Suryaa.co.in

Andhra Pradesh

ఇలాంటి ఘటనలు ముందే ఊహించాం

ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కోవాలి
వెంటనే విచారణకు ఆదేశించాలి
– పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇలాంటి ఘటనలు జరుగుతాయని ముందే ఊహించామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. పాలక పార్టీ శ్రేణులు టిడిపి కేంద్ర కార్యాలయంపైన, వివిధ జిల్లాల్లో టిడిపి కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ద ఆందోళనలు, దాడులు నిర్వహించడం శోచనీయమని పేర్కొన్నారు. విజయవాడలో పట్టాభి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం అమానుషమని తులసిరెడ్డి అన్నారు.
విమర్శలు నిర్మాణాత్మకంగా, సద్వివిమర్శలుగా ఉండేలా సంయమనం కోల్పోకుండా విమర్శలు చేయాల్సిన బాధ్యతను ఎవ్వరూ విస్మరించకూడదన్నారు. సద్విమర్శలను కూడా భరించలేని వాతావరణం నెలకొనడం ప్రజాస్వామ్య వ్యవస్థకే హాని చేస్తుందని, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేసే అప్రజాస్వామిక చర్యలకు పాలక పార్టీ శ్రేణులు పాల్పడితే శాంతి భద్రల సమస్యకు వారే ఆజ్యంపోసిన వారౌతారని, డిజిపి ఆఫీసు ప్రక్కనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపైనే దాడి చేస్తే నివారించలేని దుస్థితి దేనికి అద్దం పడుతున్నదో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కోరారు.
అధికారంలో ఉన్నవారు అణిగి మణిగి ఉండాలి కానీ, రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే ప్రయత్నం చేయడం శోచనీయమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు ఇంతగా దిగజారుతున్నా పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని తులసిరెడ్డి ప్రశ్నించారు. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించి దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించవద్దని అన్నారు.

LEAVE A RESPONSE