నీ గూడెక్కడో నీకు తెలియదు
నీవెందుకు బ్రతుకుతున్నావో ఊహకందదు
నీవు తినే గడ్డి ఎవరిచ్చారో నీకేనాటికీ అర్ధం కాదు
నా అవినీతిని వెర్రి గొర్రెలు ప్రశ్నించవు
వాటికి అంత జ్ఞానం లేదు కదా?
నేను దోచుకున్నా దోచుకుంటూనే ఉంటా
అది దోపిడి అని వాటికి తెలిస్తే కదా?
నేను మీ కాపరిని అంటే వాటికి ఎంత ఆనందం
మీ తోలు తీసి అమ్ముతున్నా తెలియని మైకం
మీ తర తరాలు నాకు చేయక తప్పదు ఊడిగం
కులమని మతమని దేవుడని ప్రభువని
మీలో మీరు కొట్టుకోండి
నాకు కావలసింది ధనమే
అందుకు తల్లి లేదు చెల్లి లేదు చిన్నాన్న కూడా లేడు
నా లక్ష్యం సుస్పష్టం
నేనున్నంతకాలం రాచరికం
అడ్డొస్తే సర్వం నాకు విరోధం
నా కోర్కెలు తీరాలంటే
మూర్ఖులైన మీరే నాకు సహాయం
నేను చేసిన హత్యలు మీకొరకేనంటే
తల ఊపే మీ ఉబలాటం మీ భావి మరణశాసనం
నేను మానసిక రోగినైనా
మీ మూర్ఖత్వం తో జన నేతనైనాను
నాకు ఏదీ చేతకాకున్నా
మీ చప్పట్లతో కార్యశూరుడైనాను
క్రింది గడ్డి తినడమే తప్ప
తలెత్తి చూడలేని మీకన్నా నాకు ముఖ్యులెవరు?
నేను చేసే అప్పుల్లో మీకిచ్చేది రేణువంతైనా
మీ జన్మ ధన్యమనుకునే
మీకంటే ఆప్తులెవరు నాకు
మీ ఉన్మాదం సాక్షిగా నేనిచ్చే సందేశం ఇదే
మీరు తలొంచుకు గడ్డి మేయండి
మీ పేరుతో నా విషాన్ని నేను వెళ్ళగ్రక్కుతాను
పెత్తందార్ల పేరు చెప్పి నేను పెత్తనం చేస్తా
అసలు పెత్తందారుడ్ని నేనే
మీకు ఆలోచించే సమయం ఇవ్వను
మీ బ్రతుకంతా నా గుప్పెటపడతా
నా వెనుక గొర్రెలున్నంత కాలం
నేను ప్రభువు ప్రవచించిన కాపరినే
ఆ ప్రభువు చెప్పినవి మీకు తెలియదు
మధ్యలో నేను మార్చి చెప్పాను కదా?
– ఆళ్ల హరి