Suryaa.co.in

Andhra Pradesh

నారా…ఎంతో హుందా!

విజయవాడలో వెటరన్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టు విస్తృత చర్చ అవుతుంది. ఏ చానల్ కు చెందని…ఏ పేపర్ లో ప్రస్తుతం పని చెయ్యని ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ అరెస్టు పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేక వ్యక్తం అవుతుంది. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత పై వార్తను ఆయన వాట్స్ యాప్ లో ఫార్వర్డ్ చేశారనేది అభియోగం. 73 ఏళ్ల వయసున్న ఒక పెద్దాయను అరెస్టు చేసి తరలించడంపై రాష్ట్రంలోని మీడియా వర్గం అంతా షాక్ కు గురయ్యింది.

ఒకవేళ అంకబాబు గారు ఏదైనా తప్పు చేసి ఉంటే నోటీసులు ఇచ్చి విచారణ జరపవచ్చు. కానీ రాత్రికి రాత్రి ఇలా అరెస్టు చేసి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏ ముంది అనే విమర్శలు వచ్చాయి. అయితే ఓ రెండు మూడు చానల్స్ తప్ప అందరూ ఈ అరెస్టు వార్తకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రింట్ మీడియా కూడా బాగానే కవర్ చేసింది.

ఇప్పుడు ఇక అసలు విషయానికి వద్దాం. అంకబాబు అరెస్టుపై టిడిపి అధినేత చంద్రబాబు స్పందన నిజంగా ఆయనపై గౌరవం పెంచింది. రాత్రి 8.30 గంటల సమయంలో ఆయనకు పార్టీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే వేగంగా స్పందించారు. అడ్వకేట్లను సిఐడి కార్యాలయానికి పంపారు. పార్టీ నేతలను కుటుంబ సభ్యుల వద్దకు పంపారు. వెంటనే డిజిపి కి లేఖ రాశారు. అరెస్టు ఖండించడం ద్వారా, కుటుంబ సభ్యులతో మాట్లాడడం ద్వారా వారికి మనో ధైర్యం ఇచ్చారు. ఆర్థరాత్రి వరకు కేసు అంశంపై ఆరా తీసిన చంద్రబాబు…ఉదయం 5 గంటలకే మళ్లీ అడ్వకేట్ల నుంచి అప్ డేట్ అడిగారు. అంకబాబు ఆరోగ్యపరిస్థితిపైనా విచారించారు.

వాస్తవంగా చూస్తే అంకబాబు ఏమీ టిడిపి అనుకూల జర్నలిస్ట్ కాదు. ఆయన మీడియా గ్రూప్ లలో తనకు వచ్చిన టిడిపి వ్యతిరేక ప్రకటనలు కూడా ఎప్పుడూ షేర్ చేస్తూనే ఉంటారు. వచ్చిన సమాచారం వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలకు, ప్రముఖులకు, మీడియా వారికి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో ప్రభుత్వ అనుకూల వ్యతిరేక ప్రకటనలు ఉంటాయి…. ప్రతిపక్ష అనుకూల వ్యతిరేక ప్రకటనలు కూడా ఉంటాయి. అంకబాబు పోస్టుల వల్ల టిడిపికి ప్రత్యేకంగా జరిగే లాభం కూడా ఏమీ లేదు.

కానీ అంకబాబును ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చూసి చంద్రబాబు స్పందించిన విధానం చాలా హుందాగా ఉంది. పార్టీలు, అభిప్రాయాలు, వ్యక్తులు, వ్యవస్థలు ఎలా ఉన్నా…..ఒక సీనియర్ పొలిటీషియన్ గా కష్టంలో ఉన్న జర్నలిస్ట్ విషయంలో ఆయన తీసుకున్న చొరవ నిజంగా అభినందనీయం. పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే ఒక జర్నలిస్ట్ ను ఈ ప్రభుత్వం అరెస్టు చేస్తే…..అతను తమ వాడా కాదా అని లెక్కలు వేసుకోకుండా, ఒక జర్నలిస్ట్ అరెస్టుపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయం.

:- గాంధీ, సీనియర్ జర్నలిస్ట్,
విజయవాడ

LEAVE A RESPONSE