-దేశ రక్షణ చేసే నేవీ ఉద్యోగులను స్వర్ణలత మోసం చేసింది
-ఆమెపై కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు, ఆమెను పదవీచ్యుతురాలిని చేయాలి
-జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది
-సజ్జల ద్వారా ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు
-నాయకుల ఒత్తిడి మేరకు స్వర్ణలతను మళ్లీ విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు.
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా
జగన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
పోలీసు వ్యవస్థలోని కొంతమంది నీచానికి ఒడిగడుతున్నారు. విశాఖలో రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీసు వ్యవస్థ తల దించుకునేలా వుంది. స్వర్ణలత రాష్ట్ర పోలీసు సంఘంలో ఉపాధ్యక్షురాలిగా వుండటం సిగ్గుచేటు. నాడు పోలీసంటే నాలుగో సింహం అన్న స్వర్ణలత బండారం నేడు బయటపడింది. విశాఖ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత వ్యవహారం పోలీస్ కమీషనర్ రంగంలోకి దిగేంతవరకు తెలియలేదు.
నేవీ ఉద్యోగుల రిటైర్డ్ కాగా వచ్చిన డబ్బులకు ఎరవేసి.. స్వర్ణలత మనుషులు నేవీ ఉద్యోగులను ట్రాప్ చేశారు. 90 లక్షలిస్తే కోటి రూపాయలిస్తామని వారిని మోసం చేశారు. విషయం తెలిసి పోలీసు కమిషనర్ రంగంలోకి దిగి న్యాయ విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది. స్వర్ణలతతోపాటు మరో ముగ్గురికి సంబంధం ఉన్నట్లు తేల్చారు. వారిని అరెస్టు చేయాలనే ప్రయత్నంలో ఉండగా జిల్లా నాయకులు మొదలుకొని రాష్ట్ర నాయకుల వరకు ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.
వారిచేతకాక ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల ద్వారా ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఇలాంటి పనులు చేయడం వైసీపీకి సిగ్గనిపించడంలేదా? నేరాలను అదుపు చేయాల్సిన పోలీసు వ్యవస్థలో ఉన్న కొంతమంది నేరాలు చేసేవారిని కఠినంగా శిక్షించాల్సిందిపోయి వారే నేరస్థులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలు నేరస్థులకు మెండుగా ఉంటున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన వ్యక్తులే చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.
కంచే చేను మేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది. వైసీపీ నాయకులు ఎవరి ఇష్టప్రకారం వారు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలంటే ఏమాత్రం భయంలేదు. 2024లో ప్రజలు ముఖ్యమంత్రి కుర్చీ పీకనున్నారు. ప్రజల పవర్ అప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర రాజధాని విశాఖ పట్నం అని చెప్పినప్పటి నుంచి విశాఖలో ప్రతి రోజు అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
ఏదో ఒక అలజడి రేగుతోంది. పోలీసు దాడులు, రాజకీయ కబ్జాలు అనేకం జరుగుతున్నాయి. స్వయంగా విశాఖకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ భూకబ్జాలు చేస్తున్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ప్రశాంతంగా ఉన్న విశాఖను కలుషితం చేసింది. ఏ-1గా ఉండాల్సిన స్వర్ణలత అనే ముద్దాయిని ఏ-4లో పెట్టారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో ప్రజలకు తెలియాలి. స్వర్ణలతపై గతంలో అనేక ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు స్వర్ణలతను మళ్లీ విశాఖలో పోస్టింగ్ ఇచ్చారు.
స్వర్ణలత ఆగడాలకు అడ్డూ, అదుపు లేదు. దేశ రక్షణ చేసే నేవీ ఉద్యోగులను స్వర్ణలత మోసం చేసింది. ఆమెపై కేవలం కేసు నమోదు చేస్తే సరిపోదు, ఆమెను పదవీచ్యుతురాలిని చేయాలి. ఆమెను పదవి నుంచి తొలగించాల్సిందిగా టీడీపీ డిమాండ్ చేస్తోంది. పోలీసు వ్యవస్థలో మార్పు రావాలి, పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలి. నేడు తాడిపత్రిలో ఒక సర్కిల్ ఇన్స్ పెక్టర్ వైసీపీ నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
నాయకుల మాట వినకుంటే పై అధికారులతో ఎక్కడికి ట్రాన్స్ ఫర్ చేస్తారో అని పోలీసుల్లో భయం నెలకొంది. ప్రతిపక్ష నాయకులను భయపెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఇక మనుగడ సాగించడం కష్టం. రిజర్వ్ ఇన్స్ పెక్టర్ స్వర్ణలత సినిమా తీసే స్థాయికి చేరిందంటే అర్థం చేసుకోవచ్చు. ఒక పోలీసు ఇన్స్ పెక్టర్ ఒక డ్యాన్స్ మాస్టర్ ని పెట్టుకొని డ్యాన్స్ నేర్చుకొని ఆ డ్యాన్స్ ను, సోషల్ మీడియాలో పెట్టడం సిగ్గుమాలిన చర్య. ఈమె ధైర్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. డీజీపీ ఈమె పట్ల చర్యలు తీసుకోవాల్సిందిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు.