మరి ఖైదీలా లేదే..
గ్యాంగ్ లీడర్ స్థాయి ఎక్కడ..
గూండా..దొంగ..
రౌడీ అల్లుడు..
పోనీ..
మినిమం ముఠామేస్త్రీ
రిక్షావోడు…
తక్కువలో తక్కువగా
బిగ్ బాస్
ఎంత లాస్..
ఎక్కడి మెగాస్టార్ ఎక్కడికి?
ఇంతకీ ఈ సినిమాకి
కొరటాల డైరక్టరా..!?
ఆ మిర్చి ఎక్కడ…!
శ్రీమంతుడులోని
సందేశం ఏదీ..?
జనతాగ్యారేజ్ లో
కనిపించిన టెంపో మిస్సింగ్!
అసలెక్కడ..
కొరటాల అనే నేను!!??
ఒక మెగాస్టార్..
ఇంకో మెగా పవర్ స్టార్..
కోట్లాది రూపాయల వ్యయం..
పరాజయమే ఎరుగని దర్శకుడు..
మరి ఈ ప్లస్సులన్నీ ఏమైనట్టు..!?
ఆచార్య
మామూలు ప్రేక్షకులు సరే..చిరంజీవి అభిమానులను సైతం విపరీతంగా నిరాశపరిచిన
సినిమా..చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే సాదా సీదాగా సాగిపోయిన
ఓ యావరేజ్ బొమ్మ..
తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి నటించిన సినిమా అయినా ఆచార్యను
మల్టీస్టారర్ అనడానికి లేదు..
ఎందుకంటే ఆ ఇద్దరు మినహా పెద్దగా నటీనటవర్గం కనిపించలేదు.సినిమాకి ఆ ఇద్దరూ చాలనుకున్నాడో ఏమో..కొరటాల.. ఇంక దేని మీదా దృష్టి పెట్టలేదు..సరైన కథ..తన మార్కు సందేశం..
ఇతర నటులు..సన్నివేశాల్లో బిగి..ఇత్యాది అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వలేదు దర్శకుడు.. ఇద్దరు స్టార్స్ తో సినిమాలు తీసినప్పుడు..ఇద్దరి హీరోయిజాన్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని ముందుకు నడపడం ఎంతటి దర్శకుడికైనా కత్తి మీద సామే..నిజానికి ఈ సినిమాకి ఆ సమస్య లేదు..ఇది చిరంజీవి సినిమా..ఇందులో చరణ్ అతిధి మాత్రమే..పైగా ఆ ఇద్దరూ ఒకే స్థాయి హీరోలు కాదు..అంతకు మించి తండ్రీకొడుకులు.. వారి మధ్య ఇగోల గోల కూడా ఉండదు.ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఒకటే బ్యాచ్..ఇన్ని సానుకూల అంశాలున్నా గాని కొరటాల ఎందుకోఆ విషయంలో నెర్వస్ ఫీలైపోయాడు.ఈ అంశంపై ఎక్కువగా దృష్టి పెట్టేసి కొరటాల తన సహజసిద్ధమైన ఉనికిని కోల్పోయాడు…చిరంజీవి ఇమేజ్ మాయలో చిక్కుకుని
తన సొంత ఆలోచనలకు పదును పెట్టడంలో విఫలమై పోయాడు శివ..శివా..!
కథ అన్నదే బలంగా లేని ఈ సినిమాలో కథని నడిపించడం అనే కాన్సెప్టే లేదు.చిరంజీవి..చరణ్..
ఆ ఇద్దరినీ ఎలా ముందుకు తీసుకువెళ్లడం అనే అంశంపైనే దర్శకుడి దృష్టంతా..! దాని వల్ల మిగిలిన సినిమా కుంటుపడిపోయింది.
ఇక చిరంజీవి.. ఇప్పటికే తాను సాధించుకున్న అనన్యసామాన్యమైన ఇమేజ్..తన స్టామినా సినిమాని ముందుకు తీసుకు పోతాయన్న భరోసా కొరవడినట్టు మరింత ఇమేజ్ కోసం తాపత్రయపడ్డాడు.పైగా పుత్రవాత్సల్యం ఆయనని మరో వైపు లాక్కెళ్లిపోయింది.తన పాత్ర కంటే కొడుకు ఇమేజ్ పెంచే తాపత్రయం ఆయనలో కనిపించింది.
నిజానికి..ఇలా తండ్రీకొడుకులు కలిసి చేసిన సినిమాలు తెలుగులోనే కాదు..ఎందుకో మరి
ఏ భాషలోనూ పెద్దగా సక్సెస్ కాలేదు.ఎన్టీఆర్..బాలకృష్ణ కలిసి నటించిన రౌడీ రాముడు..కొంటె కృష్ణుడు..అట్టర్ ప్లాప్..
దానవీరశూరకర్ణ..బ్రహ్మర్షి విశ్వామిత్ర..వంటి సినిమాల్లో కూడా ఎన్టీఆర్..బాలయ్య కలిసి కనిపించినా అవి పురాణ కథలు గనక మల్టీస్టారర్ లెక్కలోకి రావు..
కృష్ణ..మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే అప్పటికి ఇంకా మహేష్ చిన్నవాడు గనక వాటిని మల్టీస్టారర్ అనడానికే లేదు..
ఇక మామ.. మేనల్లుడూ వెంకీ..చైతూ నటించిన వెంకీ మామ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
అంతటి అమితాబ్..
అభిషేక్ కలిసి నటించిన సినిమాలు సైతం పెద్దాయన ఒక్కడే నటించిన సినిమాల స్థాయి హిట్లుగా జమలోకి రావు..
కొంతలో కొంత నాగేశ్వర రావు..నాగార్జున కాంబినేషన్ మెరుగే..కలెక్టర్ గారి అబ్బాయి వంటి మోస్తరు హిట్ ఇవ్వగలిగింది.అయితే గతంలో అక్కినేని ఎన్టీఆర్ తో..కృష్ణతో..శోభన్ బాబు..బాలకృష్ణ..చిరంజీవితో కలిసి చేసిన హిట్లతో పోలిస్తే అదీ తక్కువే..!
చక్రబంధంలో చిరు..
ఇప్పుడు చిరంజీవి పరిస్థితిపై ఒక లుక్కేద్దాం..
రాజకీయాల్లోకి వెళ్తూ సినిమాలకి గుడ్ బై చెప్పిన చిరంజీవి రాజకీయాల్లో విఫలమైన తర్వాత తన ఇమేజ్ ను కాపాడుకోడానికి మళ్లీ వెండితెరనే వేదికగా ఎన్నుకున్నాడు.ఇక్కడ ఎన్టీఆర్ ప్రసక్తి..ఆయనతో కంపారిజన్ తేకుండా ఉండలేం.రామారావు రాజకీయాల్లో చారిత్రక రీతిలో సక్సెస్ అయి కొంత విరామం తర్వాత సినిమాల్లో నటించినా మళ్లీ ఇదే రంగంలో ఉండిపోడానికి రాలేదు.. మోహన్ బాబు అడిగాడు గనక మేజర్ చంద్రకాంత్ చేశారు.అది కూడా అప్పటికి తన వయసుకు తగిన.. హుందాతనానికి తగ్గని పాత్ర..ఇక ఎప్పటి నుంచో తన మనసులో కలగా మిగిలిపోయిన కొన్ని సినిమాలను తీసేసారు.అలాగే కొన్ని ఇష్టమైన పాత్రలను మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఒక పాటలో..వీరబ్రహ్మేంద్ర సినిమాలో పోషించి తన తృష్ణను చల్లార్చేసుకుని మళ్లీ ఫుల్ టైం రాజకీయ నాయకుడు పాత్రలోకి ప్రవేశించి 1994 మరోసారి రాజకీయాల్లో కూడా విజయఢంకా మోగించారు.
చిరంజీవి పరిస్థితి అలా లేదు.కష్టమైన రాజకీయాల్లో వైఫల్యం ఒక పక్క..సెకెండ్ ఇన్నింగ్స్ లో ఇష్టమైన సినిమా రంగంలో కూడా కుదురుకోడంలో ఇబ్బంది పడుతున్నారు.పెరిగిన వయసు చాయలు మొహంలోనూ..
కదలికల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి.వాటిని ఈ దశలో కప్పి పుచ్చుకోవడం కష్టమే కాని తనకి ఇప్పుడు సరిపడే పాత్రలు ఎన్నుకోక తప్పని పరిస్థితి..చిరంజీవి వంటి స్థితప్రజ్ఞుడికి అది తెలియని సంగతి కాదు.
కాని ఒక రకమైన ఒత్తిడి.
గత వైభవం..ఫాన్స్..ఈ రెండూ కీలక అంశాలు.ఈ ఒత్తిడిని మెగాస్టార్ అధిగమించగలిగితే ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి.
ఇక స్టెప్పుల విషయానికి వస్తే చిరు నిష్క్రమణ..
రీ ఎంట్రీకి మధ్యలో కుర్ర హీరోలు స్టెప్పుల వరసని మార్చారు.ఆ హీరోల్లో స్వయానా ఆయన కొడుకు..మేనల్లుడు కూడా ఉన్నారు.అయితే తన లాంచింగ్ లోనే చరణ్ చెప్పినట్టు మేం ఎన్ని గంతులేసినా ఆయన వచ్చి బంగారు కోడి పెట్ట లెవెల్లో మెడ..భుజాలు అలా స్టైల్ గా ఊపితే చాలన్నట్టు…మెగాస్టార్ రిథమ్ స్పెషల్…అది అలాగే కనిపించింది అచార్యలో..
కాని ఎక్కువగా ఇంప్రెస్ చెయ్యాలని తాపత్రయ పడితే ఇజం దెబ్బతింటుందన్నది నిజం..!
మొత్తంగా..మరోసారి ఆచార్య విషయానికి వస్తే కథలో బలం లేని వ్యధ..కొరటాల ఇమేజ్ సమిధ..
గత వైభవం కోసం చిరు బాధ ఇతర భాషల నటులు పెరిగిపోయి డబ్బింగ్ వాయిస్ లు అన్నీ ఒకేలా వినిపించే బెడద.
ఈ మధ్య వచ్చిన ఆర్ ఆర్ ఆర్, కెజీఎఫ్ సినిమాల్లో మాదిరి వందల కొద్ది ఎక్స్ట్రా జనం మధ్య సరైన నటులు..పాత్రలు కనిపించని ఓ కొత్త రకం వరద..
మెగాస్టార్లు ఉంటే చాలు కామెడీ…కమెడియన్ల అవసరం లేదనుకున్నంత దురద..!
వెరసి ఆచార్య అభిమానులకు తట్టుకోలేనంత ఆశ్చర్య..
ఇక ముఖ్యాంశాలు మరోసారి!
చిరంజీవి ఇక చరణ్ జీవి
మెగా కెరటాల్లో కొరటాల
కథ అనే మాతృదేవోభవ
స్క్రీన్ ప్లే అనే
పితృదేవోభవ
బలంగా లేకపోవడంతో
చిరంజీవి అంతటి
ఆచార్యదేవోభవ
ఉన్నా..
ప్రేక్షకులనే
అతిధిదేవోభవ
కి రుచించని..
సగటు ప్రేక్షకుడికి
మింగుడుపడని
భరనభభరవ!!??
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286