– గ్యాంగ్రిన్‌తో కాలు తీసేసే పరిస్థితిలో నారా లోకేష్ వైద్యం చేయించారు
– కోలుకున్నాక, జారిపడడంతో కాలు ఫ్రాక్చర్..మరోసారి లోకేష్ సాయం
– నారా లోకేష్‌కి కృతజ్ఞతలు తెలిపిన అంజిరెడ్డి తాత
– చంద్రబాబు ప్రమాణస్వీకారం చూడాలని ఉందని కోరిక వెలిబుచ్చిన అంజిరెడ్డి తాత
– తెలుగుదేశం పార్టీ కూటమి ఘనవిజయం తప్పదని అంజిరెడ్డి తాతకి చెప్పిన యువనేత
– మీకు ఏం కాదు, అండగా తెలుగుదేశం పార్టీ ఉందని ధైర్యం చెప్పిన లోకేష్
మీసం మెలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం వారిని నామినేషన్లు వేయకుండా వైకాపా అడ్డుకుంటున్న వేళ, పసుపు జెండా అండగా, నామినేషన్ వేస్తామంటూ 80 ఏళ్ల అంజిరెడ్డి తాత మీసం మెలేసి తొడగొట్టాడు.
తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవ పతాకానికి ప్రతీక అయితే, అంజిరెడ్డి తాత తెలుగుదేశం పసుపు సైన్యం ధైర్యానికి ప్రతీక. చిత్తూరు జిల్లాకి చెందిన అంజిరెడ్డి తాత వయస్సు 80 ఏళ్లు పైనే. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కాలు ఇన్ఫెక్షన్ తీవ్రమైంది. గ్యాంగ్రిన్ కుడికాలు తీసేయాలి అన్నారు వైద్యులు. కుటుంబసభ్యులు నారా లోకేష్‌కి సమాచారం అందించారు. టిడిపి కార్యకర్తల సంక్షేమ విభాగానికి అంజిరెడ్డి తాత వైద్యం బాధ్యతలు అప్పగించారు లోకేష్. నెలరోజుల పాటు ఆస్పత్రిలో ఉండి కోలుకున్నారు. మొత్తం ఖర్చు, పర్యవేక్షణ లోకేష్ చూసుకున్నారు.
అంజిరెడ్డి తాత మామూలు అయ్యారు. ఈ సారి కాలుజారి పడగా, ఇన్ఫెక్షన్ తగ్గిన కాలు ఫ్రాక్చర్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న నారా లోకేష్ మరోసారి తన టీమ్‌తో వైద్యసాయం అందించారు. విరిగిన కాలుకి ప్లేటు వేశారు. ఆస్పత్రిలో 15 రోజులుండి వచ్చిన అంజిరెడ్డి తాత ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
తనకు వైద్యం చేయించిన లోకేష్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తొండవాడలో ఉన్నారని తెలిసి కుటుంబంతో కలిసి వచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు అంజిరెడ్డి తాత. లోకేష్‌ని చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఎందుకు తాతా ఇంత కష్టపడి వచ్చావు అంటే..నిన్ను చూద్దామని అంటూనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడం చూడాలని కోరిక అని అంజిరెడ్డి తాత వెల్లడించారు.
`ధైర్యంగా ఉండండి..నేనే కాదు, యావత్తు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని మరిచిపోదు తాతా…`అంటూ లోకేష్ అనునయించారు. తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించడం, చంద్రబాబు ప్రమాణస్వీకారం మీరు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు లోకేష్.