జగన్ పరీక్షలో 27 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్

-పనితీరు మార్చుకోకపోతే మార్చేస్తానని హెచ్చరిక
-9 నుంచి 27కు పెరిగిన ఫెయిలయిన ఎమ్మెల్యేల సంఖ్య
-గడప గడపకూ కార్యక్రమంలో వారసులు వద్దు
-జుట్టుంటే ఎన్ని ముళ్లైనా వేసుకోవచ్చు
-ఆరునెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తా
-ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, సమన్వయకర్తలతో జగన్ భేటీ
-గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్

తన పరీక్షలో ఫెయిలవుతున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు ఆందోళన కలిగిస్తోంది. గతంలో కేవలం 9మంది ఎమ్మెల్యేల పనితీరు మాత్రమే బాగోలేదని గుర్తించిన జగన్.. ఈసారి ఆ సంఖ్య 27కు పెరగడమే దానికి కారణం. దానితో ఆగ్రహించిన జగన్ గడప గడపకు ప్రభుత్వంలో అంతా తప్పనిసరిగా పాల్గొని, 100 శాతం ప్రజల ఇళ్ల తలుపు కొట్టాల్సిందేనని ఆదేశించారు. దానితోపాటు.. ఆరునెలలకు ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తానని మరో బాంబు పేల్చారు. గడప గడపకూ ప్రభుత్వంలో వారసులు పాల్గొనవద్దని, ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనాలని జగన్ ఆదేశించారు.

ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. మరో మూడు నెలల టైమ్ కూడా ఇచ్చారు. పని తీరు మెరుగుపర్చుకోండి… దొడ్డిదారిన అధికారంలోకి రావడం కుదరదని తేల్చి చెప్పారు. పనితీరు సరిగా లేకుంటే ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరు సహా నేతల పనితీరుపై చేసి సర్వే నివేదికను వెల్లడించారు. 27 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగో లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సమీక్షలో కేవలం 9 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగో లేకపోగా… ఈ సారి ఆ సంఖ్య 27 కు పెరగడంతో వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పనితీరు లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు.

వచ్చే ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని, తీరు మార్చోకోని వారి స్థానంలో పెట్టి మరొకరికి అవకాశం ఇస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో రేపు మనల్ని మనం గెలిపించుకోవడంycp-mlas1 కోసమే గడప గడపకు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపిన సీఎం..ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో 100 శాతం ఇళ్లను సందర్శించాలన్నారు. కార్యక్రమంలో ఎక్కడైనా షార్ట్‌కట్స్‌ ఉపయోగిస్తే నష్టపోయేది మనమే అన్నారు. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్‌ ఉండవని, షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్‌ అవుతామని, ఇది చాలా ముఖ్యమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలన్నారు.

ఇవాళ్టి నుంచి ఎన్నికలకు బహుశా 19 నెలలు ఉందని , ప్రతిరోజూ పరీక్షలకు సిద్ధం అవుతున్నామని భావించి అంతా అడుగులు వేయాలని, అలా చేయకపోతే పని చేయకపోతే నష్టపోయేది మనమే అన్నారు. గడపగడపకూ కార్యక్రమాన్ని నిర్దేశించుకున్న విధంగా సంపూర్ణంగా పూర్తిచేయాలన్నారు. ప్రతి సచివాలయానికి 20 లక్షల నిధులు ఇస్తున్నామని, గ్రామానికి బాగా ఉపయోగపడే వాటిపై ఖర్చు చేయాలన్నారు. గ్రామ సచివాలయాల్లో ఎమ్మెల్యే తిరిగినప్పుడు కేటాయించిన నిధుల ప్రకారం పనులు మంజూరుచేయాలని,సమస్య దృష్టికి రాగానే, అప్పటికప్పుడే ఆ పని మంజూరు చేసి, సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు.

రీజినల్‌ కోఆర్డినేటర్లుగా ఉన్నవారు మరింత బాధ్యతగా ఉండాలి. గడప గడపకూ విషయంలో ఎవరైనా వెనకబడినట్టు ఉంటే వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ , సూచనలు సలహాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తిరిగి డిసెంబరులో మొదటి రెండు వారాల్లో తిరిగి సమావేశం ఉంటుందని , అప్పటి వరకు మరో 70 రోజుల సమయం వస్తుంది కాబట్టి కాబట్టి నెలకు 16 రోజులపాటు తిరగాలన్నారు. ప్రతి సచివాలయంలో ప్రతి ఇల్లు తిరగాలని , ప్రతి సచివాలయంలో కనీసం మూడు రోజులైనా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు.

వారసులను పాల్గొనవవద్దు
ప్రస్తుతం ఉన్న పరిస్ధితులన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని సీఎం అన్నారు. 98.4 శాతం హామీలు అమలు చేశామని, 1.71లక్షల కోట్లు డీబీటీ రూపంలో అందించామన్నారు. గతంలో వైఎస్ ఆర్ ప్రభుత్వంలో కంటే ఎక్కువగా ఇప్పుడు లబ్ది జరుగుతోందన్నారు. సానుకూల పరిస్ధితులను మనకు అనుకూలంగా మార్చుకోవడం అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం 175కు 175 కొట్టాలి. ఒక్క సీటు కూడా మిస్‌కాకూడదన్నారు.

రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు మంచి జరిగిందని, ప్రతి ఇంటికీ మంచి చేశామని లెటర్‌ కూడా తీసుకుని వెళ్తున్నామని, దీనికి స్పందనగా ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. నెలలో కనీసం 16 రోజులు గడప గడపకూ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ప్రతి ఇంటికీ పోయి, తిరిగితేనే మన గ్రాఫ్‌ పెరుగుతుందన్నారు. కొందరు తమ గ్రేడ్‌ పెంచుకోవాల్సి ఉందని, ఎవరినీ పోగొట్టుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. వారి గేర్‌ మార్చడమే తన లక్ష్యమన్నారు.

ఎన్నికలకు 6 నెలల ముందు సర్వే చేయిస్తానని, ప్రజాదరణ ఉంటేనే మళ్లీ టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. కొంతమంది తమ వారసులను గడప గడపకు కార్యక్రమంలో తిప్పుతున్నారని ఇదిసరైంది కాదన్నారు. ఎమ్మెల్యేలే కార్యక్రమంలో పాల్గొనాలని, వారి పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు ఇస్తామన్నారు. గ్రాఫ్‌ పెంచుకోవడానికి అవసరమైన రకాల అస్త్రాలు నేతల చేతుల్లో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు.

మనల్ని నమ్ముకుని కొన్ని కోట్ల మంది ఉన్నారని, వారికి మనం జవాబుదారీ తనంగా ఉన్నామన్నారు.. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చుని, జుట్టు లేకపోతే ముడేసుకోవడానికి ఏమీ ఉండదన్నారు. అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయగలుగుతామని, దీనికోసం 175కి 175 లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ కాకూడదని, దానికోసం అందరూ కష్టపడాలన్నారు.

Leave a Reply