అన్న క్యాంటీన్ విధ్వంసంతో ప్రభుత్వ నిజస్వరూపం తెలిసిందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజమెత్తారు.
పేదలకు ఆహారం పెట్టకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తెనాలి పురవేదిక వద్దకు నిత్యం వేలమంది వస్తారని.. వారికి మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది లేకుండా అన్న క్యాంటీన్ పెట్టామన్నారు. కుప్పం, మంగళగిరిలోనూ ఇలాగే ఆపాలని చూశారని.. తెనాలిలో కొన్ని రోజులుగా మమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్‌కు పోటీగా అన్నదానం చేపట్టారని.. జగన్, సజ్జల డైరెక్షన్‌లో పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. క్యాంటీన్ తొలగింపును అడ్డుకున్న మా కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. తెనాలి సీఐ చంద్రశేఖర్ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.
ఘర్షణలో తెదేపా కార్యకర్తలకు గాయాలు
తెనాలిలో అన్న క్యాంటీన్ వద్ద ఘర్షణలో తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు తోసేయడంతో కొందరు కార్యకర్తలకు గాయాలు కాగా.. శ్రీనివాస్ అనే కార్యకర్తకు కాలు విరిగింది. దాంతో ఆ వ్యక్తిని తెనాలి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తెదేపా కార్యకర్తలను నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు.