారు. రాజ్య సభ స్థానాల ఎంపికలో బీసీలకు పెద్దపీటనే సాక్షి దినపత్రిక కథనంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. నాలుగింటిలో రెండు రాజ్యసభ స్థానాలను రెడ్లకు ఇచ్చారని, మరి రెడ్లకు పెద్దపీట ని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ, లోక్ సభ, పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఇలా అన్నీ రెడ్ల చేతుల్లోనే ఉన్నాయని.. రెడ్లు పాలన చేస్తూ, ఎస్సీ బీసీ ల ప్రాధాన్యత ఇస్తున్నామని అబద్దాలు చెప్పడం ఎందుకంటూ నిలదీశారు. రెడ్ల పాలనను తానేమీ వ్యతిరేకించడం లేదని… ఉన్నది ఉన్నట్లుగా చెబితే మంచిదని హితవు పలికారు.
వందిమాగదులతో ఉద్యోగాలు భర్తీ
ఆర్థిక శాఖ లోని ఐదు జాయింట్ సెక్రటరీ స్థాయి ఉద్యోగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వందిమాగదులు లతో భర్తీ చేయాలని చూస్తున్నారనీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యనారాయణ రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్ పై వచ్చి పని చేస్తున్నారని, రేపు పదవీకాలం పొడిగింపు లేకపోతే మాతృ సంస్థకు వెళ్ళిపోతారన్నారు. ఇక జాయింట్ సెక్రెటరీ ఉద్యోగాలను కూడా తాము చెప్పిన చోట తెల్ల కాగితాలపై సంతకాలను పెట్టే వారితో భర్తీ చేయాలని చూస్తున్నారని రఘురామా వెల్లడించారు. సాక్షి దిన పత్రికలో పని చేసిన వారిని, సాయి రెడ్డి కంపెనీలో పనిచేసే వారిని జీతాలు చెల్లించలేక ఇప్పటికే సలహాదారులుగా, పిఆర్ వోలుగా నియమించి ప్రభుత్వ సొమ్మును వారికి జీతంగా కట్టబెడుతూ పార్టీకి ప్రచారాన్ని చేయించుకుంటున్నారు. ఆర్థిక శాఖలో మాదిరిగానే రేపు సచివాలయంలోని వివిధ శాఖలలో తన వంది మా గదులను నియమించే అవకాశం లేకపోలేదని, ఈ ప్రమాదాన్ని సచివాలయ సిబ్బంది అడ్డుకోవాలని సూచించారు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను కాదని, తనకి ఇష్టమున్నవారిని ఇష్టమైన చోట ప్రభుత్వ పెద్దలు నియమించే ఈ విధానాన్ని ప్రజలు వ్యతిరేకించాలనీ అన్నారు.
చంటి పిల్లాడు లా కుంటి సాకులు చెప్పడం మానాలి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చంటిపిల్లాడిలా కుంటి సాకులు చెప్పడం ఇకనైనా మానుకోవాలని రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ప్రభుత్వ తప్పులను ఒప్పుకొని, సరి చేసుకుని ముందుకు వెళ్తే మంచిదన్నారు. ప్రజలకు తానేదో చేయబోతుంటే… ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తనకు ఇష్టం లేని మీడియా సంస్థలు అడ్డుకుంటున్నాయని అపవాదు మోపడం సరికాదన్నారు. ప్రజలు అన్ని గ్రహిస్తున్నార ని, అందుకే ముఖ్యమంత్రి సభలో వచ్చిన జనం మధ్యలోనే నిష్క్రమిస్తుంటే పోలీసు వారిని బ్రతిమాలవలసి వస్తుందని, అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారన్నారు.