Suryaa.co.in

Political News

నానీ.. ఎవరిది వెన్నుపోటు?

– హరికృష్ణకు వెన్నుపోటు పొడిచెందవరు?
– ఎన్టీఆర్‌పై హరికృష్ణ తిరుగుబాటులో ఆయన పక్కనుందెవరు?
– మరి ఆ లెక్క మీరూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లేనా?
( మురళీకృష్ణ)

కొడాలి నాని గారూ..
మీరు నాలుగో సారి గెలిచిన ఎమ్మెల్యే.. ప్రస్తుతం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి.. మంత్రిగా ఈ రెండు సంవత్సరాల 3 నెలల 15 రోజుల టైమ్ లో..
మీరు మీ శాఖ గురించిన విషయాలు చెప్పడానికి పెట్టిన ప్రెస్మీట్ లు కన్నా.. తెలుగుదేశం పార్టీని.. చంద్రబాబు ని.. లోకేష్ నీ.. దేవినేని ఉమా ని విమర్శించడానికి పెట్టిన ప్రెస్మీట్లే ఎక్కువ..
ఎస్. కచ్చితంగా రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించే మీ హక్కును ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు.. కాని ఆ ప్రశ్నించే పేరుతో మీరు లేవనెత్తే ఇష్యూస్.. మీరు వాడే భాష గురించి ప్రశ్నించే హక్కు అదే రాజకీయ ప్రత్యర్థులకు వుంటుంది..
Infact ప్రతి పౌరుడికి వుంటుంది.. అదే హక్కుతో నేడు మీకు కొన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నా.. మీరు మొన్నటి ప్రెస్ మీట్ లో చంద్రబాబు ని వెన్నుపోటు దారుడు.. NTR ని అల్లుడుగా పక్కన వుంటూనే, వెన్నుపోటు పొడిచారు అని చెప్పారు కదా? అదే వెన్నుపోటు పదం ఆధారంగానే మీరు సమాధానం చెప్పాలి..

ఎవరు? ఎవరికి? ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు?ఎవరి పాత్ర ఏంటి?
1995 కు మునుపు మీకు స్వర్గీయ హరికృష్ణతో ఎప్పటి నుండి పరిచయం వుందో నాకు తెలియదు కానీ.. మీరూ అలాగే అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ ఆరోజుల్లో హరికృష్ణకి అతి ముఖ్యమైన అనుయాయులు గానే మా అందరికీ తెలుసు. ఇంకా శ్రావణ్ మాజీ మంత్రి అన్నాబాత్తుని సత్యనారాయణ కొడుకుగా అందరికీ తెలుసు. మీరే ఎవరికి తెలియదు.ఆ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని విషయాలు, బహుశా ఇప్పటి తరానికి తెలియక పోవచ్చు. కానీ అలాగే ఫ్రెష్ గా గుర్తుంచుకునే నా బోటి చాలా మంది వుంటారు.

అన్నగారి జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశం వల్ల వారి కుటుంబంలో 1993 కు ముందే చాలా విభేదాలు వచ్చింది వాస్తవమా కాదా? వారి ద్వితీయ వివాహంను అయన సంతానంలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించింది వాస్తవమా కాదా? అయినా వారి అభీష్టం మేరకే వివాహం జరిగింది వాస్తవమా కాదా? ఇది వారి వ్యక్తిగత జీవితం.. వారి కుటుంబ అంతర్గత సమస్య.. దీని వరకు బయట వ్యక్తులకు అసలు సంబంధమే లేదు.. కాని వారు నాటి ప్రతిపక్ష నేత.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. మాజీ ముఖ్యమంత్రి.. అలాగే ఆంధ్రుల ఆరాధ్య నటులు కాబట్టి కొంచం విస్తృతంగానే చర్చ జరిగింది.

1994 జనవరిన గుంటూరులో జరిగిన రైతు సదస్సుకు అన్నగారు తన ద్వితీయ భార్యగా లక్ష్మీపార్వతిని బహిరంగంగా పార్టీ శ్రేణులు ముందుకు తెచ్చారు.. ఆమె పుట్టిన జిల్లా.. ఆమె మొదటి వివాహం చేసుకున్న జిల్లా.. అమె గత జీవితం అంతా తెలిసిన జిల్లాలోనే మొదటిగా అన్నగారు తన భార్యగా ప్రజలకు పరిచయం చేశారు.. అది కూడా ఒక రాజకీయ సభకు తీసుకుని రావడం ద్వారా.. వేదిక మీద కూర్చోపెట్టడం ద్వారా.

ఆ తరువాతి క్రమంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా, అన్నగారు తనతో పాటే ఆమెను కూడా చైతన్య రథంపై కూర్చోబెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అలాగే పార్టీ కూడా ఘన విజయం సాధించింది.ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది.. ఆ ఎన్నికలు అన్నగారు రెండో పెళ్లి అజెండాగా జరిగాయా? లేక 89–94 మధ్య కాంగ్రెస్ పార్టీ యధావిధిగానే మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం.. అంతకు ముందే హైదరాబాద్ లో జరిగిన మతఘర్షణలు.. నాటి జమ్ములమడుగు ఎమ్మెల్యే శివారెడ్డి ఒక పెళ్లికి హాజరు అయితే అక్కడ బాంబులు వేసి చంపడం.. దిగజారిన శాంతి భద్రతలు.. అవినీతి ఆరోపణలు.. ఆరోజుల్లో ఉవ్వెత్తున జరుగుతున్న సారాయి వ్యతిరేక ఉద్యమం కు టిడిపి బహిరంగ మద్దతు ఇవ్వడం.. అన్నగారు సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఆధారంగా జరిగాయా?

అంతటి ఘన విజయం ప్రజలు కట్టబెట్టింది లక్ష్మి పార్వతిని వారి వివాహంను ఆమోదించడానికి ఇచ్చిన తీర్పు కాదు అనేది నిర్వివాదాంశం. మరి అన్నగారు ముఖ్యమంత్రిగా సీఎంగా బాధ్యత చేపట్టిన తరువాత.. అమె పార్టీ నిర్వహణలో.. పదవులు ఇప్పించడంలో.. నాయకుల మీద ఆధిపత్యం చూపించడంలో.. కొందరు ప్రాధాన్యం తగ్గించడంలో.. ఇంకొందరికి ఆయాచిత ప్రాధాన్యం ఇప్పించడంలో ఇన్వాల్వ్ అవ్వటం నిజమా కాదా.?? ఇది పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తికి దారి తీసింది నిజమా కాదా?

ఇటువంటి పరిస్థితిలో అన్నగారి సమక్షంలో ఈ విషయాలు మాట్లాడే సాహసం దీన్ని ప్రతిఘటించే ధైర్యం ఎవరో ఒకరు చేయాలి అని అందరూ భావిస్తున్నది నిజమా కాదా? అన్నగారు ఆ ఎన్నికలో హిందూపూర్.. టెక్కలి రెండు చోట్ల నుంచి గెలిచి, తదుపరి టెక్కలికి రాజీనామా చేశారు.. సో ఆ టెక్కలి ఉపఎన్నికలో ఆమెను నిలబెట్టి ఇక పాలనలో కూడా ఆమెను ఇన్వాల్వ్ చేస్తారు అనే చర్చ జరిగిందా లేదా? అటువంటి స్థితిలో పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం చేసి అన్నగారిని అసెంబ్లీ ప్రాంగణంలో కలిసి..టెక్కలి టికెట్ తనకు ఇమ్మని స్వర్గీయ హరికృష్ణ అడిగింది వాస్తవమా కాదా? సో ప్రతిఘటన ముందుగా బహిరంగంగా మొదలు పెట్టింది హరికృష్ణా ? చంద్రబాబా ? ఆ తరువాతి క్రమంలో హరికృష్ణ ” హరి సేన” పేరిట రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వచ్చారా లేదా?hari-kodali ఆ రోజుల్లో అయన వెంట నడిచిన అతి ముఖ్యమైన అనుయాయులలో మీరు వున్నారా లేదా? ఈ పర్యటనలు లక్ష్మి పార్వతి ఇన్వాల్వ్మెంట్ కు వ్యతిరేకంగా జరిగాయా? లేక ఆమెకు మద్దతుగా జరిగాయా? ఆమెకు వ్యతిరేకం అంటే అన్నగారికి వ్యతిరేకంగా జరిగినవి కాదా?సో కొడాలి నాని అనే వ్యక్తి హరికృష్ణ ముఖ్య అనుచరుడుగా ప్రజానీకానికి తెలిసింది అన్నగారికి వ్యతిరేకంగా, తమరు చేపట్టిన తిరుగుబాటు వలనే.ఇప్పుడు ఎవరు వెన్నుపోటు దారుడు?

ఆ తరువాత ఆగస్ట్ నాటికి అది మరీ పీక్ కి చేరి ఎమ్మెల్యేలు కూడా ఎదురు తిరిగి మొత్తం పార్టీయే చీలే వరకు దారి తీసి… నాడు, రాష్ట్ర వ్యాప్త పార్టీ కేడర్ అటు పార్టీ బాధ్యత ప్రభుత్వ బాధ్యత చంద్రబాబు చేపట్టడం ఆమోదించింది వాస్తవమా కాదా? మరి ఆరోజున హరికృష్ణ కూడా మంత్రివర్గంలో చేరింది వాస్తవమా కాదా?

Kodali-Nani-babuమరి దీనికి నిరసనగా అన్నగారు నల్ల బట్టలు వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసినప్పుడు, మీరు ఎవరి పక్షాన వున్నారు? ఆ తరువాతి క్రమంలో హరికృష్ణ బాబుతో విభేదించి స్వంతంగా “అన్న తెలుగుదేశం”పార్టీ పెట్టుకున్నప్పుడు మీరు టిడిపినీ కాదని ఆయనతో వెళ్ళారా లేదా..? ఆ ఎన్నికలో వారు మీ గుడివాడలోనే పోటీ చేశారు. మరి మీరు ఆయన్ను గెలిపించలేక పోయారే? టిడిపి అభ్యర్థి చేతిలో వారు ఓడారు కదా. మరి 2004 ఎన్నికలు నాటికి హరికృష్ణకి బాబుకి మధ్య ఇంకా సఖ్యత ఏర్పడలేదు. వారు రాజకీయంగా అజ్ఞాతంలో వున్నారు. అయినా మీరు ఆయన్ను వదిలి, జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో మళ్లీ బాబు దగ్గరకు వచ్చి, గుడివాడ టికెట్ ఎందుకు తీసుకున్నారు? హరికృష్ణ కి మీరు చేసిన దానిని ఏమనాలి? అది ఆయనకు మీరు పొడిచిన వెన్నుపోటు కాదా?

నేడు మీరు repeated గా చెప్పే వెన్నుపోటు దారుడు దగ్గరకు ఎందుకు వచ్చారు? ఎందుకు పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు? మరి మళ్లీ 2009 లో కూడా అదే బాబు దగ్గర టికెట్ తీసుకుని మళ్లీ గెలిచారు కదా? కాని టిడిపి ఎమ్మెల్యేగా వుండి నాటి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడుతో సంబంధాలు నడుపుతూ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరూ?

మీరు బాబుని నిత్యం వెన్నుపోటు దారుడు అనే శుద్ధ పూసలా? మీరు నేను రేపటి మన భవిష్యత్తును మార్చుకోగలం కాని గడచిన గతంను చరిత్రను మార్చలేము.. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాను ఇప్పుడు మంత్రిగా వున్నా.. నేను ఏది చెప్పినా ఏది మాట్లాడినా చెలామణి అవుతుంది.. సత్యాన్ని కప్పిపెట్టగలను.. పెద్ద గొంతుతో అధికార అహంకారంతో ఉచ్ఛం నీచం మరచిన భాషతో చిన్నా పెద్దా లేకుండా తులనాడితే నిజం అబద్ధం అవుతుంది అనే భ్రమ నుంచి బయటకు రండి. చరిత్ర తెలియని నేటి తరానికి మీ అబద్ధాలు నిజం అనిపించవచ్చు. కాని అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం చాలా మంది వున్నాము. మేము పక్కాగా నిజాలు చెప్తాము. మీ అసభ్య భాష మీ సంస్కారాన్ని బయట పెడుతుంది తప్ప.. మీరు బెదిరిస్తే బెదిరిపోయి చరిత్ర తన పేజీలు తాను చింపు కోదు… ఒక వేలు మీరు బాబు గారి వైపు చూపితే మిగిలిన నాలుగు వేళ్ళు మీ వైపే చూపుతున్నాయి..మారండి.. గౌరవంగా, హుందాగా మీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి.

LEAVE A RESPONSE