– 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ మూడేళ్లకు కోసారైనా మామోగ్రాం టెస్ట్ చేయించుకోవాలి
– తొలి దశలో గుర్తించి ట్రీట్మెంట్ చేయిస్తే 90 శాతం క్యాన్సర్ మరణాలను అరికట్టవచ్చు
– వైద్య సిబ్బందితో పాటు నాయకులు, పాత్రికేయులు సామాజిక బాధ్యతగా క్యాన్సర్ స్క్రీనింగ్స్ పై అవగాహన కల్పించండి
– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు: క్యాన్సర్ అనగానే అదేదో చికిత్స లేని జబ్బు అన్న భయాందోళనలు వీడాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోరారు. ప్రస్తుతం వున్న అధునాతన వైద్య విధానాల ద్వారా తొలి దశలో గుర్తించ గలిగితే క్యాన్సర్ వ్యాధికి చికిత్స వుందన్నారు.
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేసే పింక్ బస్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు వ్యాధి ముదిరిన తరవాతే డాక్టర్లను సంప్రదిస్తున్నారని క్యాన్సర్ అని నిర్ధారించి మెరుగైన చికిత్స అందించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అవగాహన లేక పోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోందన్నారు. తొలి దశలోనే చికిత్స చేయడం ద్వారా 90 శాతం క్యాన్సర్ మరణాలను అరికట్టవచ్చన్నారు. 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ మూడేళ్లకు ఒక సారైనా మామోగ్రాం పరీక్ష చేయించుకోవాలని కోరారు.
క్యాన్సర్ రహిత కోవూరుగా మార్చాలనే సంకల్పంతో సెప్టెంబర్ 10 న ఇందుకూరు పేట మండల కేంద్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు ప్రారంభించామన్నారు. 600 మంది పరీక్షలు చేయించుకోగా 97 మందిని అనుమానితులుగా గుర్తించి తదుపరి వైద్య సేవలకై తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ కు తరలించామన్నారు. కొడవలూరు మండలంలో 1017 మంది క్యాన్సర్ స్క్రీనింగ్స్ చేయించుకోగా 150 పాజిటివ్ కేసులు వచ్చాయని కోవూరు మండలంలో 1200 మందికి గాను 127 మంది క్యాన్సర్ అనుమానితులుగా తేలారన్నారు. వీరిలో చాలా మంది తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ లోను మరి కొందరు స్థానికంగా వైద్య సేవలు చేయించు కుంటున్నారన్నారన్నారు. అవసరమైతే టిటిడి ఆధ్వర్యంలోని ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచితంగా సర్జరీ కూడా చేయించు కోవచ్చాన్నారు.
ఈ కార్యక్రమంలో బుచ్చి సి హెచ్ సి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ మనోజ్ కుమార్, డాక్టర్ పద్మజ, మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, మున్సిపల్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ శ్రీహరి, స్థానిక కొన్సిలర్లు ప్రత్యూష, నస్రీన్ ఖాన్, బుచ్చిరెడ్డి పాళెం టిడిపి అర్బన్ మరియు రూరల్ మండల అధ్యక్షులు ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ, టిడిపి నాయకులు ఏటూరి శివ రామ కృష్ణా రెడ్డి, నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, హరనాధ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.