Suryaa.co.in

Editorial

నాయుడుగారొచ్చారు!

– చంద్రబాబుకు ఢిల్లీలో రెడ్‌కార్పెట్
– మోదీ పక్కనే బాబుకు సీటు
– బాబును కలిసేందుకు పోటీ పడ్డ బీజేపీ ప్రముఖులు
– మేళతాళాలతో ఘన స్వాగతం
– స్పీకర్ సహా మంత్రిపదవులిచ్చే అవకాశం
– మళ్లీ ఢిల్లీలో చక్రం తిప్పనున్న చంద్రబాబునాయుడు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. అన్నీ తెలిసిన వాడు అణకువగానే ఉండి అనుకున్న కార్యం సాధిస్తాడు. ఇది చరిత్ర రుజువు చేసిన నీతి. రాజకీయాల్లోనూ అంతే. అలా ఒకడుగు ముందుకు వేయబట్టే అటు మోదీ, ఇటు రాహుల్ ఈ ఎన్నికల్లో మెరిశారు. కానీ అంతకంటే ముందు ఒక నాయకుడు.. ఒక నాయుడు ఆ పనిచేసి, దర్జాగా ఢిల్లీలో కాలుబెట్టారు. ఆ నాయకుడే మన నాయుడు!

కాలగమనంలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లవుతుంటాయి. ప్రధానంగా రాజకీయాల్లో ఇవి ఇంకా విచిత్రంగా ఉంటాయి. మొన్నటివరకూ కత్తులు దూసుకున్నవారే, హటాత్తుగా ఒకే ఒరలో ఒదిగిపోతారు. భుజం భుజం రాసుకున్న మిత్రులే శత్రువులయిపోతారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు-శాశ్వత శత్రువులు ఉండరన్నది చరిత్ర చెప్పిన సత్యం. అది ఇప్పటివరకూ అమలవుతున్న రాజకీయ సూత్రమే. సరిగ్గా ఇప్పుడూ అదే జరిగింది. గత ఎన్నికల ముందు వరకూ, ఎన్డీయేలో చేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు.

కానీ కమల దళానికి దత్తపుత్రుడు జగన్‌పై మమకారం. టీడీపీతో వ్యవహారం కష్టం. అదే దత్తపుత్రుడైతే కేసుల భయంతో కిమ్మనకుండా పడి ఉంటారు. అదీ అసలు రహస్యం. పైగా ఏపీలో సైకిల్ ఎక్కేందుకు ఇచ్చగించని కమలబృందం మోకాలడ్డు మరొకటి. అలాంటి పరిస్థితిలో బాబు జైలుకు వెళ్లిన పరిస్థితి. అయితేనేం.. పవన్ రాయబారం వల్ల మళ్లీ అంతా కలిశారు. నిలిచారు. గెలిచారు.

కొద్దినెలల క్రితం వరకూ ఏ ‘నాయుడి’కయితే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదో.. అదే నాయకుడిని ఇప్పుడు మోదీ, పక్కన కూర్చోబెట్టి గౌరవించారు. ఆయనకు బ్రహ్మరథం పట్టిన వైచిత్రి. ‘నెంబర్‌గేమ్ కాలంలో’ అవసరార్ధ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి. దానికి కారణం మోదీకి చంద్రబాబుపై ప్రేమ కాదు. టీడీపీకి వచ్చిన 16 మంది ఎంపీల సంఖ్యాబలం. ఆ విషయం ‘‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’’ చంద్రబాబుకూ తెలుసు. మీకు అర్ధమవుతోందా?

ఢిల్లీలో ‘కొత్తగా ఒక పాత దృశ్యం’ ఆవిష్కృతమయింది. ఐదేళ్ల వరకూ ఢిల్లీలో కనిపించని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హటాత్తుగా మెరిశారు. ఎంతలా అంటే.. నాయుడి శకం మళ్లీ మొదలయిందన్నంతగా! బాబు మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారనేంతగా!! ఎన్డీయే సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఢిల్లీలో రెడ్‌కార్పెట్ వేశారు. ఆయన బస చేసిన చోట మేళతాళాలు వినిపించాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ప్రధాని మోదీ ఆయనను తన పక్కనే కూర్చోబెట్టుకుని గౌరవించిన అపురూప దృశ్యం ఆవిష్కృతమయింది.

ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భేటీకి జనసేనాధిపతి పవన్‌తో కలసి హాజరయిన చంద్రబాబు అవసరం, బీజేపీకి అనివార్యమయింది. నెంబర్‌గేమ్‌లో వెనుకబడిన బీజేపీకి చంద్రబాబు-నితీష్ తోడు అవసరమయింది. ఇద్దరూ ఎన్నికల్లో ఎన్టీయే భాగస్వాములే కాబట్టి ఆ భేటీకి వెళ్లారు. అయితే.. ఆ ఇద్దరినీ తమ వైపు మళ్లించుకోవాలని ‘ఇండి కూటమి’ ప్రయత్నాలు తీవ్రతరం చేసింది.

శరద్‌పవార్-డికె శివకుమార్ వంటి ట్రబుల్ షూటర్లను, రాయబారానికి రంగంలోకి దింపింది. ఈలోగా కాగల కార్యాన్ని చంద్రబాబునాయుడు అమరావతిలోనే కానిచ్చేశారు. ఢిల్లీకి వెళ్లే ముందు.. తాను ఎన్డీయేలోనే ఉన్నానని, ఉంటానని స్పష్టం చేసి, పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

ఆ ప్రకారంగా ఢిల్లీకి వెళ్లిన బాబుకు బీజేపీ నాయకత్వం పెద్దపీట వేసింది. ఎన్డీయే అగ్రనేతలు, కేంద్రమంత్రుల సమక్షంలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య భేటీలో ప్రధాని మోదీ టీడీపీ అధినేత నాయుడుని తన పక్కనే కూర్చోబెట్టి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా, మరోవైపు చంద్రబాబును కూర్చోబెట్టుకోవడం ద్వారా, బాబు రాజకీయ ప్రాధాన్యం ఏమిటన్నది స్పష్టం చేశారు.

ఆ తర్వాత మోదీ కూడా బాబుతో ఏకాంతంగా చర్చించారు. కేంద్రమంత్రులు ఆయనతో మాట్లాడేందుకు పోటీపడ్డారు. ఒకప్పుడు అపాయింట్‌మెంటే ఇవ్వని మోదీ.. ఇప్పుడు పిలిచి పెద్దపీట వేయడం ప్రస్తావనార్హం. ఈ భేటీ త ర్వాత చంద్రబాబు ఎన్డీయేకు మద్దతు ప్రకటిస్తూ, రాష్ట్రపతికి లేఖ ఇచ్చారు.
ఇదిలాఉండగా కొత్తగా కొలువుదీరే కేంద్రప్రభుత్వంలో..టీడీపీ లోక్‌సభ స్పీకర్‌తోపాటు, రెండు నుంచి నాలుగు కేంద్రమంత్రి పదవులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు టీడీపీ డిమాండ్లను ఆమోదించడం బీజేపీకి అనివార్యం. అందుకే కీలకమైన స్పీకర్ పదవి తీసుకునేందుకే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఏపీ అభివృద్ధికి పనికివచ్చే మరో నాలుగు కీలక శాఖలు కూడా తీసుకోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A RESPONSE