తెనాలిలోని అన్న క్యాంటీన్​ వద్ద ఉద్రిక్తత.. తెదేపా నేతల ఆగ్రహం

-తెనాలిలో అన్న క్యాంటీన్ తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది
– ట్రాఫిక్​కు ఇబ్బందిగా ఉందంటూ అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ అధికారులు నిలిపివేశారు
– అయితే తెలుగుదేశం నేతలు ఆహారం తీసుకుని వస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది
– పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు
– మున్సిపల్ అధికారులు వెనక్కు వెళ్లిపోయారు

గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్​ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న తెదేపా ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అయితే ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని ఇక్కడ అన్నదానం చేయొద్దంటూ 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అన్న క్యాంటీన్​కు పోటీగా అక్కడే వైకాపా నేతలు కూడా 5 రోజుల క్రితం క్యాంటిన్ ఏర్పాటు చేశారు. ఈ ఉదయం వైకాపా టెంట్‌ను అధికారులు తొలగించారు. తెదేపా వాళ్ల టెంట్ ఆహారం పంపిణీ చేశాక వాళ్లే తీసుకెళ్తున్నారు. రోజు మాదిరిగానే ఇవాళ కూడా అన్నదానం చేస్తామని తెదేపా నేతలు ప్రకటించారు. అయితే ఆహారం తీసుకువస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వేరే చోటికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన తెదేపా కార్యకర్తలు వాహనంలో నుంచి కొంత ఆహారాన్ని తీసుకుని మున్సిపల్ మార్కెట్ వద్దకు చేరుకున్నారు. మార్కెట్ సమీపంలోని పురవేదిక వద్ద ఆహార పంపిణీ చేపట్టారు.

అక్కడకూ చేరుకున్న మున్సిపల్ అధికారులు ఆహార పంపిణీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. మున్సిపల్ అధికారుల తీరును నిరసిస్తూ తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. పేదల కడుపు కొట్టొద్దని అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. మున్సిపల్ అధికారులు వెనక్కు తగ్గి అక్కడినుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో వైకాపా శ్రేణులు మున్సిపల్ మార్కెట్ వద్ద అన్నదానానికి యత్నించారు. ఐతే తమకు ఆంక్షలు విధించి వైకాపా వారిని ఎలా అనుమతిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. మార్కెట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం నేతలను నిలువరించేందుకు ముళ్ల కంచెలు వేశారు. ఈ క్రమంలో కొందరు తెదేపా నాయకులకు గాయాలయ్యాయి. పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అన్న క్యాంటీన్ అడ్డుకునేందుకు తెనాలి మున్సిపల్‌ మార్కెట్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించడాన్ని తెలుగుదేశం నేతలు తప్పుపట్టారు. దుకాణాలు మూసివేయించి నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారని మండిపడ్డారు.

Leave a Reply