Suryaa.co.in

Telangana

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు నందమూరి తారక రామారావు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. NTR శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల NTR ఘాట్ లోని ఆయన సమాది వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం చిత్రపురి కాలనీ వద్ద, కూకట్ పల్లిలోని మోతీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన NTR విగ్రహాలు, KPHB కాలనీ లోని వసంత నగర్ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన NTR కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించారని పేర్కొన్నారు. నటుడిగా ఆయన ఏ పాత్ర లోనైనా అట్లే జీవించేవారని, ఆ పాత్రకే ఎంతో వన్నె తీసుకొచ్చారని అన్నారు. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారని తెలిపారు.

భగవంతుడు ఎలా ఉంటారో స్పష్టంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో నేటికి ప్రజల మదిలో NTR నిలిచిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్దికి, పరిశ్రమలోని ప్రతి ఒక్కరి అభివృద్దికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ప్రజలకు ఎంతో మేలు చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టిన గొప్ప నాయకుడు NTR అన్నారు.

రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. తెలుగుజాతి గొప్ప తనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు NTR అన్నారు. రాజకీయంగా ఎంతో మందికి భవిష్యత్ ఇచ్చారని, బౌతికంగా అయన మనతో లేనప్పటికీ ఎప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.

NTR గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు. ఇలాంటి మహనీయుడి శతజయంతిని నేడు తెలుగురాష్ట్రాలలోనే కాకుండా అనేక ప్రాంతాలు, దేశాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE