Suryaa.co.in

Editorial

కమలానికి మున్నూరు కాపులు దూరం?

– బీజేపీకి బడుగులు పనికిరారా?
– పల్లకీమోతకే తప్ప, అధికారం రాత లేదా?
– సంజయ్‌ మార్పుతో సాధించేదేమిటి?
– మున్నూరు కాపుల ఓట్లు అవసరం లేదా?
– ఎన్నికల ముందు వరకూ బడుగులతో పనులా?
– ఎన్నికలప్పుడు అగ్రకులాలకు అందలమా?
– అగ్రకులాలు బీసీల నాయకత్వంలో పనిచేయరా?
– అవసరం కోసం బీసీలు, అసలు సమయంలో అగ్రకులాలు కావాలా?
– జైలుకు వెళ్లివచ్చిన బండికి ఇచ్చే బహుమతి ఇదేనా?
– కేసీఆర్‌ సర్కారుపై చేసిన యుద్ధానికి ప్రతిఫలం ఇదేనా?
– రెడ్లు కాంగ్రెస్‌కు కాకుండా బీజేపీకి ఓటు వేస్తారా?
– కమలానికి ఓటు వేయమంటున్న మున్నూరు కాపు సంఘాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

జీరో స్థాయిలో ఉన్న బీజేపీని హీరో స్థాయికి తీసుకువచ్చిన ఎంపి బండి సంజయ్‌ను హటాత్తుగా మార్చడంపై మున్నూరు కాపులు కన్నెర్ర చేస్తున్నారు. పార్టీ కోసం అనేకసార్లు జైలుకు వెళ్లిన సంజయ్‌ను మార్చి, కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తెలంగాణ మున్నూరు కాపు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికల్లో ఒక్కటి తప్ప, అన్ని సీట్లూ ఓడిపోయిన బీజేపీకి.. తెలంగాణలో తన రెక్కల కష్టంతో మళ్లీ పునరుజ్జీవం తెచ్చి, కేసీఆర్‌ సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన సంజయ్‌ను, అర్ధాంతరంగా తొలగించడంపై మున్నూరు కాపు సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

పార్టీ అవసరం కోసం బీసీలు కావాలి గానీ, అసలైన సమయంలో మాత్రం అగ్రకులాలు కావాలా? అని అటు బీసీ వర్గాలు బీజేపీని ప్రశ్నిస్తున్నాయి. అగ్రకులాలు బీసీల నాయకత్వంలో పనిచేయరా? ఎల్లకాలం బీసీలే అగ్రకులాల పల్లకీ మోయాలా? పార్టీ కోసం లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లిన సంజయ్‌ను బీజేపీ బలిపశువు చేసిందని కన్నెర్ర చేస్తున్నారు. కిషన్‌రెడ్డికి ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? బండి స్థానంలో మరో బీసీ అధ్యక్షుడిగా చేయడానికి పనికిరారా? అని నిలదీస్తున్నారు. బీసీ నేత బండి సంజయ్‌తో పార్టీని విస్తరింపచేసి, అసవరం తీరాక పక్కనపెట్టడంపై బీసీ వర్గాలు మండిపడుతున్నాయి.

తెలంగాణలో ముదిరాజు తర్వాత, ఎక్కువ జనాభా ఉన్న కులం మున్నూరు కాపు. రాజకీయ, ఆర్ధిక, సామాజికరంగాల్లో మున్నూరు కాపులు చురుకుగా పాల్గొంటారు. రాజకీయంగా చైతన్యం ఎక్కువగా ఉండే కులం అది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న మున్నూరు కాపులు, విభజన తర్వాత బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. కాంగ్రెస్‌లోని మున్నూరు కాపు ప్రముఖులైన కేశవరావు, దానం నాగేందర్‌ వంటి హేమాహేమీలంతా బీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణలో మున్నూరు కాపుల్లో 60 శాతం మంది, బీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారన్నది బహిరంగమే.

అయితే మున్నూరు కాపు వర్గానికి చెందిన డాక్టర్‌ లక్ష్మణ్‌ బీజేపీ అధ్యక్షుడిగా చేసినప్పటికీ, మున్నూరు కాపులు బీజేపీ వైపు పెద్దగా మొగ్గుచూపలేదు. కానీ అదే వర్గానికి చెందిన బండి సంజయ్‌ అధ్యక్షుడయిన తర్వాత, మున్నూరు కాపుల్లో మార్పు వచ్చింది. కేసీఆర్‌పై ఒంటరి పోరాటం, మాటల యుద్ధం, బీఆర్‌ఎస్‌ను తొడగొట్టి సవాల్‌ చేసిన వైనం మున్నూరు కాపులు విశేషంగా ఆకట్టుకుంది.

అప్పటివరకూ కరీంననగర్‌ పట్టణానికే తెలిసిన బండి సంజయ్‌, తెలంగాణలోని మున్నూరు కాపులకు హీరోగా నిలిచారు. కేసీఆర్‌ సర్కారు ఆయనను అనేకసార్లు జైలుకు పంపించడంతో, ఆయనపై మరింత సానుభూతి, హీరోవర్షిప్‌ పెరిగింది. తమ కులానికి చెందిన నేత, జాతీయ స్థాయిలో ప్రధాని ప్రశంసలు పొందడం తమ గౌరవం పెంచిందని మున్నూరు కాపులు సంబరపడ్డారు.

రెండోసారి కూడా బండినే అధ్యక్షుడిగా కొనసాగిస్తూ, బీజేపీ తీసుకున్న నిర్ణయం మున్నూరు కాపు వర్గాన్ని మెప్పించింది. అయితే హటాత్తుగా ఆయనను తొలగిస్తూ, ఆయన స్థానంలో కిషన్‌రెడ్డిని నియమించడంతో, మున్నూరు కాపు వర్గం బీజేపీపై భగ్గుమంది.

ఇన్నేళ్లూ సంజయ్‌తో చాకిరీ చేయించుకుని, పార్టీ కోసం జైలుకు వెళ్లిన బండికి పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా అని, మున్నూరు కాపులు మండిపడుతున్నారు. తన పాదయాత్ర, ఉత్సాహభరితమైన ఉద్వేకపూరిత ప్రసంగాలతో.. హిందువులను మేల్కొలిపిన సంజయ్‌ను, అర్ధంతరంగా తొలగించడం అన్యాయమని మున్నూరు కాపు సంఘాలు విరుచుకుపడుతున్నాయి.

ఉమ్మడి-కొత్త రాష్ర్టానికి ఎంతోమంది అధ్యక్షులు వచ్చినప్పటికీ, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీకి ఇన్ని దశాబ్దాలలో 25 సీట్లు కూడా తీసుకురాలేకపోయారు. వారిలో చాలామంది తర్వాత.. కేంద్రమంత్రులు, జాతీయ పార్టీలో ఉన్నత పదవులు పొందారు. కానీ సంజయ్‌ సారథ్యంలో జరిగిన.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ 40కి పైచిలుకు స్థానాలు గెలవడం, బండి పోరాట ఫలితమేనని మున్నూరు కాపులు స్పష్టం చేస్తున్నారు.

ఇప్పుడు కీలకస్థానాల్లో ఉన్న పెద్ద నేతలు, తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని డివిజన్లలో గెలిపించుకోలేపోయారని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా, దుబ్బాక-హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా.. పార్టీని విజయతీరాలకు చేర్చిన సంజయ్‌ను తొలగించడం విశ్వాసఘాతుకమేనంటున్నారు.

కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత, రాష్ట్రంలోని మెజారిటీ రెడ్డి సామాజికవర్గం.. కాంగ్రెస్‌ వైపు చూస్తోందని మున్నూరు కాపు నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ రెడ్డి వర్గానికే చెందిన కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడమంటే.. బీజేపీకి బీసీలు అవసరం లేదన్న సంకేతాలివ్వడమేనని, మున్నూరు కాపు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే రెడ్డివర్గ నేతలంతా కాంగ్రెస్‌లో ఉన్న క్రమంలో.. అదే వర్గానికి చెందిన కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినంత మాత్రాన, రెడ్లంతా బీజేపీకి ఓట్లు వేస్తారనుకోవడం అవివేకమని మున్నూరు కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము అవసరం లేదనుకున్న బీజేపీ..తమకూ అవసరం లేదని నిర్మొహమాటంగా చెబుతున్నారు.

బీజేపీ తీసుకున్న తాజా నిర్ణయంతో, ఆ పార్టీకి దూరంగా ఉండాలని మున్నూరు కాపు సంఘాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సహజంగా మున్నూరు కాపులు వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. మిగిలిన కులాలతో పోలిస్తే, వారిలో ఐక్యత-కులాభిమానం ఎక్కువగా ఉంటుంది. బీజేపీ నాయకత్వం తీసుకున్న నిర్ణయం, వారిని గాయపరించిందని స్పష్టమైన నేపథ్యంలో.. బీజేపీకి దూరంగా ఉండాలన్న కాపుల నిర్ణయం, ఆ పార్టీకి శరాఘాతమేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇది తెలంగాణలో నివసించే ఆంధ్రా కాపులను కూడా, దూరం చేసుకునే నిర్ణయమేనంటున్నారు.

LEAVE A RESPONSE