– బ్రాహ్మణి రంగప్రవేశంతో మారుతున్న సమీరకణలు
– తొలిసారి బయటకు వచ్చి గళం విప్పిన యువ నేత
-తొలి అడుగులోనే సక్సెస్ అయిన బ్రాహ్మణి
– లోకేష్‌కు చాలాకాలం తర్వాత అందిన సక్సెస్
– లోకేష్ తొలి అడుగులో తడబాటు
– యువగళం పాదయాత్ర తర్వాతనే సక్సెస్
– మామగారి అరెస్టును చూపుడు వేలితో ప్రశ్నించిన అన్నగారి మనుమరాలు
– లోకేష్‌ను అరెస్టు చేసినా భయపడేదిలేదన్న బాబుగారి కోడలు
– క్యాడర్, కుటుంబంలో ఆత్మస్థైర్యం నింపిన నారా బ్రాహ్మణి
– నదురు- బెదురు లేకుండా మీడియోముందుకొచ్చిన యువతరంగం
– బ్రాహ్మణి తీరుపై మీడియాలో ప్రశంసల జల్లు
– మీడియా భేటీలో ఎక్కడా కనిపించని తడబాటు, త త్తరపాటు
– మీడియా భేటీలో ఆసాంతం వ్యక్తమైన ఆత్వవిశ్వాసం
– మహిళాలోకాన్ని కదిలిస్తున్న నవ నాయకురాలు
– బ్రాహ్మణి స్ఫూర్తితో రోడ్డెక్కుతున్న ఐటీ యువతరం
– హైదరాబాద్, బెంగళూరులో ఐటీ యూత్ నిరసన గళం
– దేశ, విదేశాల్లో రగులుతున్న తెలుగు ఐటీ ప్రొఫెషనల్స్
– ఆలస్యంగా టీడీపీకి దొరికిన యువరత్నం
-బ్రాహ్మణి రాకతో తెరవెనక్కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్
– ఇక జూనియర్ అవసరం టీడీపీకి లేదంటూ సోషల్‌మీడియాలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
కొన్ని పరిణామాలు కొత్తవారిని తెరపైకి తెస్తుంటాయి. క్లిష్ట పరిస్థితులు కొత్త వారిని నేతలుగా ఆవిష్కృరిస్తుంటాయి. ఎప్పుడూ బయటకు రాని ఓ యువతి, తన కుటుంబం-రాజకీయ పార్టీ కష్టాల్లో ఉంటే.. నేనున్నానంటూ నిర్భయంగా తెరపైకికొచ్చింది. భర్త ఢిల్లీ.. తాను గల్లీ. ఎవరి పోరాటం వారిదే. అందరి లక్ష్యం ఒకటే. మహామహా నేతలే మీడియా ప్రశ్నలకు నీళ్లు నములుతుంటే.. కొత్తగా వచ్చినప్పటికీ, నదురు- బెదురు లేకుండా.. అసలు తానొక సబ్ జూనియర్ అని కూడా మర్చిపోయి, మీడియాను ఎదుర్కొన్న ఆమె ధైర్యం అందరినీ ఆకట్టుకుంది.
తన మామ నిరపరాధి అంటూ సర్కారుపై ప్రశ్నలు సంధించిన వైనం, ఆమెలోని నాయకురాలిని ఆవిష్కరించింది. పక్కనే దిగాలుగా ఉన్న అత్తగారికి ధైర్యం చెబుతూ, చుట్టూ మహిళల రక్షణలో ఉన్న ఆ యువ తి.. మీడియా పెట్టిన తొలి పరీక్షలో సాధించిన విజయం.. ఇప్పడు ఆ పార్టీకి కొత్త నాయకురాలిని తెరపైకి తెచ్చింది. ఎంతగా అంటే.. ఇక జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం ఎప్పటికీ లేదన్నంతగా!
ఇంటర్మీడియేట్‌లో 96 శాతం మార్కులొస్తేనే సంతృప్తి చెందకుండా.. పట్టుదలతో రీ వాల్యుయేషన్ పెట్టి, 98 శాతం సాధించిన ఆ యువకెరటానికి.. ఇప్పుడు మీడియా పరీక్షలో 100 శాతం రావడం పెద్ద ఆశ్చర్యం లేదు. టీడీపీకి ఆలస్యంగా దొరికిన ఆ సివంగి పేరే నారా బ్రాహ్మణి! డాటర్ ఆఫ్ నందమూరి బాలకృష్ణ!!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత, ఆయన తనయుడు లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏ శుక్రవారం అర్ధరాత్రో, ఏ శనివారం ఉదయమే లోకేష్‌ను కూడా అరెస్టు చేసి.. టీడీపీని నిర్వీర్యం చేస్తారన్న ప్రచారం, గత కొద్దిరోజుల్లో జరుగుతోంది.
అటు లోకేష్ ఢిల్లీలో న్యాయకోవిదులతోపాటు, జాతీయ మీడియా ప్రతినిధులుతో భేటీలు వేస్తున్నారు. జాతీయ మీడియాతో లోకేష్ మాట్లాడిన తీరు, ఆయనలోని పరిణతిని స్పష్టం చేసింది. జాతీయ మీడియాలో ఎక్కడా తడబడకుండా, ఎదురు ప్రశ్నలతో తండ్రి చంద్రబాబు అరెస్టును ప్రశ్నించిన వైనం అందరినీ ఆకట్టుకుంది.
ఇక బాబు అరెస్టుతో ఆంధ్ర అగ్నిగుండమవుతోంది. నిరసనలతో ఏపీ అట్టుడుకుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అన్నీ నిరసన స్వరాలే. అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఆందోళనలే. ఈ క్రమంలో హటాత్తుగా నిరసనోద్యమంలో ప్రవేశించిన లోకేష్ భార్య, ఎన్టీఆర్ మనుమరాలు నారా బ్రాహ్మణి రంగప్రవేశం.. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హెరిటేజ్ వ్యాపారంలో బిజీగా ఉండే బ్రాహ్మణి అసలు ‘స్కిల్’ ఏమిటన్నది.. ఈ స్కిల్ కేసు తదన ంతర పోరాట పరిణామాలలో బయటపడింది. ఫలితంగా..టీడీపీకి బ్రాహ్మణి రూపంలో కొత్త కెరటం దొరికినట్లయింది.
రాజమహేంద్రవరం గడ్డపై నిలబడి.. మీడియా శరపరంరగా తనపై సంధిస్తున్న ప్రశ్నలకు ధైర్యంగా నిలబడి, జవాబులిచ్చిన బ్రాహ్మణి ఆత్మస్ఱైర్యం అందరినీ ఆకట్టుకుంది. తన మామ చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారు? ఎందుకు కేసులు పెట్టారంటూ ఆమె లాజికల్‌గా సంధించిన ప్రశ్నలు, బ్రాహ్మణిలోని నేతను ఆవిష్కరించాయి. ఎక్కడా సీఎం జగన్ పేరును ప్రస్తావించకుండా, బాబుపై బనాయించిన కేసులపైనే బ్రాహ్మణి మాట్లాడిన తీరు, రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఎందుకంటే.. రాజకీయంగా బ్రాహ్మణి నిర్వహించిన, తొలి మీడియా సమావేశం అదే. ఎప్పుడూ ఆమె ఈవిధంగా మీడియాముందుకొచ్చింది లేదు. హెరిటేజ్‌లో సమీక్షలు నిర్వహించే బ్రాహ్మణివన్నీ వ్యాపారపమైన సమావేశాలే. కానీ మీడియా ముందుకొచ్చి, మీడియా సంధించిన అన్ని ప్రశ్నలకూ నదురు-బెదెరూ లేకుండా మాట్లాడిన తీరు.. ‘బ్రాహ్మణి టీడీపీకి ఆలస్యంగా అందివచ్చిన ఆయుధం’ అన్న చర్చలకు తెరలేపినట్లయింది.
నిజానికి ఈ విషయంలో భర్త లోకేష్ కంటే.. బ్రాహ్మణి ఈ విషయంలో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయినట్లు కనిపించారు. ఎందుకంటే…లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి-ఎమ్మెల్సీ-మంత్రి అయిన చాలాకాలానికి గాని, మీడియా ముందుకు రాలేకపోయారు. వచ్చినప్పటికీ.. తడబాటు, తొట్రుపాటే. భాషాపరమైన లోపాలు బోలెడు. ఫలితంగా భయంకరమైన ట్రోలింగులకు గురయ్యారు. మంత్రి అయిన తర్వాత కూడా, మీడియాకు దూరంగా ఉండేవారు. యువగళం పాదయాత్రతో లోకేష్ తానేమిటో నిరూపించుకున్నారు. తనపై పప్పు ముద్ర వేసిన వారే, నోరు తెరిచేలా తన పనితీరు మార్చుకున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. లోకేష్ పాదయాత్రతో తనను తాను మార్చుకున్నారన్నమాట!
కానీ బ్రాహ్మణి మాత్రం.. లోకేష్‌కు భిన్నంగా తొలి ప్రయత్నంలోనే, తనను తాను నిరూపించుకున్నారు. ఆమె ఇంగ్లీష్ మీడియంలో చదివినా, చక్కటి తెలుగు.. గంభీరమైన కంఠం.. ఎదురుప్రశ్నలతో తొణుకు-తొట్రుపాటు లేకుండా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ప్రదర్శించి, ప్రత్యర్ధులను సైతం కట్టిపడేశారు. ఆరకంగా టీడీపీకి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ, కొత్త కెరటం దొరికిందన్న చర్చకు సోషల్‌మీడియాలో తెరలేచింది. ప్రధానంగా.. తన భర్త లోకేష్‌ను కూడా అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయినా తామేమీ భయపడేది లేదన్న బ్రాహ్మణి.. తెలుగుప్రజలంతా త మకు అండగా ఉండాలంటూ చేసిన అభ్యర్ధన, మహిళల హృదయానికి తాకింది. దాని ఫలితం వెంటనే కనిపించడం విశేషం.
బ్రాహ్మణి రాజమండ్రి నిరసన ప్రదర్శన, రాష్ట్రంలోని మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఫలితంగా ఏపీలో మహిళలు కొవ్వొత్తులు, నల్లచీరలు, ప్లకార్డులతో రోడ్డెక్కారు. గుంటూరులో మహిళలే ముందువరసలో నిలబడి, నిర్వహించిన నిరసన ప్రదర్శనకు రోడ్లు కిక్కిరిసిపోయాయి. చంద్రబాబుతో ఐటీ రంగంలో తెలుగువారెంత లబ్ధిపొందారన్న బ్రాహ్మణి మాటలు.. హైదరాబాద్, బెంగళూరులోని ఐటి ప్రొఫెషనల్స్‌పై విపరీతమైన ప్రభావం చూపించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లో.. చంద్రబాబు ఐటి పాలిసీతో లబ్ధి పొందిన వారంతా రోడ్డెక్కి, జగన్ సర్కారు నిర్ణయంపై నిప్పులు కురిపించారు.
నిజానికి వారంతా హైదరాబాద్-బెంగళూరు నగరాల్లో నేతల మార్గదర్శకత్వం లేకుండానే, వేలాదిగా రోడ్లపైకొచ్చి జగన్ సర్కారు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుటర్ రింగ్‌రోడ్డు ఒక్కటే కాదు. విప్రో సర్కిల్, కూకట్‌పల్లి, మియాపూర్, మణికొండ వంటి ప్రాంతాల్లో ఐటీ నిపుణులు రోడ్డెక్కి , చంద్రబాబుకు మేమున్నామంటూ నినదించడం.. బ్రాహ్మణి ప్రభావమేనన్నది నిష్ఠుర నిజం.
తాజా పరిణామాల నేపథ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి తెరపైకొచ్చి, జగన్ సర్కారుపై నిర్భయంగా సవాలు విసిరారు. ఫలితంగా.. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలంటూ ఇప్పటిదాకా డిమాండ్ చేస్తున్న వారి నిర్ణయం మారిపోయింది.
‘‘జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఇక లేదు. బ్రాహ్మణి చాలు.. పిరికిపందలకు పార్టీలో చోటు లేదు… ఎన్టీఆర్ వారసులిగా చెప్పుకోవాలంటే డైలాగులు కాదు. నిలబడి కలబడే దమ్ముండాలి. ఆ దమ్మున్న బ్రాహ్మణి వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ మనకొద్దు. కష్టాల్లో ఉన్న పార్టీని ఆదుకోని వాళ్లు ఎన్టీఆర్ వారసులు ఎలా అవుతారు?’’అంటూ టీడీపీ శ్రేణులు, కమ్మ సామాజికవర్గం సోషల్‌మీడియాలో కామెంట్లతో కలకలం సృష్టిస్తోంది.
అందులో.. చంద్రబాబు జైల్లో ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ జల్సా కోసం దుబాయ్‌కు వెళుతున్న ఫొటోలు పెట్టి మరీ, బుడ్డోడిని ట్రోలింగ్ చేస్తున్నారు. బ్రాహ్మణి ఆ రకంగా టీడీపీకి కొత్త నాయకురాలిగా, శ్రేణుల్లో చెరగని ముద్ర వేసుకున్నట్లు కనిపిస్తోంది.