గ్రీకు , రోమన్ , ఈజిప్టు నాగరికతల పురాణాల్లో ఒక పక్షి గురించి వ్రాయబడివుంది. దాని పేరు ” ఫినీక్స్ అది చాలా వింతశక్తులు కలిగిన అద్భుతమైన పక్షి అని చెబుతారు.
అది సుమారుగా 500 ఏళ్ళు జీవిస్తుందట. దాని కాలి వేళ్లతో నక్క , తోడేలు లాంటి జంతువులను కూడా ఎత్తుకెళ్లదగిన బలం ఆ పక్షిది.
కొన్ని పుస్తకాల్లో ఏనుగును కూడా అని వ్రాయబడింది.
ఆ పక్షికి ఎప్పుడైనా గాయం తగిలితే, అది ఆ గాయమైన చోట కన్నీరు కారుస్తుందట.
ఆ కన్నీరే ఆ గాయాలను నయం చేస్తుందట.
అన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, తన ఆయుష్షు అయిపోతోంది అని తెలుసుకొని ఆ పక్షి తన చితిని తానే తయారు చేసుకొంటుంది. cinnamon , sage అనే చెక్కలను , మూలికలను ఏరుకువచ్చి , నిప్పు రాజేసి ఆ మంటల్లో దూకి మరణిస్తుంది.
కానీ అదే బూడిద లోంచి కొన్ని రోజులకు, మరో ఫినీక్స్ పక్షి పుట్టుకొస్తుందట. అందుకే ఆ పక్షిని Immortal Bird అని అంటారు. [ మరణం లేని పక్షి]
ఆ పక్షి లాంటిదే మన భారతదేశం కూడా. లక్షల సంవత్సరాల ఈ జాతి ప్రయాణంలో ఎంతోమంది విదేశీరాజులు , మతోన్మాదులు , మోసగాళ్లైన వ్యాపారులు తన మీదకు దాడి చేసినా ప్రతి సారీ ఫినీక్స్ పక్షి లాగా మళ్ళీ మళ్ళీ పుట్టుకొచ్చింది.
ఈ దేశాన్ని చివరిసారిగా పాలించిన ఆంగ్లేయులు 3.5 కోట్లమంది మన భారతీయులను చంపారు , కోట్లమంది మన వాళ్లను ఆకలితో చంపడానికి 12 కృత్రిమమైన కరువులు సృష్టించారు , మన దేశం నుండి 45 ట్రిలియన్ డాలర్లను [ 1 ట్రిలియన్ అంటే 1 లక్ష కోట్ల రూపాయలు] ఎత్తుకెళ్లారు .
మన న్యాయవ్యవస్థను , వ్యవసాయాన్ని,వ్యాపారాన్ని , విద్య, ఆరోగ్య వ్యవస్థలను నాశనం చేసారు ,
హిందువులు – ముస్లిముల మధ్య బేధాలు పెంచి మన మాతృభూమిని రెండు ముక్కలు చేసారు , సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తూవుండిన మనలను 1947 నాటికి కేవలం 32 ఏళ్ల ఆయుర్ధాయం [ life span] కలిగిన మనుషులున్న దేశంగా చేసిపోయారు.
అయినా ఈ దేశం లేచి నిలబడింది సుధృఢంగా , సమున్నతంగా , సగర్వంగా ! ఈరోజు ప్రపంచపు అతి పెద్ద ఆరు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఆవిర్భవించింది. మనల్ని పీల్చి పిప్పి చేసిన ఇంగ్లాండును రాబోయే రోజుల్లో దాటి ముందుకుపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు.
నా దేశం ఒక ఫినీక్స్ పక్షి.
– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం మరియు
EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు