Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల‌పై ఉక్కుపాదమా?

-మీరిచ్చిన హామీలు నెర‌వేర్చ‌మంటే ఈ నిర్బంధాలేంటి సీఎం గారు
-సీపీఎస్ ఉద్యోగుల‌కి పోలీసుల టార్చ‌ర్‌పై టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం

ప్ర‌తిప‌క్షంలో వున్న‌ప్పుడు మీరు ఇచ్చిన మాట నెర‌వేర్చాల‌ని ఉద్యోగులు డిమాండ్ చేయ‌డ‌మే దేశ‌ద్రోహంగా సీపీఎస్ ఉద్యోగుల ఉద్య‌మంపై ఉక్కుపాదం మోప‌డం దారుణ‌మ‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉద్యోగుల అక్ర‌మ అరెస్టులు, నిర్భందాల‌ను ఖండిస్తూ గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

అడ్డ‌గోలుగా హామీలిచ్చి అడ్డ‌దారిలో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌రెడ్డి గారు ఉద్యోగుల డిమాండ్ల ప‌ట్లా అన్యాయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ని రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి ప్రారంభిస్తానని మీరు ఇచ్చిన హామీని నెర‌వేర్చ‌మంటే సీఎం జ‌గ‌న్‌రెడ్డి అభ‌ద్ర‌తాభావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జ‌గ‌న్‌రెడ్డి సీఎం అయి మూడేళ్లు గడిచి నాలుగో ఏడాదిలోకి వ‌చ్చినా త‌మ‌కు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఉద్యోగులు నిరసనల బాట పడితే, వారిని ఉగ్ర‌వాదుల్లా అరెస్టు చేయించి సీఎం త‌న ఫ్యాక్ష‌న్ బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకున్నార‌ని లోకేష్ ఆరోపించారు.

న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న‌కి శాంతియుతంగా నిరసనలు తెలిపే హ‌క్కునీ హ‌రించ‌డం ముమ్మాటీకీ నియంతృత్వ పోక‌డేన‌ని విమ‌ర్శించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, ఓపిఎస్‌ అమలు చేయాలని డిమాండ్ల‌తో ఏపీసీపీఎస్ఈఏ సెప్టెంబ‌ర్ 1వ తేదీన విజ‌య‌వాడ‌లో శాంతియుత నిర‌స‌న‌ల‌కి పిలుపునిస్తే…99 శాతం మంది ఉద్యోగుల‌పై బైండోవ‌ర్లు, ముంద‌స్తు నిర్బంధం, అక్ర‌మ అరెస్టులు చేయ‌డం నిరంకుశ‌పాల‌న‌కి ప‌రాకాష్టగా మారింద‌న్నారు. పోలీసుల వేధింపులు, బెదిరింపులు, బాండ్లు రాయించుకోవ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కి గురైన ఉద్యోగులు నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 11కి వాయిదా వేసుకున్నా… క‌క్ష క‌ట్టినట్టు పోలీసులు స్కూళ్ల‌లో చొర‌బ‌డి భ‌య‌కంపితులు చేయ‌డం చాలా దారుణ‌మ‌ని నారా లోకేష్ ఆ ప్ర‌క‌ట‌న‌లో ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఉద్య‌మంలో పాల్గొంటే తీవ్ర ప‌రిణామాలు వుంటాయ‌ని ఉద్యోగుల కుటుంబ‌స‌భ్యుల‌ని బెదిరించే స్థితికి జ‌గ‌న్‌రెడ్డి దిగ‌జారిపోవ‌డం స‌ర్కారు ప‌త‌నానికి సంకేత‌మ‌ని హెచ్చ‌రించారు. ఉద్యోగుల న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న‌కి సాగుతున్న శాంతియుత ఉద్య‌మానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఉద్యోగులు, ఉద్యోగ‌సంఘ నేత‌ల‌పై పెట్టిన అక్ర‌మ కేసులు, బైండోవ‌ర్లు అన్నీ బేష‌ర‌తుగా ఎత్తేయాల‌న్నారు. ఉద్యోగుల‌కి ఇచ్చిన హామీ మేర‌కు సీపీఎస్ ర‌ద్దు చేయాల‌ని, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని లోకేష్ ఆ ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE