గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అఖండ చిత్ర బృందం ప్రతినిధులు ప్రతినిధిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీంద్ర రెడ్డి, చిత్ర బృందం ప్రతినిధులకు ఆలయ అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. మొదటిగా లక్ష్మీ నృసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో అర్చకులు స్వామి వారి తీర్ధప్రసాదాలని అందజేసి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఇంచార్జ్ ఈఓ రామ కోటిరెడ్డి స్వామివారి జ్ఞాపికని చిత్ర బృందానికి అందజేశారు. బాలకృష్ణ, ఇతర చిత్ర బృందాన్ని చూసేందుకు ఆలయం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
మల్టీస్టారర్ చేస్తా
‘అఖండ’ చిత్ర బృందం విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ‘అఖండ’ చిత్రం విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యమొచ్చిందన్నారు. ‘‘అఖండ సినిమా ఘన విజయం సాధించడం
ఆనందంగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులందరూ కలిసి సకుటుంబసపరివార సమేతంగా థియేటర్లకు వస్తున్నారు. మన సనాతన ధర్మాన్ని తెలియజేసిన చిత్రం ‘అఖండ’. దర్శకులు మంచి కథతో వస్తే తప్పకుండా మల్టీస్టారర్ చేస్తా. ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరల విషయంపై ‘అఖండ’ విడుదలకు ముందు మేమంతా చర్చించాం. కానీ, నిర్మాత
మిర్యాల రవీందర్‌రెడ్డి ధైర్యంగా ముందుకొచ్చి చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా బాగా వచ్చింది. టికెట్ల విషయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పుడే విడుదల చేద్దామన్నారు. టికెట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తామంటోంది. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అనంతరం మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామిని ‘అఖండ’ చిత్రబృందం దర్శించుకుంది.