Suryaa.co.in

Telangana

నా ఫోన్ మాయం పోలీసుల పనే

-మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది నాతో మాట్లాడారు
-ఆ విషయం తెలిసి కేసీఆర్ మూర్చపోయినట్లున్నారు
-నా ఫోన్ బయటకొస్తే చాలా విషయాలు తెలుస్తాయని తన వద్దే పెట్టుకున్నట్లున్నారు
-లీగల్ సెల్ నేతలతో భేటీలో బండి సంజయ్ వ్యాఖ్యలు

బీజేపీ లీగల్ విభాగం నేతలతో బండి సంజయ్ సమావేశమై బీజేపీ చేస్తున్న పోరాటాలపై కేసీఆర్ ప్రభుత్వ నిర్బంధం, కార్యకర్తలపై అక్రమంగా పెడుతున్న కేసుల అంశంపై చర్చించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలపై మరింత నిర్బంధాలు పెరగడంతోపాటు పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. ఈ తరుణంలో బీజేపీ లీగల్ పార్టీ కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కోరారు. ‘‘మీరున్నారనే ధైర్యం… కాపాడతారనే విశ్వాసంతోనే కార్యకర్తలంతా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతున్నరు. మీరు మాకు అండగా ఉండండి. అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా స్పందించండి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తల పక్షాన నిలబడండి.’’ అని కోరారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్ తీరును, పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా తిడతారు. ఆయన దిష్టిబొమ్మలను తగలబెడతారు. వ్యతిరేకంగా పోస్టర్లు అంటిస్తారు. కేసీఆర్ ను తిడితే మాత్రం నాన్ బెయిలెబుల్ కేసు పెడతారు. సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడతారు. పాత కేసులను తిరగదోడి జైలుకు పంపుతున్నారు. అట్లా చేసి కేసీఆర్ మెప్పు పొంది ప్రమోషన్లు పొందేందుకు కొందరు పోలీసులు ఎంతకైనా దిగజారుతున్నారు’’అని అన్నారు. తన ఫోన్ మాయమైన అంశంపైనా బండి సంజయ్ మాట్లాడారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు నాకు చాలా మంది ఫోన్లు చేశారు. ఆ విషయం తెలిసి కేసీఆర్ మూర్చపోయారు. నా ఫోన్ బయటకు వస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయనే భయంతోనే కేసీఆర్ తన దగ్గరే పెట్టుకున్నట్లున్నారు. ఇతరుల ఫోన్ల సంభాషణ వినడమే ఆయన పని’’అని అన్నారు.

వాస్తవానికి కరీంనగర్ లో పోలీసులు తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుండి సిద్దిపేట వెళ్లే వరకు నా చేతిలోనే ఉన్న ఫోన్ ఆ తరువాత పోలీసులే మాయం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దాచి పెట్టి తనను ఫోన్ అడగడం సిగ్గు చేటన్నారు. బీజేపీ కార్యకర్తలు దేనికీ భయపడరని, దేశం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటారని స్పష్టం చేశారు. ‘‘పేపర్ లీకేజీ విషయంలో కేసీఆర్ కొడుకు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా విషయంలో కేసీఆర్ కుటుంబానికో న్యాయం? ఇతరులకో న్యాయమా?’’అని ప్రశ్నించారు.

LEAVE A RESPONSE