Suryaa.co.in

Editorial

నందమూరి సుహాసినికి టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి

– తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా షకీలారెడ్డి
– జాతీయ నాయకత్వ జోక్యంతో కాసాని దిద్దుబాటు
– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనకు మొండిచేయి
– పదవుల్లో సీనియర్లకు తప్పని నిరాశ
-‘సూర్య’ వెబ్‌ స్టోరీ ఎఫెక్ట్‌
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఎట్టకేలకు నందమూరి కుటుంబాన్ని కరుణించారు. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడం వివాదానికి దారితీసింది.

నందమూరి కుటుంబానికి.. కాసాని మొండి చేయి చూపించిన వైనంపై, కమ్మ సామాజికవర్గం కన్నెర్ర చేసింది. తెలంగాణలో తమ ఓట్లు టీడీపీకి అవసరం లేదా అని ప్రశ్నించే స్థాయికి వారి ఆగ్రహం చేరింది. పార్టీ నాయకత్వానికి తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై నందమూరి అభిమానుల ఆగ్రహజ్వాలపై ‘సూర్య’ వెబ్‌సైట్‌ ప్రత్యేక కథనం వెలువరించింది.టీడీపీ కమిటీలో.. నందమూరికి నో! 

దీనితో పార్టీ నాయకత్వం దిద్దుబాటుకు దిగింది. తెలంగాణలో తమకు సంప్రదాయ మద్దతుదారుగా ఉన్న, ఏకైక సామాజికవర్గమైన కమ్మవర్గం దూరమైతే పరిస్థితి ఏమిటన్న దిశగా ఆలోచించిన నాయకత్వం, జరిగిన పొరపాటుపై తెలంగాణ నాయకత్వాన్ని వివరణ కోరినట్లు సమచారం. అయితే తాము సుహాసినికి ఏ పదవి కావాలని కోరినా, ఆమె మౌనం వహించారని తెలంగాణ నాయకత్వం, జాతీయ పార్టీ నాయకత్వానికి వివరణ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

దానితో నష్టనివారణకు దిగిన తెలంగాణ నాయకత్వం, సుహాసినికి రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చింది. ఆమెతోపాటు ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి చెందిన, సీనియర్‌ నేత షకీలారెడ్డికి తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలి పదవి ఇచ్చింది. సుహాసినికి పార్టీ పదవి ఇవ్వడం ద్వారా, తెలంగాణ నాయకత్వం తాను చేసిన పొరపాటును సరిచేసుకున్నట్లయిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

అయితే, పాత కమిటీలో ఉపాధ్యక్షురాలిగా చేసిన మాజీ ఎమ్మెల్యే, నగరంలో టీడీపీ తొలి మహిళా ఎమ్మెల్యే అయిన కాట్రగడ్డ ప్రసూనకు మాత్రం, ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్టీలో ఉన్న నలుగురు మాజీ ఎమ్మెల్యేలలో.. ముగ్గురికి పదవులిచ్చిన కాసాని, సీనియర్‌ నేత అయిన కాట్రగడ్డ ప్రసూనను మాత్రం విస్మరించడం విమర్శలకు దారితీసింది.

కాగా పార్టీలో ఎవరికి పదవులివ్వాలన్న అంశంపై, కొత్తగా పార్టీలోకి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్‌కు అవగాహన లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ స్థాపించిన నాటి నుంచి పనిచేస్తున్న సీనియర్ల పేర్లు కూడా, ప్రస్తుత నాయకత్వానికి తెలియకపోవడం దురదృష్టకరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పార్టీలో పనిచేసి ఆస్తులు కోల్పోయిన నేతలు, పార్టీకి పూర్తి సమయం కేటాయించి కుటుంబజీవితం నష్టపోయిన మహిళా నేతలు, ఇంకా పార్టీలో చాలామంది ఉన్న విషయం రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకపోవడం విచారకరమంటున్నారు. వీరందరికీ గుర్తింపు ఇస్తేనే పార్టీ ఆఫీసుకు మళ్లీ పాత కళ వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఈ విషయంలో నాయకత్వం.. తన కుటుంబసభ్యుడి సలహాలు-సిఫార్సుపై ఆధారపడి, నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీని నడిపించే నేత కుటుంబసభ్యులే ఇంకా బీఆర్‌ఎస్‌లో పనిచేస్తుంటే, ఇక పార్టీలో పనిచేసే వారికి నాయకత్వంపై నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.

‘ఆయన పక్కన ఉండే కుటుంబసభ్యులేమో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లుగా పనిచేస్తున్నారు. వారు ఇప్పటికీ తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరలేదు. కానీ వారి భర్తలేమో టీడీపీ ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తుంటే మేం ఎలా నమ్మాలి? కుటుంబసభ్యులు కొందరు బీఆర్‌ఎస్‌లో, మరికొందరు టీడీపీలో పనిచేస్తే, అవి ఎలాంటి సంకేతాలు పంపిస్తాయన్నది నాయకత్వం కూడా గ్రహించకపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఓ సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

దీనిపై ఇప్పటికే బయట రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయని, వాటికి తెరదించకపోతే .. టీడీపీ-బీఆర్‌ఎస్‌ బంధంపై మరిన్ని అపోహలు పెరిగే అవకాశం లేకపోలేదని, సీనియర్లు హెచ్చరిస్తున్నారు. టీడీపీలోకి ఇతర పార్టీ నేతలు చేరాలంటే.. ముందు నాయకత్వం తన కుటుంబసభ్యులను, బీఆర్‌ఎస్‌ నుంచి టీడీపీలో చేర్పిస్తేనే పార్టీపై నమ్మకం పెరుగుతుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. నాయకత్వం కుటుంబం ఒకవైపు బీఆర్‌ఎస్‌లో ఉంటే, మరోవైపు టీడీపీలో ఎవరు చేరతారన్నది సీనియర్ల ప్రశ్న.

ఇక కొన్ని దశాబ్దాల నుంచి టీడీపీ మీడియా కమిటీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాష్‌రెడ్డిని కూడా, చివరకు చంద్రబాబునాయుడు స్వయంగా ఆదేశిస్తే తప్ప.. కమిటీలో పదవి ఇవ్వని విచిత్ర పరిస్థితి నెలకొందని, పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాష్‌రెడ్డిని కాకుండా, రాష్ట్ర నాయకత్వం తన సొంత వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

పార్టీలో కొత్తగా చేరిన వారి సమర్థత-విశ్వసనీయత తెలియకుండా, వెంటనే కీలక బాధ్యతలు అప్పగించటం సమంజసం కాదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. పేరుకు ప్రకాష్‌రెడ్డికి మీడియా కమిటీలో పదవి ఇచ్చినప్పటికీ, బాధ్యతలన్నీ రాష్ట్ర నాయకత్వం నియమించుకున్న సొంత వ్యక్తులకే అప్పగించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జాతీయ నాయకత్వం ఇప్పటికయినా మేల్కొని, కుటుంబసభ్యుల పెత్తనం- జోక్యానికి తెరదించాలన్నది సీనియర్ల సూచన.

LEAVE A RESPONSE